స్టాక్ మార్కెట్‌లో నేటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి.. ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే
Stock Market New Rules: నేటి నుండి (సెప్టెంబర్ 7, 2026) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తన ప్రీ-ఓపెన్ ట్రేడింగ్ సెషన్ విధానంలో అత్యంత కీలకమైన మార్పులను అమలులోకి తీసుకువచ్చింది. ఉదయం 9:00 నుండి 9:15 గంటల వరకు ఉండే ప్రీ-ఓపెన్ కాల్ ఆక్షన్ విండోను మరింత పారదర్శకంగా మార్చడం.. ఆకస్మికంగా భారీ ఆర్డర్లు రావడం వల్ల మార్కెట్‌లో ఏర్పడే గందరగోళాన్ని అరికట్టడం, ప్రారంభ ధర (Opening Price) నిర్ణయాన్ని మరింత నిలకడగా మార్చడమే ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం. సాధారణ ట్రేడింగ్ యధావిధిగా ఉదయం 9:15 గంటలకు ప్రారంభమైనప్పటికీ, ప్రీ-ఓపెన్ సమయంలో మారిన ఈ సమయ పట్టిక, నియమాలపై స్టాక్ మార్కెట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి ముందు ప్రతిఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన ఐదు ప్రధాన అంశాలు:
1. ప్రీ-ఓపెన్ సెషన్ కొత్త సమయ పట్టిక:
ఉదయం 9:00 - 9:05 వరకు: మార్కెట్ ఆర్డర్లు (Market Orders) మరియు లిమిట్ ఆర్డర్లు (Limit Orders) రెండింటినీ సిస్టమ్ స్వీకరిస్తుంది.
ఉదయం 9:05 తర్వాత: కొత్తగా మార్కెట్ ఆర్డర్లను ఉంచడం కుదరదు. కేవలం లిమిట్ ఆర్డర్లను మాత్రమే స్వీకరిస్తారు. అలాగే 9:05 గంటల తర్వాత మార్కెట్ ఆర్డర్లను సవరించడం (Modify) లేదా రద్దు చేయడం (Cancel) సాధ్యపడదు.
ఉదయం 9:08 - 9:10 వరకు: ఆర్డర్ల సేకరణ అకస్మాత్తుగా, యాదృచ్ఛికంగా (Random Closure) నిలిపివేయబడుతుంది.
ఉదయం 9:10 - 9:12 వరకు: ఆర్డర్ల సరిపోలిక (Order Matching) ప్రక్రియ జరిగి, ఆ రోజు ప్రారంభ ధర (Equilibrium Price) నిర్ణయించబడుతుంది.
ఉదయం 9:12 - 9:15 వరకు: సాధారణ మార్కెట్ ప్రారంభానికి ముందు ఇది బఫర్ వ్యవధిగా పనిచేస్తుంది.

2. ఈ కొత్త నిబంధన ఎవరెవరికి వర్తిస్తుంది?
ఈ మార్పు కేవలం ఎఫ్&ఓ (F&O) ట్రేడర్ల కోసం మాత్రమే కాకుండా, క్యాష్ లేదా ఈక్విటీ మార్కెట్‌కు వర్తిస్తుంది. మెయిన్ బోర్డ్ కంపెనీలతో పాటు ఎస్ఎంఈ (SME) షేర్లు, పాక్షికంగా చెల్లించిన షేర్లు, ఇన్విట్‌లు (InvITs) మరియు ఆర్ఈఐటిల (REITs) వంటి సమగ్ర ఈక్విటీ సెక్యూరిటీలు ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయి.మరోవైపు, మ్యూచువల్ ఫండ్ లేదా డైరెక్ట్ SIP ఇన్వెస్టర్ల రాబడులపై దీని ప్రత్యక్ష ప్రభావం ఉండదు. ఇది ఫండ్స్ పోర్ట్‌ఫోలియో లేదా వ్యయ నిష్పత్తిని మార్చదు. అయితే, ఈటీఎఫ్‌లు (ETFs), ఇండెక్స్ ఫండ్‌లు, ఆర్బిట్రేజ్ ఫండ్‌ల ఆర్డర్ నిర్వహణ మెరుగుపడి ట్రాకింగ్ లోపాలు (Tracking Errors) తగ్గే అవకాశం ఉంది.
3. ప్రారంభ ధర (Equilibrium Price) ఎలా నిర్ణయిస్తారు?
గరిష్ట సంఖ్యలో కొనుగోలు, అమ్మకం షేర్లను మ్యాచ్ చేసే ధరకు ఎక్స్ఛేంజ్ ప్రాధాన్యత ఇస్తుంది. ఒకవేళ రెండు వేర్వేరు ధరల వద్ద సమాన సంఖ్యలో షేర్లు సరిపోలితే, మిగిలిన పరిమాణం మధ్య వ్యత్యాసం అతి తక్కువగా ఉన్న ధరను ఎంచుకుంటారు. అక్కడా టై వస్తే.. మునుపటి క్లోజింగ్ ధరకు అత్యంత సమీపంలో ఉన్న ధరను ప్రారంభ ధరగా నిర్ణయిస్తారు.
4. అంగీకరించబడని ఆర్డర్లు, ఆటో-రిజెక్షన్లు:
ప్రీ-ఓపెన్ సెషన్‌లో స్టాప్-లాస్ (Stop-loss), ఐఓసి (Immediate or Cancel - IOC), డిస్‌క్లోజ్డ్ క్వాంటిటీ (Disclosed Quantity) ఆర్డర్లను ఎక్స్ఛేంజ్ అంగీకరించదు. సరిపడా మార్జిన్ లేదా నిధులు లేకపోయినా ఆర్డర్లు తిరస్కరించబడతాయి. అలాగే, ఒకే ఇన్వెస్టరు కొనుగోలు మరియు అమ్మకం ఆర్డర్లు పరస్పరం విరుద్ధంగా ఉంటే 'సెల్ఫ్-ట్రేడ్ ప్రివెన్షన్' చెక్స్ ద్వారా సిస్టమ్ ఆ యాక్టివ్ ఆర్డర్‌ను రద్దు చేస్తుంది.
5. యాప్ లాగ్ అవుట్ చేస్తే ఆర్డర్ రద్దు అవుతుందా?
కేవలం ట్రేడింగ్ యాప్ నుండి లాగ్ అవుట్ చేసినంత మాత్రాన లేదా 'కిల్ స్విచ్' ఉపయోగిస్తే ప్రీ-ఓపెన్ ఆర్డర్లు రద్దు కావు. ఆర్డర్‌ను రద్దు చేయాలంటే నిర్ణీత సమయం ముగిసేలోపు నేరుగా ఆర్డర్ బుక్‌లోకి వెళ్లి రద్దు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఉదయం 9:10 తర్వాత ఆర్డర్ మ్యాచ్ అయి ట్రేడ్ పూర్తయినట్లయితే.. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడం సాధ్యపడదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

