నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ స్టాక్ మార్కెట్లకు ఈ రోజు.. అంటే 2026 మార్చి 26 గురువారం నాడు సెలవు ప్రకటించారు. దేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) రెండూ ఈ రోజు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసాయి.
దీనివల్ల ఈక్విటీ నగదు విభాగం, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బోరోయింగ్ (SLB) వంటి అన్ని విభాగాల్లో ట్రేడింగ్ జరగదు. ఈ వారం ట్రేడర్లకు పనిదినాలు తక్కువగా ఉండటంతో.. గురువారం నాటి సెలవు కారణంగా వీక్లీ ఎక్స్‌పైరీ కూడా ఒక రోజు ముందుగానే, అంటే బుధవారమే ముగిసింది.

కమోడిటీ మార్కెట్ల విషయానికి వస్తే.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX), నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (NCDEX) లలో ట్రేడింగ్ సమయాల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. MCX లో ఉదయం సెషన్ (ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు) మూసివేయబడింది. కానీ సాయంత్రం సెషన్ మాత్రం 5 గంటల నుండి రాత్రి 11:30 లేదా 11:55 గంటల వరకు యధావిధిగా కొనసాగుతుంది. అయితే NCDEX మాత్రం రెండు సెషన్లలోనూ మూసి ఉంటుంది. మార్కెట్లు తిరిగి రేపు, అంటే మార్చి 27 శుక్రవారం ఉదయం 9:15 గంటలకు ప్రారంభమవుతాయి.
మార్చి నెల ముగింపు సమయం కావడంతో ఈ సెలవు ఇన్వెస్టర్లకు చాలా కీలకంగా మారింది. ఈ నెలలో ఇప్పటికే మార్చి 3న హోలీ సందర్భంగా సెలవు రాగా, ఇప్పుడు మార్చి 26న రామ నవమి సెలవు వచ్చింది. వచ్చే వారంలో కూడా మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా మరో సెలవు ఉండటంతో.. ఆర్థిక సంవత్సరం (FY 2025-26) ముగింపులోపు తమ పోర్ట్‌ఫోలియోలను సర్దుబాటు చేసుకోవడానికి ఇన్వెస్టర్లకు తక్కువ సమయం అందుబాటులో ఉంది. ఏప్రిల్ నెలలో కూడా గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 3), అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) వంటి రోజుల్లో మార్కెట్లు సెలవు తీసుకుంటాయి.
ఈ సెలవు కేవలం స్టాక్ మార్కెట్లకే పరిమితం కాకుండా, దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, లక్నో వంటి నగరాల్లో బ్యాంకులు పనిచేయవు, కానీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 75,000 మార్కును అందుకోవడం, నిఫ్టీ 23,300 పాయింట్ల పైన ముగియడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న ఆశలతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి, కాబట్టి శుక్రవారం మార్కెట్లు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications