నష్టాలకు బ్రేక్.. సెన్సెక్స్ 905 పాయింట్ల జంప్.. స్టాక్ మార్కెట్ ర్యాలీకి 3 కారణాలు ఇవే..
Stock Market Rally Today: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో అద్భుతమైన రికవరీని ప్రదర్శించాయి. అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ సూచీలు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఉదయం 22,690.65 వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. ఆరంభంలో స్వల్పంగా 22,656.75కు పడిపోయినప్పటికీ, ఆ వెంటనే దిగువ స్థాయిల నుంచి బలమైన కొనుగోళ్లు వెల్లువెత్తాయి. క్రమంగా పుంజుకున్న నిఫ్టీ ఇంట్రాడేలో ఏకంగా 22,961.95 గరిష్ఠ స్థాయిని తాకి, చివరికి రోజు గరిష్ఠానికి అతి సమీపంలో 22,937 పాయింట్ల వద్ద (238 పాయింట్లు లాభంతో) స్థిరపడింది.
ఇక బొంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 905 పాయింట్లు ఎగబాకి 74,151 వద్ద ఘనంగా ముగిసింది బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ల జోరుతో నిఫ్టీ బ్యాంక్ 642 పాయింట్లు బలపడి 54,910 వద్ద ముగియగా, మిడ్‌క్యాప్ సూచీ 567 పాయింట్లు లాభపడి 57,842 వద్దకు చేరుకుంది.

కొనుగోళ్లతో దుమ్ములేపిన రంగాలు: ఈ రోజు మార్కెట్ రాలీలో ఎఫ్‌ఎంసిజి (FMCG), ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU Banks), రియల్టీ రంగ సూచీలు ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా రోజంతా ఒత్తిడిని ఎదుర్కొన్న రియల్టీ స్టాక్స్‌లో చివరి గంటలో ఊహించని రీతిలో భారీ కొనుగోళ్లు వచ్చాయి. ప్రముఖ రియల్టీ దిగ్గజం DLF షేరు 4% కంటే ఎక్కువగా పెరిగి ఈ రంగానికి బలమైన మద్దతునిచ్చింది.
కంపెనీల Q2 ఫలితాలు - లాభపడిన, నష్టపోయిన స్టాక్స్:
బిర్లాసాఫ్ట్: అద్భుతమైన త్రైమాసిక ఫలితాల కారణంగా ఈ స్టాక్ ఏకంగా 12% దూసుకుపోయి. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా అతిపెద్ద ఒక్కరోజు లాభాన్ని నమోదు చేసింది.
వి-గార్డ్ ఇండస్ట్రీస్: బలమైన క్యూ-2 ఫలితాలతో దాదాపు 8% లాభపడింది. లారస్ ల్యాబ్స్, అంబుజా సిమెంట్ మరియు ఏషియన్ పెయింట్స్ కూడా అంచనాలను మించిన ఫలితాలతో సుమారు 1% మేర లాభాలతో ముగిశాయి.
హీరో మోటోకార్ప్: కంపెనీ ఎర్నింగ్స్ కాల్‌లో యాజమాన్యం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ స్టాక్ 4% పైగా పడిపోయింది.
హెక్సావేర్ & RR కేబుల్స్: హెక్సావేర్ తన EBITDA మార్జిన్ గైడెన్స్‌ను తగ్గించడం వల్ల దాదాపు 6% పడిపోగా, వాల్యూమ్ గ్రోత్ గైడెన్స్‌ను తగ్గించిన RR కేబుల్స్ షేరు 4% క్షీణించింది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆకస్మిక రాజీనామా (ప్రయోజనాల సంఘర్షణ ఆందోళనలు) వార్తల వెలువడటంతో ఈ బ్యాంక్ స్టాక్ ఒక్కసారిగా 12% కుప్పకూలింది.
మరోవైపు, అరంగేట్రం చేసిన జియో ప్లాట్‌ఫామ్స్ (Jio Platforms) షేరు రోజంతా తీవ్ర అస్థిరతను ఎదుర్కొన్నప్పటికీ, చివరికి కోలుకుని స్వల్ప లాభంతో ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 13.5 లక్షల కోట్లను దాటడం విశేషం.


Click it and Unblock the Notifications