eMudhra: ఈముద్ర పని అయిపోయిందా.. 20 శాతం పడిన షేర్ ధర..!
డిజిటల్ సర్టిఫికేషన్ కంపెనీ అయిన ఇ-ముద్రలో జరిగిన ఒక భద్రతాపరమైన సంఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో గురువారం నాడు ఆ కంపెనీ షేర్లు దాదాపు 20 శాతం పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇ-ముద్ర డిజిటల్ సంతకం, వెబ్సైట్ భద్రతా సర్టిఫికేట్లను జారీ చేస్తుంది. ఈ స్టాక్ ఎన్ఎస్ఈలో 20 శాతం పడిపోయి ఒక్కో షేరు ధర రూ. 345కు చేరింది. బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు 20 శాతం పడిపోయి ఒక్కో షేరు ధర రూ. 345కు చేరింది. మనం రోజూ ఇంటర్నెట్లో ఎన్నో వెబ్సైట్లను ఓపెన్ చేస్తుంటాం.
అయితే ఆ వెబ్ సైట్ అసలైందా కాదా అని బ్రౌజర్ గుర్తించాలి.
ఈముద్ర జారీ చేసే సర్టిఫికేట్ల ఆధారంగా బ్రౌజర్ వెబ్ సైట్లను అసలైనదా లేక మోసపూరితమైనదా అని గుర్తిస్తాయి. ఈ సర్టిఫికెట్లు వెబ్సైట్లకు డిజిటల్ ఐడెంటిటీ కార్డులా పని చేస్తాయి. ఈముద్ర భారతదేశానికి చెందిన ప్రముఖ డిజిటల్ ట్రస్ట్ అండ్ సైబర్‌సెక్యూరిటీ సంస్థగా పని చేస్తోంది. ఇంటర్నెట్లో యూజర్లు సురక్షితంగా, నమ్మకంగా బ్రౌజ్ చేసేందుకు అవసరమైన డిజిటల్ సర్టిఫికెట్లను ఈ కంపెనీ జారీ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు గుర్తింపు ఉంది. అయితే ఇటీవల ఈముద్ర సంస్థ జారీ చేసిన కొన్ని డిజిటల్ సర్టిఫికెట్లలో ఊహించని భద్రతా లోపం బయటపడినట్లు తెలిసింది.

2025 ఏప్రిల్‌లో సృష్టించిన 8 ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లకు సంబంధించిన ప్రైవేట్ కీస్ అత్యంత బలహీనంగా ఉన్నట్లు ఎక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కనుగొన్నారు. సాధారణంగా వీటి కీస్ అత్యంత భద్రంగా ఉండాలి. చాలా క్లిష్టమైన ర్యాండమ్ నంబర్లతో ఉండి.. కంప్యూటర్లు కూడా ఈజీగా ఊహించలేనంత పటిష్టంగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఈముద్ర కేవలం సింగిల్-బైట్ నంబర్లను మాత్రమే ఉపయోగించినట్లు నిపుణులు గుర్తించారు. కేవలం 256 విలువలు మాత్రమే ఉండే ఈ సింగిల్ బైట్ నంబర్లను ఒక సెకను కంటే తక్కువ సమయంలోనే నిపుణులు బ్రేక్ చేయడంతో ఈముద్ర క్రెడిబిలిటీ దెబ్బతిన్నది.
ఈ బలహీనమైన కీస్‌ను ఒకవేళ సైబర్ నేరగాళ్లు కనుక గుర్తిస్తే.. వారు అసలైన వెబ్సైట్లను పోలిన నకిలీ సెక్యూరిటీ సర్టిఫికెట్లను సులభంగా సృష్టించే అవకాశం ఉంది.
దీనివల్ల సాధారణ యూజర్లు మోసపూరతిమైన వెబ్ సైట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. దీనిద్వారా మన వ్యక్తిగత సమాచారం, పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించబడే ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మొజిల్లా వంటి దిగ్గజ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఆయా బ్రౌజర్లలో ఈముద్రకు సంబంధించిన ఆ ప్రభావిత సర్టిఫికెట్లను వెంటనే బ్లాక్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈముద్ర స్టాక్ లో తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది. తాము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నందున చందాదారులపై ఎలాంటి ప్రభావం లేదని ఇ-ముద్ర సహ వ్యవస్థాపకుడు కౌశిక్ శ్రీనివాసన్ తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications