స్టాక్ మార్కెట్ టుడే.. దలాల్ స్ట్రీట్‌లో బుల్స్ పరుగులు.. ఇన్వెస్టర్ల పంట పండింది..
Stock Market Today: నవంబర్ 23, సోమవారం నాటి భారీ పతనానికి ప్రధాన కారణమైన బ్యాంకింగ్ స్టాక్‌లే.. బుధవారం (నవంబర్ 25, 2026) భారత స్టాక్ మార్కెట్ల అద్భుత పునరుద్ధరణకు అసలైన కీలకశక్తిగా నిలిచాయి. గురు నానక్ జయంతి సెలవు తర్వాత తిరిగి ప్రారంభమైన ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) ఉదయం సెషన్‌లో ఏకంగా 2,000 పాయింట్లకు పైగా ఎగబాకి 84,400 మార్కును అధిగమించింది.
ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (Nifty 50) సైతం 550 పాయింట్లకు పైగా లాభపడి 25,900 స్థాయిని తిరిగి చేరుకుంది. ఈ భారీ ర్యాలీతో మదుపర్ల సంపదలో సుమారు రూ. 3.39 లక్షల కోట్ల నుండి రూ. 3.5 లక్షల కోట్ల మేర వృద్ధి నమోదైంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,09,75,499.68 కోట్ల నుండి రూ. 5,13,14,329.97 కోట్లకు పెరిగింది.

ఆసియా, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న తీవ్ర అమ్మకాల ఒత్తిడికి భిన్నంగా భారత మార్కెట్లు పుంజుకోవడం విశేషం. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి 5.30 శాతం, జపాన్ నిక్కీ 2.74 శాతం, చైనా షాంఘై సూచీ 1 శాతం మేర కుప్పకూలడంతో ఆసియా మదుపర్లు సుమారు 750 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. అమెరికాలో నాస్‌డాక్ 1.48 శాతం క్షీణించి ఏఐ (AI), సెమీకండక్టర్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అయినప్పటికీ భారత మార్కెట్ల ఈ భారీ ర్యాలీ వెనుక ఐదు ప్రధాన కారణాలు నిలిచాయి.
మొదటి కారణం ఏంటంటే.. విదేశీ సంస్థాగత మదుపర్ల (FII) నిరంతర కొనుగోళ్లు అని చెప్పవచ్చు. సోమవారం మార్కెట్ పతనంలోనూ ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 5,672.99 కోట్ల విలువైన భారత షేర్లను కొనుగోలు చేశారు. నవంబర్ నెలలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 13.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.3 లక్షల కోట్లకు పైగా) చేరడం మార్కెట్‌కు కొండంత అండగా నిలిచింది.
రెండవ కారణంగా ముడి చమురు ధరల తగ్గుదలను చూడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 1.4 శాతం తగ్గి బ్యారెల్‌కు 90 డాలర్ల వద్దకు, ఆ తర్వాత ఉదయం 11 గంటల సమయానికి 89 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌కు ఇది ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి కార్పొరేట్ మార్జిన్లను మెరుగుపరుస్తుంది.
మూడవ కారణంగా బ్యాంకింగ్, ఐటీ స్టాక్‌లలో భారీ కొనుగోళ్లు అని చెప్పాలి.. నిఫ్టీ బ్యాంక్ సూచీ 2 శాతానికి పైగా ఎగబాకగా, ఐసీఐసీఐ బ్యాంక్ 4 శాతం ర్యాలీతో రూ. 1,647 వద్ద ఆల్-టైమ్ గరిష్ఠాన్ని (మార్కెట్ క్యాప్ సుమారు రూ. 11.83 లక్షల కోట్లు) తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం సూచీలను ముందుకు నడిపించాయి. ఐటీ విభాగంలో ఇన్ఫోసిస్ 4.4 శాతం లాభపడింది. విదేశీ మదుపర్లు ఏఐ-ఆధారిత విదేశీ టెక్ స్టాక్‌ల నుండి నిధులను ఉపసంహరించుకుని భారత మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారని జియోజిత్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ విశ్లేషించారు.
ఇక నాలుగవ కారణంగా రూపాయి బలోపేతం కావడం మార్కెట్లకు ఊపునిచ్చింది. విదేశీ నిధుల ప్రవాహం, చమురు ధరల తగ్గుదలతో రూపాయి 23 పైసలు బలపడి డాలర్‌తో పోలిస్తే 92.62 వద్దకు చేరింది.
ఐదవ కారణంగా మార్కెట్ సెంటిమెంట్ మెరుగుదల, సాంకేతిక మద్దతుగా చెప్పవచ్చు. ఒడిదుడుకులను సూచించే ఇండియా విక్స్ (India VIX) 3 శాతానికి పైగా తగ్గడం మదుపర్లలో భయాలు తొలగిపోతున్నాయని సూచించగా.. జియోజిత్ నిపుణుడు ఆనంద్ జేమ్స్ పేర్కొన్నట్లుగా నిఫ్టీ 25,500 కీలక స్థాయి పైన నిలదొక్కుకోవడం బుల్లిష్ ధోరణిని మరింత బలోపేతం చేసింది.


Click it and Unblock the Notifications
