ట్రంప్ దెబ్బకు పడిపోయిన ఆయిల్ రేట్లు.. రికార్డు లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్!
ఈరోజు ఉదయం నుంచే భారత దేశ Stock market లో ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు. మార్కెట్లు ఓపెన్ అవ్వడమే భారీ లాభాలతో మెరిశాయి. బెంచ్‌మార్క్ సూచీలు అయిన సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ కూడా 1 శాతం కంటే ఎక్కువ లాభపడ్డాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన మరియు ఇరాన్‌పై అమెరికా జరపాల్సిన దాడులు చివరి నిమిషంలో రద్దు కావడం. ఈ పరిణామాల వల్ల గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు (Brent Crude Oil) ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఇది మన ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

మార్కెట్ల తాజా పరిస్థితి ఏంటి?
ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బిఎస్‌ఇ సెన్సెక్స్ (BSE Sensex) ఏకంగా 1,004 పాయింట్లు లేదా 1.36 శాతం పెరిగి 74,836.85 వద్ద ట్రేడవుతోంది. అలాగే నిఫ్టీ (Nifty) కూడా 279 పాయింట్లు ఎగబాకి 23,440.70 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ గనుక 23,500 మార్కును దాటితే, అది చాలా వేగంగా 23,700 స్థాయికి దూసుకెళ్లే అవకాశం ఉంది.
మార్కెట్లో భయాందోళనలను సూచించే 'ఇండియా విఐఎక్స్' (India VIX) కూడా 5.7 శాతం తగ్గి 14.72 కు పడిపోయింది. అంటే మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గాయని అర్థం. నిఫ్టీ లోని 50 షేర్లలో ఏకంగా 47 షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు 1.4 నుండి 1.6 శాతం పెరిగి మార్కెట్‌ను ముందుండి నడిపిస్తున్నాయి.
ట్రంప్ ఏం చెప్పారు? అసలు ఏం జరిగింది?
ఇరాన్‌తో జరుగుతున్న అంతర్గత చర్చలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయని, దానికి ఆమోదం కూడా లభించిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా సైనిక చర్యల ముప్పు ప్రస్తుతానికి తప్పడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. అమెరికా మార్కెట్లు అయిన డౌ జోన్స్, ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్ లు గత రెండు నెలల్లోనే అత్యుత్తమ సింగిల్-డే పర్ఫార్మెన్స్‌ను నమోదు చేశాయి.
దీని ప్రభావం ఆసియా దేశాలపై గట్టిగా పడింది. కొరియా మార్కెట్ 7 శాతానికి పైగా జంప్ చేయగా, జపాన్ నిక్కీ 3.77 శాతం పెరిగింది. చైనా, హాంకాంగ్ మార్కెట్లు కూడా మంచి లాభాలను చూశాయి.
ఇరాన్ స్పందన ఏంటి?
అయితే, ఈ డీల్‌పై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ స్పందిస్తూ.. చర్చలు నిజమే అయినప్పటికీ, తాము ఇంకా తుది నిర్ణయానికి రాలేదని చెప్పారు. చాలా వరకు టెక్స్ట్ ఓకే అయినప్పటికీ, అమెరికా కొన్ని అదనపు డిమాండ్లు పెడుతోందని ఆరోపించారు. ఎలాంటి ఒత్తిళ్లకు ఇరాన్ లొంగబోదని, తమ రెడ్ లైన్స్ దాటబోమని ఆయన స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం చల్లబడటంతో ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ కు కొత్త ఉత్సాహం వచ్చింది.


Click it and Unblock the Notifications