ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత Robert Kiyosaki.. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక భారీ స్టాక్ మార్కెట్ పతనాన్ని (Market Crash) ఎదుర్కోబోతోందని సంచలన హెచ్చరికలు జారీ చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మారుతున్న వడ్డీ రేట్ల అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు అత్యంత అస్థిరంగా ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ఈ సంక్షోభం లక్షలాది మంది సామాన్యులను ఆర్థికంగా దెబ్బతీస్తుందని.. అయితే ముందుచూపుతో సిద్ధపడే వారికి ఇది ఒక గొప్ప సంపద సృష్టి అవకాశంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
కియోసాకి తన హెచ్చరికల వెనుక కేవలం ఆర్థిక గణాంకాలే కాకుండా.. చారిత్రక అంచనాల ప్రభావం కూడా ఉందని వెల్లడించారు. నోస్ట్రాడమస్, ఎడ్గార్ కేస్ వంటి భవిష్యత్ శాస్త్రవేత్తలు 2026 నాటికి ప్రపంచ ఆర్థిక క్రమంలో పెద్ద మార్పులు వస్తాయని ఊహించారని ఆయన గుర్తు చేశారు. అయితే, అంచనాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోయిన అప్పుల కుప్ప, విచ్చలవిడిగా డబ్బు ముద్రించడం, మార్కెట్లలో సాగుతున్న అతిశయోక్తి అంచనాల దృష్ట్యా తీవ్రమైన ఆర్థిక మాంద్యానికి (Depression) సిద్ధంగా ఉండటం అవసరమని ఆయన వాదించారు.

ఈ పతనాన్ని ఒక విపత్తుగా కాకుండా ఒక అవకాశంగా చూడాలని కియోసాకి సూచించారు. మార్కెట్లు కుప్పకూలినప్పుడు విలువైన ఆస్తులు చౌక ధరలకు లభిస్తాయని, ఆ సమయంలో పెట్టుబడులు పెట్టేవారు భవిష్యత్తులో అత్యంత ధనవంతులుగా ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. సాంప్రదాయబద్ధంగా స్టాక్స్, బాండ్లు లేదా నగదు నిల్వలపై ఆధారపడే వారు ఈ సంక్షోభంలో భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కియోసాకి తన పెట్టుబడి వ్యూహాన్ని వివరిస్తూ.. ప్రభుత్వాలు లేదా కేంద్ర బ్యాంకులు తమ ఇష్టానుసారం సృష్టించలేని "వాస్తవ ఆస్తుల" (Real Assets) వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. కాగితపు కరెన్సీని విపరీతంగా ముద్రించడం వల్ల దాని విలువ క్రమంగా పడిపోతుందని, అందుకే బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, చమురు, ఆహార ఉత్పత్తి వంటి భౌతిక ఆస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే, వికేంద్రీకృత ఆస్తులైన బిట్‌కాయిన్, ఇథీరియం వంటి క్రిప్టో కరెన్సీలు కూడా సంక్షోభ సమయంలో రక్షణ కవచంలా పనిచేస్తాయని ఆయన నమ్ముతున్నారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ.. తన సంపద రాత్రికి రాత్రే రాలేదని, దశాబ్దాల తరబడి క్రమశిక్షణతో చిన్న చిన్న ఆస్తులను కొనుగోలు చేస్తూ వాటిని దీర్ఘకాలం పాటు ఉంచుకోవడం వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకులకు భయపడకుండా తన వద్ద ఉన్న మొదటి బిట్‌కాయిన్‌ను అలాగే ఉంచుకున్న విషయాన్ని ఆయన ఉదాహరణగా చెప్పారు. వారెన్ బఫెట్ వంటి దిగ్గజ పెట్టుబడిదారులు కూడా మార్కెట్ దిద్దుబాట్ల కోసం భారీ నగదు నిల్వలతో వేచి చూస్తారని, పతనం సంభవించినప్పుడు వారు వేటాడే సింహాల్లా పనిచేస్తారని ఆయన పేర్కొన్నారు.
చివరిగా కియోసాకి ఒక కీలకమైన ప్రశ్నను సంధించారు.. మార్కెట్ పతనం జరుగుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు, అది జరిగినప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. ద్రవ్యోల్బణం బారి నుండి రక్షణనిచ్చే ఆస్తులలో పెట్టుబడులు కొనసాగించాలని, ఆర్థిక మాంద్యం సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేవారే విజేతలుగా నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications