స్టాక్ మార్కెట్‌లో సోమవారం మళ్లీ పతనం తప్పదా.. ఇన్వెస్టర్లు గమనించాల్సిన కీలక అంశాలివే..
Stock Market Outlook: దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 27, 2026) తీవ్ర ఒత్తిడి మధ్య నష్టాలతో ముగిశాయి. వరుసగా నాలుగు వారాల లాభాల ప్రస్థానం తర్వాత.. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, భారీ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా ప్రధాన సూచీలు కుదేలయ్యాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 989.33 పాయింట్లు (1.17 శాతం) పతనమై 83,339.26 వద్ద స్థిరపడగా.. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 290.65 పాయింట్లు (1.12 శాతం) క్షీణించి 25,593.85 వద్ద ముగిసింది. అయితే బెంచ్‌మార్క్ సూచీలు నష్టపోయినప్పటికీ.. విస్తృత మార్కెట్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తం ట్రేడైన షేర్లలో సుమారు 2,310 స్టాక్‌లు లాభాల్లో పురోగమించగా.. 1,704 స్టాక్‌లు క్షీణించాయి, 180 స్టాక్‌లు యథాతథంగా నిలిచాయి.

రంగాల వారీగా, షేర్ల వారీగా పరిశీలిస్తే మార్కెట్లో స్పష్టమైన విభజన కనిపించింది. ప్రధానంగా నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 9 శాతం మేర కుదేలు కాగా.. నిఫ్టీ ఆటో 1.5 శాతం, నిఫ్టీ రియల్టీ 1.4 శాతం, ప్రైవేట్ బ్యాంక్ సూచీ 1 శాతం మేర పడిపోయాయి. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధిక నష్టాలను చవిచూశాయి. దీనికి భిన్నంగా నిఫ్టీ డిఫెన్స్ సూచీ 3 శాతానికి పైగా.. నిఫ్టీ మెటల్ 1.4 శాతం, నిఫ్టీ మీడియా 0.5 శాతం లాభాలతో రాణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.10 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.5 శాతం చొప్పున లాభపడగా, బీఎస్‌ఈ లిమిటెడ్, హిండాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్ వంటి షేర్లు కొనుగోళ్ల మద్దతును అందుకున్నాయి.
ఈ మార్కెట్ దిద్దుబాటుపై విశ్లేషకులు ఆసక్తికర అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశీయ మౌలిక అంశాలు బలహీనపడటం వల్ల కాకుండా, తిరిగి తలెత్తిన ప్రపంచ ఆర్థిక, భౌగోళిక ప్రమాదాల వల్లే ఈ సవరణ చోటుచేసుకుందని పీఎల్ క్యాపిటల్ అడ్వైజరీ & డీలింగ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ విక్రమ్ కసాత్ పేర్కొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఆటో రంగాలలో లాభాల స్వీకరణ సూచీలను కిందకు లాగినప్పటికీ, విస్తృత మార్కెట్ బలంగా ఉండటం మదుపర్లు సానుకూల ఆదాయ అంచనాలు, సహేతుకమైన వాల్యుయేషన్లు గల షేర్లను ఎంపిక చేసుకుంటున్నారని సూచిస్తోందని ఆయన అన్నారు.
అయితే డాలర్‌తో పోలిస్తే రూపాయి రూ. 92.92 స్థాయికి పడిపోవడం, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 98 డాలర్లకు చేరడం ఆందోళనకరమని. ఇవి దిగుమతి బిల్లులు, ద్రవ్యోల్బణం, కార్పొరేట్ మార్జిన్లపై ఒత్తిడి పెంచుతాయని హెచ్చరించారు. దీనికి తోడు అమెరికా ప్రతిపాదిత వాణిజ్య సుంకాలు ఎగుమతి రంగాలలో అనిశ్చితిని పెంచుతుండగా.. ప్రపంచ అస్థిరత నేపథ్యంలో బంగారం, వెండిపై మదుపర్ల ఆసక్తి మళ్లీ పెరుగుతోందని విశ్లేషించారు.
మరోవైపు వరుసగా నాలుగు వారాల ర్యాలీ తర్వాత మార్కెట్ కొంత మందగమనాన్ని చూడటం సహజమేనని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల పెరిగిన ముడిచమురు ధరలు, బలహీన రూపాయి, దేశీయ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల ఇండెక్స్ హెవీవెయిట్స్‌లో లాభాల స్వీకరణకు దారితీశాయని, అలాగే ఆసియా ఏఐ (AI) స్టాక్స్‌లో పెరుగుదల వల్ల భారత్ నుండి స్వల్పంగా విదేశీ నిధులు మళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
సమీప భవిష్యత్తులో మార్కెట్లో ఒడిదుడుకులు లేదా స్థిరీకరణ (Consolidation) కొనసాగవచ్చని, 2026-27 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కార్పొరేట్ ఆదాయాల వృద్ధి కొంత నెమ్మదించే సూచనలు ఉన్నాయని పేర్కొంటూనే.. బలమైన దేశీయ ఆధారిత వృద్ధి నమూనా, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రెండో త్రైమాసికంలో 7.7 శాతం జీడీపీ (GDP) వృద్ధి అంచనాలు మధ్యకాలికంగా భారత మార్కెట్‌కు సానుకూల బలాన్ని ఇస్తాయని.. కాబట్టి మదుపర్లు ఈ దిద్దుబాటును మౌలికంగా బలమైన కంపెనీల షేర్లను కొనుగోలు చేసే అవకాశంగా మలుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
