స్టాక్ మార్కెట్ 4వ రోజు కూడా ఢమాల్.. వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల కంట రక్త కన్నీరు.. ఎందుకు ఇంతలా షేర్ల పతనం.. ?
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మరియు అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. దీని ఫలితంగా వరుసగా నాలుగో రోజు కూడా మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లోనే బీఎస్ఈ సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా పడిపోగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 కీలకమైన 23,900 స్థాయి కంటే దిగువకు జారింది.
ఉదయం ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 296.65 పాయింట్లు తగ్గడంతో 76,458.40 వద్ద, నిఫ్టీ 69.15 పాయింట్లు క్షీణించి 23,927.10 వద్ద కొనసాగాయి. ఆ తర్వాత కూడా ఒత్తిడి పెరగడంతో నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు నష్టపోయి 23,900 స్థాయికి చేరుకోగా.. సెన్సెక్స్ 300 పాయింట్ల పతనంతో 76,400 స్థాయికి పరిమితమైంది. మరోవైపు విదేశీ మారక మార్కెట్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూపాయి 0.1 శాతం స్వల్పంగా బలపడి 96.49 వద్ద ప్రారంభమైంది.

అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. క్రూడ్ ఆయిల్ ధరలు చూస్తే, బ్రెంట్ క్రూడ్ రాత్రికి బ్యారెల్‌కు $96 మార్కును దాటి ముగియగా, డబ్ల్యూటీఐ (WTI) ఉదయం సమయానికి బ్యారెల్‌కు $85 వద్దకు చేరువైంది. ఈ ప్రభావం నేరుగా వాహన, రవాణా రంగాలపై పడటంతో సెన్సెక్స్‌లోని 30 ప్రధాన స్టాక్‌లలో ఏకంగా ఇరవై ఐదు స్టాక్స్ నష్టాలతోనే తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి.
ఇందులో విమానయాన సంస్థ ఇండిగో అత్యధికంగా నష్టపోగా.. అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, ట్రెంట్, రిలయన్స్ మరియు మహీంద్రా & మహీంద్రా వంటి హెవీవెయిట్ షేర్లు కూడా గణనీయమైన పతనాన్ని చవిచూశాయి. అలాగే నిఫ్టీ50 సూచీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ కంపెనీలు ప్రధాన నష్టపోయిన వాటిలో అగ్రస్థానంలో నిలిచాయి.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.54 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.75 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడవుతూ ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచాయి. ప్రధానంగా కంపెనీల ఆదాయ నివేదికల్లో చిన్నపాటి లోపాలు ఉన్నా మార్కెట్ తీవ్రంగా స్పందిస్తుండటంతో విస్తృత మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువైంది. రంగాంశాల వారీగా పరిశీలిస్తే ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలు తీవ్రంగా వెనుకబడగా, నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి, నిఫ్టీ ఆటో రంగాలు మాత్రం సాపేక్షంగా మెరుగైన ప్రదర్శనతో ఒత్తిడిని తట్టుకోగలిగాయి. అయితే నిఫ్టీలో ఎటర్నల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ మరియు మారుతి వంటి కొన్ని స్టాక్స్ లాభాలతో ప్రారంభమై కొంతవరకు రక్షణగా నిలిచాయి.
సాంకేతికంగా చూస్తే.. వరుసగా మూడు రోజుల అమ్మకాల వల్ల నిఫ్టీ తిరిగి తన కింది శ్రేణి స్థాయికి చేరడంతో దిగువన ఉన్న 23,800 స్థాయి మళ్లీ కీలకమైన మద్దతుగా మారింది. నిరంతరం తక్కువ గరిష్టాలను నమోదు చేస్తుండటంతో నిఫ్టీకి నిరోధక స్థాయి 24,150 నుండి 24,250 వద్దకు మారింది. మరోవైపు, నిఫ్టీ బ్యాంక్ 57,500 మార్కును దిగువకు ఛేదించి.. ప్రస్తుతం 57,000 స్థాయిని నిలబెట్టుకోవడానికి పోరాడుతోంది.
ఇక త్రైమాసిక ఫలితాల పరంగా చూస్తే, అమెరికాలో లిస్టయిన ఏడీఆర్ (ADR) 10 శాతం పడిపోవడంతో డాక్టర్ రెడ్డీస్ స్టాక్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉండగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ కూడా తన ఫలితాల ఆధారంగా కదలికలను చూపనుంది. వీటితో పాటు ఇన్ఫోసిస్, సిప్లా, ఇండిగో వంటి కీలక నిఫ్టీ కంపెనీలు కూడా ఈరోజు తమ ఫలితాలను విడుదల చేయనుండటంతో మార్కెట్ వీటిపై నిశిత దృష్టి సారించింది.


Click it and Unblock the Notifications
