స్టాక్ మార్కెట్లో అమ్మకాల కల్లోలం.. కుప్పకూలిన సూచీలు.. ఈ రంగాల ఇన్వెస్టర్ల కంట రక్తపాతం..
Stock Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్‌లో తీవ్ర అస్థిరత కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం వరకు కోలుకుంటున్నట్లు కనిపించిన మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి అంటే మధ్యాహ్నం 3:10 గంటల తర్వాత అకస్మాత్తుగా తీవ్ర పతనానికి గురయ్యాయి. ప్రామాణిక సూచీ నిఫ్టీ 180 పాయింట్లు పడిపోయి కీలకమైన 23,500 మానసిక స్థాయి దిగువకు జారిపోయింది.
ఈ ఆకస్మిక పతనం ఏ ఒక్క కంపెనీ వార్తల వల్ల కాకుండా ముడి చమురు ధరల భగ్గుమనడం, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్టానికి చేరడం, యూరోపియన్ తో పాటు యుఎస్ డౌ ఫ్యూచర్స్ 100 పాయింట్లకు పైగా క్షీణించడం వంటి ముప్పేట దాడి వల్ల సంభవించింది. ఉదయం చోటుచేసుకున్న రికవరీ కేవలం షార్ట్-కవరింగ్ ఫలితమే తప్ప, శాశ్వత కొనుగోళ్ల వల్ల కాదని తేలడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు.
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడం భారత మార్కెట్లను కోలుకోలేని దెబ్బతీసింది. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే భారత్ లాంటి దేశానికి క్రూడ్ ధరలు పెరగడం వల్ల దేశ దిగుమతి బిల్లులు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం ఎగబాకి కంపెనీల నిర్వహణ వ్యయాలు పెరుగుతాయని ఇన్వెస్టర్లు భయాందోళనకు లోనయ్యారు.

దీనికితోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 95 స్థాయిని దాటడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. చమురు కంపెనీల నుండి డాలర్లకు విపరీతమైన డిమాండ్ పెరగడం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం తక్కువగా ఉండటంతో రూపాయి క్షీణించి, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ఉపసంహరణలకు కారణమైంది. ఇక యూరోపియన్ మార్కెట్లలో లాభాల స్వీకరణ మొదలవ్వడం కూడా దలాల్ స్ట్రీట్‌పై ఒత్తిడిని పెంచింది.
ఈ పతనంలో ఐటీ రంగం తీవ్రంగా నష్టపోయింది. వరుసగా మూడో రోజు కూడా భారత ఐటీ స్టాక్‌లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురై, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ. 1.2 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ వరుసగా ఏడో సెషన్‌లోనూ నష్టాల్లో ముగిసి, ఈ వారంలో 4.5 శాతం పతనమై రూ. 37,000 కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. మరోవైపు ఇన్ఫోసిస్ షేరు దాదాపు 4 శాతం పడిపోయి వరుసగా ఆరో సెషన్‌లోనూ నష్టాలను నమోదు చేసింది.
ఈ ఒక్క వారంలోనే 8 శాతానికి పైగా క్షీణించిన ఇన్ఫోసిస్ మార్కెట్ వ్యాల్యూమ్ రూ. 35,000 కోట్లు తగ్గింది. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, కోఫోర్జ్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లు కూడా 4 నుండి 6 శాతం పరిధిలో నష్టపోయాయి. హెచ్‌సీఎల్ టెక్ మార్కెట్ క్యాప్ రూ. 14,000 కోట్లకు పైగా తగ్గిపోగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లోని మొత్తం 10 స్టాక్‌లు ఎరుపు రంగులోనే ముగిశాయి. ఐటీతో పాటు పెరిగిన చమురు ధరల భయంతో బ్యాంకింగ్, ఆటో రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
సాంప్రదాయ ఐటీ సేవల కంపెనీలపై ఓపెన్‌ఏఐ ఇటీవల ప్రవేశపెట్టిన నూతన మోడల్ 'జిపిటి-6 ఆస్ట్రా' పెను ప్రభావాన్ని చూపుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాంప్లెక్స్ వెబ్ పరిశోధనలు, కోడింగ్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్ల తయారీ వంటి బహుళ-దశల పనులను ఆస్ట్రా వేగంగా, అత్యంత తక్కువ ఖర్చుతో నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉండటంతో, భవిష్యత్తులో ఐటీ కంపెనీల సాంప్రదాయ వ్యాపార నమూనా మనుగడపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
ఫలితంగా ఇన్వెస్టర్లు ఐటీ కంపెనీల భవిష్యత్ వృద్ధి అంచనాలను పునఃపరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. సాంప్రదాయ ఐటీ సేవల కంపెనీలను ఇన్వెస్టర్లు విక్రయిస్తుంటే, ఏఐకి అవసరమైన మౌలిక వసతులు, చిప్‌లను తయారు చేసే ఇంటెల్, ఏఎమ్‌డీ, క్వాల్‌కామ్, బ్రాడ్‌కామ్ వంటి గ్లోబల్ సెమీకండక్టర్ స్టాక్‌లు 3 నుండి 9 శాతం లాభాలను నమోదు చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications
