స్టాక్ మార్కెట్ ఔట్‌లుక్: ఈ వారం పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. వీటిపై కన్నేసి ట్రేడింగ్ చేయండి..
భారత స్టాక్ మార్కెట్‌లో గత వారం నమోదైన సానుకూల ధోరణి ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. ఆగస్టు 10వ తేదీన ప్రారంభమయ్యే వారం అనేక సవాళ్లతో కూడుకున్నదిగా మారనుంది. గడిచిన వారంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 404.53 పాయింట్లు పెరగ్గా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 187.05 పాయింట్ల మేర లాభపడింది.
అయితే రాబోయే రోజుల్లో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక రాజకీయ వేదికలపై చోటుచేసుకోబోయే కీలక పరిణామాలు మార్కెట్ గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్ వర్గాలు ప్రధానంగా పశ్చిమ ఆసియాలోని అనిశ్చితి, ప్రపంచ స్థాయి ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలపైనే నిఘా ఉంచనున్నాయి.

ఈ వారంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను శాసించబోయే అత్యంత ప్రధానమైన అంశం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముడి చమురు ధరలలో చోటుచేసుకుంటున్న మార్పులు. ముఖ్యంగా ఇరాన్‌తో ముడిపడి ఉన్న అంతర్జాతీయ రాజకీయ చర్చలు, హార్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న సందిగ్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన ఈ జలసంధి గుండా రవాణాకు ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ముడి చమురు ధరలు ఒక్కసారిగా మండే ప్రమాదం ఉంది.
భారతదేశం తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నందున, చమురు ధరలు పెరిగితే అది దేశీయ వాణిజ్య లోటును పెంచడమే కాకుండా ద్రవ్యోల్బణ భయాలను కూడా పెంచుతుంది. అందువల్ల ఎన్రిచ్ మనీ ప్రతినిధుల విశ్లేషణ ప్రకారం.. చమురు ధరల హెచ్చుతగ్గులు, పశ్చిమ ఆసియా వార్తలే భారత మార్కెట్‌కు ప్రధాన సూచికగా మారనున్నాయి.
మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ వారంలో వెలువడనున్న దేశీయ, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ డేటా. స్థూల ఆర్థిక దృక్కోణం నుండి ఆగస్టు రెండవ వారం ఎంతో కీలకమైనదని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. భారతదేశంలో ఆగస్టు 12న వినియోగదారుల ధరల సూచీ ఆధారిత సీపీఐ రిటైల్ ద్రవ్యోల్బణం, మరియు ఆగస్టు 14న టోకు ధరల సూచీ ఆధారిత డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి.
ఈ డేటా ద్వారా దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఎలా ఉన్నాయో, ఆర్‌బీఐ రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో ఒక స్పష్టత వస్తుంది. అదే సమయంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో కూడా ఆగస్టు 12న సీపీఐ ద్రవ్యోల్బణ డేటా, ఆగస్టు 13న ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ లేదా పిపిఐ డేటా వెలువడనున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత పై నిర్ణయం తీసుకోవడానికి ఈ గణాంకాలే ప్రామాణికంగా మారనున్నాయి. కాబట్టి ప్రపంచ పెట్టుబడిదారులు ఈ ద్రవ్యోల్బణ డేటాను ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్నారు.
ఇక మార్కెట్‌కు ఊరట కలిగించే ప్రధాన సానుకూల పరిణామం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు. జూలై, ఆగస్టు ప్రారంభం నుండి విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి మళ్లీ నిధులను పంపింగ్ చేయడం ప్రారంభించారు. ఆగస్టు మొదటి వారంలోనే ఎఫ్‌పిఐలు భారతీయ స్టాక్స్‌లో ఏకంగా 12,921 కోట్ల రూపాయల మేర నికర పెట్టుబడులు పెట్టడం దేశీయ మార్కెట్ రికవరీకి బలమైన పునాది వేసింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూలతలను కొంతవరకు తట్టుకోవడానికి ఈ విదేశీ పెట్టుబడులు తోడ్పడుతున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ వ్యాపార రంగాలు చూపుతున్న స్థిరత్వం, బలమైన ఆర్థిక పునాదులు విదేశీ ఇన్వెస్టర్లలో ఆశావహ దృక్పథాన్ని నింపుతున్నాయి.
దీనికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లేదా ఎఫ్ వై 2027 కి సంబంధించిన మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటనలు కూడా ఈ వారంలో మార్కెట్‌ను పరుగులెత్తించే అవకాశం ఉంది. ఈ వారంలో ప్రముఖ రక్షణ రంగ దిగ్గజం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ప్రముఖ ఆటో విడిభాగాల తయారీ సంస్థ భారత్ ఫోర్జ్, విభిన్న రంగాల్లో విస్తరించిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ Q1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ బారీ కంపెనీల లాభదేవీలు, రాబడి గణాంకాలు, భవిష్యత్ వ్యాపార అంచనాలు ఆయా రంగాలు, సంబంధిత స్టాక్స్ గమనాన్ని నిర్దేశించడమే కాకుండా, మొత్తం నిఫ్టీ సూచీ ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయి.
ఏదేమైనా పశ్చిమ ఆసియా భౌగోళిక రాజకీయ సవాళ్లు, అమెరికా, భారత్‌ల ద్రవ్యోల్బణ డేటా, ఎఫ్‌పిఐ నిధుల ప్రవాహం, కార్పొరేట్ కంపెనీల ఆదాయ నివేదికలు ఒక్కసారిగా మార్కెట్ ముందుకు రానుండటంతో ట్రేడర్లు, సాధారణ పెట్టుబడిదారులు తీవ్ర హెచ్చుతగ్గులకు సిద్ధంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు ఒకేసారి ఒకే రంగంలో పెట్టకుండా, సరైన వ్యూహంతో, సమగ్రమైన విశ్లేషణల ఆధారంగా మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
