స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. 5 సెకన్లలో రూ.1 లక్ష కోట్ల సంపద మాయం.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలతో స్టాక్ మార్కెట్ అతలాకుతలం అవుతోంది, షేర్ మార్కెట్ భారీ పతనంతో కొనసాగుతోంది. ట్రంప్ రోజు రొజుకు ఇస్తున్న సంచలన ప్రకటనలతో దలాల్ స్ట్రీట్ కుదేల్ అవుతోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల మార్కును దాటాయి. ఈ ఇంధన ధరల భగ్గుమంట ఆసియా మార్కెట్లతో పాటు భారత దేశీయ స్టాక్ మార్కెట్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీసింది.
మంగళవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొనడంతో మార్కెట్లో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ 552.99 పాయింట్లు పడిపోయి 77,063.41 వద్ద ఇంట్రా-డే కనిష్టాన్ని తాకగా.. ఎన్‌ఎస్ఈ నిఫ్టీ కూడా 160.45 పాయింట్లు నష్టపోయి 24,050.55 స్థాయికి జారింది. ఉదయం 09:20 గంటల సమయానికి సెన్సెక్స్ 397.08 పాయింట్ల (0.51%) నష్టంతో 77,219.32 వద్ద, నిఫ్టీ 99.80 పాయింట్ల (0.41%) తగ్గుదలతో 24,111.20 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ పతనం కేవలం పెద్ద కంపెనీలకే పరిమితం కాకుండా నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు కూడా దాదాపు అర శాతం మేర నష్టపోవడంతో విస్తృత మార్కెట్ అంతా ఒత్తిడికి గురైంది.

ఈ మార్కెట్ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపదకు భారీ గండి పడింది. జూలై 13, 2026 నాటి ముగింపు సమయానికి బీఎస్ఈలో లిస్ట్ అయిన మొత్తం స్టాక్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,81,59,666.72 కోట్లుగా ఉండగా.. జూలై 14న ఉదయం ట్రేడింగ్‌లో అది రూ. 4,80,45,121.51 కోట్లకు పడిపోయింది. దీనివల్ల పెట్టుబడిదారులు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే రూ. 1,14,545.21 కోట్ల (సుమారు రూ. 1.14 లక్షల కోట్లు) మూలధనాన్ని నష్టపోవాల్సి వచ్చింది. రంగాల వారీగా పరిశీలిస్తే ఐటీ రంగం మాత్రమే కొంత సానుకూల ధోరణిని కనబరుస్తుండగా.. ఆటో, ప్రైవేట్ బ్యాంకింగ్, రియల్టీ రంగాలు తీవ్రమైన విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొంటూ అర శాతానికి పైగా నష్టపోయాయి.
మార్కెట్ క్షీణత మధ్య సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో కేవలం 8 షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీల షేర్లు అత్యధిక లాభాలను ఆర్జిస్తుండగా.. హెచ్‌సీఎల్ టెక్, ఇండిగో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతూ సూచీలపై ఒత్తిడిని పెంచాయి. ప్రస్తుతం బీఎస్ఈలో ట్రేడవుతున్న మొత్తం 2,617 షేర్లలో 988 షేర్లు లాభాల బాటలో ఉండగా, మెజారిటీ షేర్లు అంటే 1,452 స్టాక్‌లు నష్టాల్లో నడుస్తున్నాయి. 177 షేర్లు స్థిరంగా ఉన్నాయి. కాగా మార్కెట్ ఒడిదుడుకుల మధ్య 48 స్టాక్‌లు తమ 52 వారాల గరిష్ట స్థాయిని, 14 స్టాక్‌లు 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి. అలాగే మరో 49 షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను.. 57 షేర్లు లోయర్ సర్క్యూట్‌ను చేరాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
