లాభాల నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్ల కొంపలు ముంచుతున్న అమెరికా..
వారంలో మొదటి రోజైన సోమవారం (ఆగస్టు 24) భారత స్టాక్ మార్కెట్లు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. షేర్ మార్కెట్ ఉదయం ఆసియా సూచీల నుంచి అందిన సానుకూల సంకేతాలతో స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.. సెషన్ చివరికి వచ్చేసరికి ఆ లాభాలన్నీ పూర్తిగా కరిగిపోయి సూచీలు నష్టాలతో ముగిశాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్‌పై అమెరికా విధించనున్న నూతన ఆంక్షల భయాలు, అంతర్జాతీయంగా పెరుగుతున్న బాండ్ రాబడులు పెట్టుబడిదారుల్లో ఆందోళన రేకెత్తించాయి. ఇవన్నీ భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడానికి దారితీస్తాయనే భయంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు.
ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ ఒకానొక దశలో రోజు గరిష్ట స్థాయి 77,789 ని తాకినప్పటికీ, చివరకు 171 పాయింట్లు పడిపోయి 77,369 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 50 కూడా ఇంట్రాడే గరిష్టం 24,313 నుండి లాభాలను కోల్పోయి.. 33 పాయింట్ల నష్టంతో 24,219 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 236 పాయింట్లు పడిపోయి 57,526 కి చేరగా.. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 0.93% పతనంతో రోజులోనే అత్యధిక నష్టాన్ని మూటగట్టుకుంది. నిఫ్టీ 50 లోని మొత్తం 50 స్టాక్స్‌లో 26 కంపెనీల షేర్లు నష్టాలతోనే ముగిశాయి. ఎస్‌బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా క్షీణించాయి.

అయితే మార్కెట్‌ను పతనం అంచున నిలబడకుండా నిరోధించడంలో మెటల్, ఐటీ రంగాలు కీలక పాత్ర పోషించాయి. నిఫ్టీ మెటల్ సూచీ ఏకంగా 1.6% బలమైన లాభాలతో ముగిసింది. జేఎస్‌డబ్ల్యు స్టీల్, హిండాల్కో షేర్లు 2% కి పైగా లాభపడగా.. ఐటీ దిగ్గజాలైన హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు 0.8% నుండి 1.5% మేర పెరిగి మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 82 పాయింట్లు పెరిగి 63,817 వద్ద ముగియడం గమనార్హం.
మరోవైపు కార్పొరేట్ వార్తల్లో విశాల్ మెగా మార్ట్ షేరు ఏకంగా 10 శాతం పెరిగింది. కంపెనీ ప్రస్తుత సీఈఓ గుణేందర్ కపూర్‌ను మరో ఐదేళ్ల కాలానికి తిరిగి నియమిస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయం కంపెనీ వ్యూహాత్మక కొనసాగింపుపై నమ్మకాన్ని పెంచడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పోటీ పడ్డారు. అలాగే ప్రమోటర్లు వాటాను పెంచుకోవడంతో శాంతి గేర్స్ కేవలం రెండు రోజుల్లోనే 50 శాతం పెరిగింది. బంగారం ధరలు స్వల్పంగా పుంజుకోవడంతో ముత్తూత్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ షేర్లు 2% నుండి 6% వరకు రాణించాయి. బ్రోకరేజ్ సంస్థల సానుకూల నివేదికతో అర్బన్ కంపెనీ 6% లాభపడగా, హోటల్ విలీనం వార్తలతో ఓరియంటల్ హోటల్స్ 2% లాభపడింది. అయితే, షెంజెన్ వీసాపై దర్యాప్తు జరుగుతోందన్న వార్తలతో బీఎల్ఎస్ కంపెనీ షేర్లు 11% కుప్పకూలగా, చక్కెర స్టాక్స్‌లో లాభాల స్వీకరణ కారణంగా బలరాంపూర్ చిని 5% పడిపోయింది.
అంతర్జాతీయ సంకేతాలు కూడా బలహీనంగానే ఉన్నాయి. డౌ జోన్స్ ఫ్యూచర్స్ 0.03%, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 0.3% నష్టాల్లో ఉండటంతో అమెరికా మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో కొరియన్ కోస్పి భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఎన్విడియా వంటి ప్రధాన ఏఐ సంస్థల త్రైమాసిక ఫలితాల కోసం టెక్ ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 24,200 మద్దతు స్థాయి పైన ముగియడం కొంత ఊరటనిచ్చే అంశమైనప్పటికీ.. భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గితేనే మార్కెట్ తిరిగి గరిష్టాలను చేరుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
