Stock market: మెలోడీ చాక్లెట్ క్రేజ్.. పేరు చూసి మోసపోయిన ఇన్వెస్టర్లు! ఆ స్టాక్‌కి కుప్పలుతెప్పలుగా లాభాలు!
మన దేశంలో స్టాక్ మార్కెట్ (stock market) ఇన్వెస్టర్లు కొన్నిసార్లు చేసే పనులు చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. పేరులో చిన్న పోలిక ఉంటే చాలు.. ఆ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, దానికి అసలు లాభాలు వస్తున్నాయా లేదా అని కూడా చూడకుండా గుడ్డిగా షేర్లు కొనేస్తుంటారు. తాజాగా దలాల్ స్ట్రీట్‌లో ఇలాంటి వింత ఘటనే ఒకటి జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో అక్కడి ప్రధాని జార్జియా మెలోనికి ఒక 'మెలోడీ' చాక్లెట్ ప్యాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతే.. ఇక్కడ మార్కెట్ జనాలకు పూనకం వచ్చేసింది!
ఆ చాక్లెట్ తయారు చేసేది 'పార్లే' కంపెనీ కదా అని.. బిఎస్‌ఈ (BSE) లో లిస్ట్ అయి ఉన్న 'పార్లే ఇండస్ట్రీస్' (Parle Industries) షేర్లను ఎగబడి కొనేశారు. దీనివల్ల కేవలం మూడు రోజుల్లోనే ఈ స్టాక్ ఏకంగా 15 శాతం పెరిగి, 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.

అసలు ట్విస్ట్ ఏంటంటే?
ఇక్కడే ఒక పెద్ద రాంగ్ నంబర్ పడింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో పరుగులు పెడుతున్న 'పార్లే ఇండస్ట్రీస్'కు.. మనం తినే మెలోడీ చాక్లెట్లకు అసలు ఎలాంటి సంబంధం లేదు!
- మెలోడీ చాక్లెట్ తయారు చేసేది: 'పార్లే ప్రొడక్ట్స్' (Parle Products) అనే సంస్థ. ఇది 1929లో చౌహాన్ ఫ్యామిలీ ప్రారంభించిన ప్రైవేట్ కంపెనీ. ఇది ఇంకా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. దీని షేర్లు మార్కెట్లో దొరకవు.
- ఇన్వెస్టర్లు కొంటున్న కంపెనీ: 'పార్లే ఇండస్ట్రీస్'. ఇది 1983లో ఎక్స్‌ప్రెస్ బాట్లర్స్ సర్వీస్‌గా మొదలై, ఆ తర్వాత పార్లే సాఫ్ట్‌వేర్‌గా మారి.. ప్రస్తుతం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, పేపర్ వేస్ట్ రీసైక్లింగ్ బిజినెస్‌లో ఉంది. ఒకప్పుడు పార్లే-బిస్లేరీ గ్రూప్ దీనికి ప్రమోటర్‌గా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఇది పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తోంది.
లాజిక్ లేని గొర్రె దాటుడు ప్రవృత్తి!
మొదట్లో ఇన్వెస్టర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఈ షేర్లు కొన్నారని అనుకున్నా.. మూడు రోజులైనా ఈ రాలీ ఆగకపోవడంతో ఇదొక 'మీమ్ స్టాక్' క్రేజ్‌గా మారిపోయిందని నిపుణులు చెప్తున్నారు. దీనిపై ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ స్పందిస్తూ.. "మార్కెట్లో లాజిక్‌ను పక్కనబెట్టి, ఒకరిని చూసి ఒకరు గుడ్డిగా వెళ్లే గొర్రె దాటుడు ప్రవృత్తికి (Herd Mentality) ఈ మెలోడీ-పార్లే రాలీ ఒక క్లాసిక్ ఉదాహరణ" అని వ్యాఖ్యానించారు.
చిత్రమేమిటంటే, ఈ చాక్లెట్ మానియా పుణ్యమా అని పార్లే ఇండస్ట్రీస్ కంపెనీకి లేనిపోని క్రేజ్ వచ్చింది. మే 26న ఈ కంపెనీ తమ మార్చి త్రైమాసిక ఫలితాలను (Q4 Results) విడుదల చేయబోతోంది. ఇప్పుడు ఇన్వెస్టర్లంతా ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూశారుగా.. సోషల్ మీడియాలో ఒక చిన్న మీమ్ లేదా వీడియో వైరల్ అయితే, అది స్టాక్ మార్కెట్ (stock market) లో కోట్ల రూపాయల టర్నోవర్‌ను ఎలా మార్చేస్తుందో!


Click it and Unblock the Notifications