క్రూడ్ ఆయిల్ ధరలు కూల్.. ఆసియా మార్కెట్లు గ్రీన్.. భారత స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ అదుర్స్..
ఆసియా మార్కెట్లలో వ్యక్తమైన సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరల్లో క్షీణత నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నాటి ప్రారంభ ట్రేడింగ్‌ను లాభాలతో ప్రారంభించాయి. ప్రారంభంలో బిఎస్ఈ సెన్సెక్స్ 165.37 పాయింట్లు పెరిగి 74,479.96 వద్దకు చేరగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 52.35 పాయింట్ల లాభంతో 23,322.95 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ప్రధాన సూచీల కంటే కూడా విస్తృత మార్కెట్‌లో కొనుగోళ్ల ఉత్సాహం స్పష్టంగా కనిపించింది.
నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.52 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.86 శాతం చొప్పున లాభపడగా.. నిఫ్టీ50 విభాగంలో ఎటర్నల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండిగో షేర్లు అగ్ర లాభపడిన వాటి జాబితాలో నిలిచాయి. రంగాలవారీగా పరిశీలిస్తే నిఫ్టీ రియల్టీ అత్యధికంగా పుంజుకోగా.. ఐటీ రంగానికి చెందిన టీసీఎస్ షేర్లలో వ్యక్తమైన ఒత్తిడి వల్ల నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 1 శాతం క్షీణతను నమోదు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సానుకూల సంకేతాలు భారత మార్కెట్‌కు ప్రధాన కొండంత అండగా నిలిచాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల వైఖరిపై ఆందోళనలు ఉన్నప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై పెట్టుబడిదారుల నమ్మకం కొనసాగడంతో నాస్‌డాక్ 1.69 శాతం, ఎస్&పి 500 1.14 శాతం, డౌ జోన్స్ 0.61 శాతం లాభపడి ముగిశాయి. ఇదే బాటలో ఆసియా-పసిఫిక్ మార్కెట్లలోనూ కొనుగోళ్లు వెల్లువెత్తాయి.
జపాన్ నిక్కీ 0.56 శాతం, దక్షిణ కొరియా కోస్పి 2.06 శాతం మేర పుంజుకున్నాయి. విదేశీ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై ఆశలు పెరిగి పశ్చిమ ఆసియా ఆందోళనలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు $104.02 వద్దకు చేరి వరుసగా మూడో రోజు బలహీనపడటం భారత ఆర్థిక వ్యవస్థకు, రూపాయి మారకానికి గొప్ప ఊరటనిచ్చే అంశంగా మారింది.
మరోవైపు ఐపీఓ మార్కెట్ సైతం తీవ్ర సందడితో కొనసాగుతోంది. నేడు వీగాలాండ్ డెవలపర్స్ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుండగా.. గ్రే మార్కెట్‌లో రూ. 8.50 ప్రీమియంతో రూ. 148.85 వద్ద లిస్ట్ కావచ్చునని అంచనాలు ఉన్నాయి. ఆక్సియమ్ గ్యాస్ ఇంజనీరింగ్ ఐపీఓ కొత్తగా నేడు ప్రారంభం కాగా, సోనాసెలెక్షన్ ఇండియా, స్పెక్ట్రాఏ టెక్నాలజీ, ఖేరియా ఆటోకాంప్ ఐపీఓలు రెండో రోజు బిడ్డింగ్‌కు సిద్ధమయ్యాయి.
ఎస్ఎస్ రిటైల్, జిందాల్ సుప్రీం, హీరో మోటార్స్ ఐపీఓలకు నేడే చివరి రోజు. అయితే, టాటా సన్స్ లిస్టింగ్ మరియు యాజమాన్య మార్పు వివాదాల కారణంగా టీసీఎస్, టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్స్, టాటా మోటార్స్ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుండటం, ముడి చమురు ఇంకా బ్యారెల్‌కు $100 పైననే కొనసాగుతుండటం వల్ల ఈ ప్రారంభపు ర్యాలీపై మార్కెట్ వర్గాలు జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తున్నాయి.


Click it and Unblock the Notifications

