Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కుప్పకూలాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1070 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతుండగా మరో కీలక సూచీ నిఫ్టీ 330 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. బెంచ్ మార్క్ సూచీలు రెండు ఈ క్రమంలో 1 శాతం మేర నష్టంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
నేడు స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కన్జూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్, పవర్, పీయూసీ, రియల్టీ, టెలికాం రంగాలకు చెందిన రంగాలు 1-3 శాతం మేర పతనంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ రంగాలకు చెందిన కంపెనీ షేర్లు సైతం నేడు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఇవి దలాల్ స్ట్రీట్ రక్తపాతానికి దారితీయటంతో పాటు ఇన్వెస్టర్లు లక్షల కోట్లు సంపదను కోల్పోవటానికి కారణంగా నిలిచాయి.

భారతీయ స్టాక్ మార్కెట్లు పతనానికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే ముందుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్ యుద్ధంతో ప్రపంచ దేశాలు గడగడలాడుతున్న వేళ స్టాక్ మార్కెట్లు కూడా దీనిని పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఇది ఇండియాలో కూడా ట్రేడ్ టెన్షన్స్ పెంచుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ఒక్కరోజు ముందు స్టాక్ మార్కెట్లు కుప్పకూలటం కొంత ఆందోళనలకు దారితీస్తోంది. ఇండియాకు ఈ సమావేశం ట్రంప్ సుంకాల నుంచి ఎంత ఉపశమనం అందిస్తుందనే ప్రకటన కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి.
ఇదే క్రమంలో మార్కెట్ల పనతానికి ఇతర కారణాలను గమనిస్తే విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం తమ డబ్బును వెనక్కి తీసుకెళ్లటం కూడా మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. అయితే విదేశీ మదుపరులు అమ్మకాలకు దిగటానికి అసలు కారణం పడిపోతున్న రూపాయి విలువగా నిపుణులు చెబుతున్నారు. డాలర్ తో రూపాయి మారకపు విలువ 88 వద్దకు దిగజారటం వల్ల వారు పొందే వాస్తవ రిటర్న్ తగ్గిపోతుందని అందుకే విదేశీ మదుపరులు తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం భారతీయ ఈక్విటీల నుండి దాదాపు 9 బిలియన్ డాలర్లను విదేశీ మదుపరులు వెనక్కి తీసుకోవటంతో ఆసియాలో అత్యంత చెత్త పనితీరును రూపాయి కనబరిచింది.
ఇక చివరిగా దేశీయ స్టాక్ మార్కెట్లలో కార్పొరేట్ కంపెనీలు విడుదల చేస్తున్న మూడవ త్రైమాసిక ఫలితాలు కూడా నిరాశాజనకంగా ఉండటం ఇన్వెస్టర్లను అప్రమత్తంగా ఉండేలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటం, డిమాండ్ వాతావరణం పుంజుకోకపోవటం పెట్టుబడిదారులను నిష్కమించేలా చేస్తోందని వారు అంటున్నారు.


Click it and Unblock the Notifications