ఆదిలోనే కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కొంపలు ముంచిన అమెరికా.. సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే.
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు (జూలై 8, 2026) భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులతో స్టాక్ మార్కెట్ పతనంతో తన ప్రారంభం కొనసాగించింది. ముఖ్యంగా అమెరికా వాల్ స్ట్రీట్‌లో సాంకేతిక రంగ షేర్ల సూచీ అయిన నాస్‌డాక్ 100 ఒక్కరోజే 500 పాయింట్లకు పైగా.. అంటే దాదాపు రెండు శాతం మేర కుప్పకూలింది.
ఎస్&పి 500, నాస్‌డాక్ కాంపోజిట్ సూచీలు కూడా నష్టాలతో ముగియగా.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ట్రేడింగ్ సమయంలో సరికొత్త రికార్డును తాకినప్పటికీ.. చివరకు నష్టాల్లోనే ముగిసింది. అమెరికా మార్కెట్లలో నెలకొన్న ఈ ప్రతికూల సెంటిమెంట్ నేరుగా ఆసియా మార్కెట్లకు.. తద్వారా భారతీయ మార్కెట్లకు పాకి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనంతో ప్రారంభమయ్యేలా చేసింది.

ఈ అంతర్జాతీయ పతనానికి గల అత్యంత కీలకమైన కారణం సెమీకండక్టర్ లేదా చిప్ తయారీ కంపెనీల షేర్లలో ఒక్కసారిగా వచ్చిన అమ్మకాల వెల్లువ. గత ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో 150 శాతం నుండి 300 శాతం వరకు విపరీతమైన లాభాలను ఆర్జించిన ఇంటెల్, ఏఎమ్‌డి, మైక్రాన్, శాండిస్క్, వెస్ట్రన్ డిజిటల్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. కేవలం ఎన్విడియా మాత్రమే స్వల్ప లాభంతో స్థిరపడింది. దీనికి తోడు దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లాభాలు గత ఏడాదితో పోలిస్తే 19 రెట్లు పెరిగినప్పటికీ.. అవి విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోవడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. నాస్‌డాక్‌లో కొత్తగా ట్రేడింగ్ ప్రారంభించిన స్పేస్‌ఎక్స్ షేర్లు సైతం మొదటి రోజే ఏడు శాతం మేర నష్టపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.
మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభ భయాలు మార్కెట్లను మరింత ఆందోళనలోకి నెట్టాయి. హార్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు, దానికి ప్రతిస్పందనగా ఇరాన్‌పై యూఎస్ సెంట్రల్ కమాండ్ చేపట్టిన సైనిక చర్యల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఐదు శాతానికి పైగా ఎగబాకాయి. అమెరికా ట్రెజరీ శాఖ ఇరాన్‌కు ఇచ్చిన చమురు అమ్మకాల మినహాయింపును రద్దు చేయడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమైంది.
ఆగస్టు 21 వరకు అమల్లో ఉన్న ఇరాన్ చమురు అమ్మకాల మినహాయింపును యూఎస్ ట్రెజరీ ఉపసంహరించుకుంది. భారత్ వంటి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది పెద్ద ఆర్థిక భారం కానుంది. ప్రస్తుత తరుణంలో పెట్టుబడిదారులు పశ్చిమాసియా పరిణామాలతో పాటు.. భవిష్యత్ వడ్డీ రేట్ల విధానంపై స్పష్టత కోసం అమెరికా ఫెడరల్ రిజర్వ్ విడుదల చేయనున్న ఎఫ్‌ఓఎమ్‌సీ (FOMC) సమావేశ వివరాల కోసం నిశితంగా ఎదురుచూస్తున్నారు.
స్టాక్ మార్కెట్‌లో ఈ భారీ పతనం వెనుక ఉన్న 3 కారణాలు
1. అమెరికా స్టాక్ మార్కెట్ క్రాష్
2. చిప్ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు
3. ముడి చమురు ధరల పెరుగుదల
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
