స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్‌డేట్.. ఉదయం లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
భారతీయ స్టాక్ మార్కెట్లకు జూన్ 1, 2026, సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్ తీవ్ర నిరాశతో ముగిసింది. ఉదయం పూట అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో 500 పాయింట్లకు పైగా లాభపడి, సరికొత్త రికార్డుల వైపు పయనిస్తుందనుకున్న దలాల్ స్ట్రీట్.. మధ్యాహ్నం 3 గంటల సమయానికి పూర్తిగా బేరిష్ జోన్‌లోకి జారుకుంది. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఒక్కసారిగా తీవ్రం కావడంతో మార్కెట్లు తమ లాభాలన్నింటినీ కోల్పోయి భారీ నష్టాలను చవిచూశాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ (BSE Sensex), ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ (NSE Nifty 50) రెండు సూచీలు కూడా నష్టాల్లోనే స్థిరపడ్డాయి. ఉదయం 23,700 మార్కును తాకిన నిఫ్టీ, ముగింపు సమయానికి పతనమై 23,400 స్థాయి కంటే దిగువన ముగిసింది.సెన్సెక్స్ 500 పాయింట్ల మేర పతనమైంది.

మధ్యాహ్నం 3 గంటల తర్వాత మార్కెట్ ఇంతలా కుప్పకూలడానికి ప్రధానంగా పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) పరిణామాలు కారణమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయనుకుంటున్న తరుణంలోనే, ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఇరాన్ రాడార్, డ్రోన్ కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా.. దానికి ప్రతిగా కువైట్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు వచ్చిన వార్తలు ఇన్వెస్టర్లను భయాందోళనలకు గురిచేశాయి.
ఈ యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (ముడిచమురు) ధరలు బ్యారెల్‌కు 93 డాలర్ల మార్కును తాకడం ద్రవ్యోల్బణ భయాలను మరింత పెంచింది.దీనికి తోడు, గత శుక్రవారం ఏకంగా 21,000 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు (FIIs), ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా లార్జ్-క్యాప్ షేర్లలో తమ అమ్మకాలను ఉధృతం చేశారు.
మార్కెట్ ముగిసే సమయానికి ఐటీ రంగం (Nifty IT) మాత్రమే సానుకూల వృద్ధిని కనబరిచి మార్కెట్‌కు కొంత అండగా నిలిచింది. క్యూ4 ఫలితాలు బాగుండటంతో ఏషియన్ పెయింట్స్, ఇండిగో (ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) షేర్లు ఉదయం లాభాలను కొంతమేర నిలబెట్టుకున్నాయి. అయితే బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, ఎనర్జీ, మెటల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా క్షీణించి మార్కెట్ పతనానికి కారణమయ్యాయి.
ట్రేడింగ్ ముగిసిన అనంతరం మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తూ.. నిఫ్టీ ప్రస్తుతానికి బేరిష్ ట్రెండ్‌లోకి ప్రవేశించిందని, రాబోయే రోజుల్లో 23,400 నుండి 23,250 స్థాయిలు కీలకమైన సపోర్ట్ (మద్దతు)గా మారనున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ మార్కెట్ ఈ స్థాయి కంటే కిందకు పడిపోతే పతనం మరింత తీవ్రం కావచ్చు. రాబోయే జూన్ 5 నాటి ఆర్‌బీఐ (RBI) ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు, పశ్చిమాసియా భౌగోళిక రాజకీయ పరిణామాలు తేలేంతవరకు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
