ఊహించని అమ్మకాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు..
Stock Market Live Today: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌ను ఉత్సాహంగా ప్రారంభించినప్పటికీ..ఆ జోరును కొనసాగించలేకపోతోంది. మార్కెట్ ప్రారంభ గంటల్లో నిఫ్టీ 50 సూచీ సుమారు 23,150.85 పాయింట్ల వద్ద ట్రేడైంది. తొలుత స్వల్ప లాభాల బాట పట్టినప్పటికీ.. పైస్థాయిలో కొనుగోళ్ల మద్దతు కరువవడంతో నిమిషాల వ్యవధిలోనే అమ్మకాలు వెల్లువెత్తాయి. ఉదయం 9:10 గంటల తర్వాత మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఉదయం 11:40 గంటల ప్రాంతంలో ఊహించని విధంగా భారీ అమ్మకాలు మొదలుకావడంతో.. నిఫ్టీ ఒక్కసారిగా 150 పాయింట్ల వరకు పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.
ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి మార్కెట్‌ను కిందికి లాగింది. దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) షేరు సుమారు 2 శాతం మేర పడిపోయి, నిఫ్టీ 50 సూచీలో అత్యంత బలహీనంగా ముగిసిన స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది.

వారాంతంలో విడుదలైన ఆ సంస్థ రెండో త్రైమాసిక (Q2) ఆర్థిక ఫలితాల తర్వాత, నికర వడ్డీ మార్జిన్ (NIM), భవిష్యత్ ఆదాయ వృద్ధిపై మార్కెట్ వర్గాల్లో కొన్ని సందేహాలు, ఆందోళనలు తలెత్తాయి. బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్‌పై సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పూర్తిగా కాపాడలేకపోయాయి. దీని ప్రభావంతో బ్యాంక్ నిఫ్టీ సూచీ కూడా సుమారు 0.5 శాతం నష్టంతో ట్రేడింగ్‌ను ముగించింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీలు చేస్తున్న భారీ పెట్టుబడులు, వాటి రాబడులపై పెరుగుతున్న ఆందోళనలు టెక్ స్టాక్స్‌ను కోలుకోకుండా చేశాయి. శుక్రవారం నాటి అమెరికా మార్కెట్లలో ఏఐ స్టాక్స్‌లో సాగిన తీవ్ర విక్రయాల కారణంగా వాల్‌స్ట్రీట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. నాస్‌డాక్ 2.19 శాతం, ఎస్&పి 500 సూచీ 1.22 శాతం, డౌ జోన్స్ 0.55 శాతం నష్టంతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా, బలహీన ధోరణితో ట్రేడ్ కావడం దేశీయంగా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ బ్రెంట్, యూఎస్ డబ్ల్యూటీఐ ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, అవి ఇప్పటికీ గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. భారతదేశం వంటి ఇంధన దిగుమతిపై ఎక్కువగా ఆధారపడే దేశానికి ఈ ధరల మంట దిగుమతి బిల్లును విపరీతంగా పెంచడంతో పాటుగా.. దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మరింత తీవ్రతరం చేసే ప్రమాదముంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో మార్కెట్ అస్థిరత కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
