క్రూడ్ ఆయిల్ మంటలు.. స్టాక్ మార్కెట్లో ఒక్కరోజులో రూ.2 లక్షల కోట్ల సంపద ఆవిరి..
Stock Market closing bell: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల పరిణామాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లతో పాటు ఆసియా ఈక్విటీ విపణులను తీవ్ర కల్లోలానికి గురిచేశాయి. ముడి చమురు ధర బ్యారెల్‌కు ఏకంగా $96 సమీపానికి చేరడం, అమెరికా 10-ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ 4.81 శాతానికి ఎగబాకడంతో దలాల్ స్ట్రీట్‌లో బుధవారం నాడు నిధుల ఉపసంహరణ వెల్లువెత్తింది. ట్రేడింగ్ వ్యవధిలో బిఎస్ఈ సెన్సెక్స్ 809 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,800 యొక్క కీలకమైన మద్దతు స్థాయి కంటే దిగువకు జారిపోయింది.
బుధవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 473 పాయింట్ల నష్టంతో 76,471 వద్ద ప్రారంభమైంది. విదేశీ నిధుల వైదొలగుదల తీవ్రం కావడంతో ఒకానొక దశలో 1.05 శాతం (809 పాయింట్లు) పడిపోయి 76,135 వద్ద నిలిచింది. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 సూచీ 197 పాయింట్ల నష్టంతో 23,858 వద్ద ప్రారంభమై.. తరువాత 269 పాయింట్లు (1.1 శాతం) తగ్గి 23,786 స్థాయి వద్ద ముగిసింది.

చమురు ధరల పెరుగుదల అంతర్జాతీయ ద్రవ్యోల్బణాన్ని పెంచి, కేంద్రీయ బ్యాంకులు సుదీర్ఘకాలం వడ్డీ రేట్లను గరిష్టంగానే ఉంచేలా బలవంతం చేస్తుందనే భయాలు మదుపరులలో వ్యక్తమవుతున్నాయి. బాండ్ రాబడులు 5 శాతం సరిహద్దును తాకితే స్టాక్ మార్కెట్లలో మరింత తీవ్రమైన పతనం చోటుచేసుకుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆసియా వ్యాప్తంగా నిక్కీ 225 సూచీ 2.9 శాతం, దక్షిణ కొరియా కోస్పీ 3.08 శాతం మేర దెబ్బతిన్నాయి. ఈ ఊగిసలాట మధ్య లభించిన ఏకైక ఉపశమనం డాలర్‌తో రూపాయి మారకపు విలువ 4 పైసలు బలపడి 94.91 వద్ద ప్రారంభం కావడమే.
మరోవైపు ప్రాథమిక విపణిలో (IPO Market) కూడా ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం లిస్టవుతున్న అను ప్రాజెక్ట్స్ షేర్లు ఇష్యూ ధర కంటే రూ.7 డిస్కౌంట్‌తో గ్రే మార్కెట్‌లో ట్రేడ్ అవ్వడం బలహీన వాతావరణాన్ని సూచిస్తోంది. నేడు దీపా జ్యువెలర్స్, రేజ్ ఆఫ్ బిలీఫ్, ఫ్లై-హై మారిటైమ్, ఫార్మ్ పీస్ ఐపీఓలు రెండో రోజు ముగింపునకు చేరుకోగా, పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ తో పాటు మరికొన్ని ఎస్ఎంఈ ఐపీఓలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి రోజు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
