స్టాక్ మార్కెట్ ధూమ్ ధామ్.. సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్.. నిఫ్టీ సరికొత్త రికార్డు..
భారత స్టాక్ మార్కెట్ ఈరోజు (సోమవారం) సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు, ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గి త్వరలోనే ఒక శాంతి ఒప్పందం కుదురుతుందనే ఆశలు ఇన్వెస్టర్లలో సరికొత్త జోష్ నింపాయి. దీంతో ఉదయం నుంచే మార్కెట్‌లో కొనుగోళ్ల సునామీ చెలరేగింది.
మధ్యాహ్నం 3:00 గంటల సమయానికి మార్కెట్ రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1,058.51 పాయింట్లు ఎగబాకి, 1.40 శాతం వృద్ధితో 76,473.86 వద్ద ట్రేడవుతూ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 (Nifty 50) కూడా 313.80 పాయింట్లు పుంజుకుని, 1.32 శాతం భారీ వృద్ధితో 24,032.75 వద్ద ముగిసింది.

ఈరోజు మార్కెట్ రేసు గుర్రాల్లా దూసుకెళ్లిన వాటిలో ప్రధానంగా ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ షేర్లు ఉన్నాయి. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఇవి అత్యధిక లాభాలను ఆర్జించి, మార్కెట్ విజయానికి ప్రధాన మద్దతుగా నిలిచాయి. కేవలం పెద్ద కంపెనీలు మాత్రమే కాకుండా, విస్తృత మార్కెట్లో కూడా బలం స్పష్టంగా కనిపించింది.
మిడ్-క్యాప్ సూచీ 0.94 శాతం పెరగగా, చిన్న కంపెనీలకు సంబంధించిన స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 1.38 శాతం లాభపడింది. రంగాల వారీగా పరిశీలిస్తే.. పీఎస్‌యూ (ప్రభుత్వ రంగ) బ్యాంక్ సూచీ మార్కెట్‌ను ముందుండి నడిపించింది. దీనితో పాటు ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు పండగ చేసుకున్నాయి. అయితే, అందరూ లాభాల బాటలో ఉంటే హెల్త్‌కేర్ (ఆరోగ్య సంరక్షణ) రంగం మాత్రం మిగిలిన రంగాల కంటే వెనుకబడి నీరసించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ప్రపంచ మార్కెట్లలో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని ఆయన సూచించారు. సమయం తమ వైపే ఉన్నందున తాము చర్చలను తొందరపెట్టబోమని ఆయన పేర్కొన్నప్పటికీ, యుద్ధం ముగిసిపోతుందనే అంచనాలు మార్కెట్‌కు బూస్టింగ్ ఇచ్చాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కుప్పకూలాయి. అంతర్జాతీయ ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ ధరలు ఏకంగా 5 శాతం వరకు పడిపోయాయి. మే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 5.49 శాతం క్షీణించి బ్యారెల్‌కు $97.86 వద్దకు చేరుకుంది.
ఈ ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గితే, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' ద్వారా జరిగే రవాణాకు ఎలాంటి ముప్పు ఉండదని, సరఫరా సజావుగా సాగుతుందని ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఆ సానుకూల ప్రభావమే ఈరోజు భారత మార్కెట్ కొనుగోళ్ల జోరులో స్పష్టంగా కనిపించింది.


Click it and Unblock the Notifications
