Sensex-Nifty Crash: భారతీయ స్టాక్ మార్కెట్లు గడచిన కొద్ది రోజులుగా భారీ ఒడిదొడుకులతో నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బెంచ్ మార్క్ సూచీలు 1 శాతం మేర పతనాన్ని చూశాయి. ప్రధానంగా ఆయిల్, ఆటో, మెటల్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో భారీగా అమ్మకాలు కనిపించాయి.
అక్టోబరు నెలలో ఇప్పటి వరకు నిఫ్టీ సూచీ దాదాపు 5 శాతం మేర నష్టాన్ని చూడగా.. సెన్సెక్స్ సూచీ 4 శాతం పతనాన్ని చూసింది. మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 931 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ సూచీ 309 పాయింట్ల నష్టాన్ని చూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 706 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1504 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేశాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల పేలవమైన ఆదాయాల ప్రకటన, స్థిరంగా కొనసాగుతున్న ఎఫ్‌ఐఐ అమ్మకాలు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు వంటి కారణాలతో భారతీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం పోరాడుతున్నాయి.

ముఖ్యంగా చైనాలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటం అక్కడి ప్రభుత్వం బూస్టప్ ప్యాకేజీని అందించటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను విక్రయించి చైనా మార్కెట్లలో కొనుగోళ్లకు దిగటం పెద్ద కారణంగా ఉంది. దాదాపు ఏడాది కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగటంతో ప్రస్తుతం మార్కెట్లు ఓవర్ వ్యాల్యూలో ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఇదే క్రమంలో దేశీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సైతం అధిక మార్కెట్ విలువ మధ్య సరసమైన ధరలకు క్వాలిటీ స్టాక్స్ కొనుగోలుకు అందుబాటులో లేకపోవటంతో భారీగా క్యాష్ కలిగి ఉన్నట్లు వెల్లడైంది. అక్టోబరులో నిన్నటి వరకు విదేశీ మదుపరులు రూ.82,479.7 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Why Market Is Down Today:
ఈవారం రెండు ట్రేడింగ్ సెషన్లలో పెట్టుబడిదారులకు సంబంధించిన దాదాపు రూ.13 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ప్రపంచ అనిశ్చితులతో పాటుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 3% పైగా క్షీణించింది, బాండ్ ఈల్డ్‌లు పెరగడం, వడ్డీ రేటు పెంపుపై ఆందోళనలు సెక్టార్ ఔట్‌లుక్‌పై ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అనిశ్చితిని పెంచుతున్నాయి. టెల్ అవీవ్ సమీపంలో హిజ్బుల్లా రాకెట్ దాడులతో సహా తీవ్ర సంఘర్షణ నివేదికలు ప్రపంచ మార్కెట్లను రిస్క్-ఆఫ్ మోడ్‌లోకి పంపాయి. ఈ భౌగోళిక రాజకీయ అశాంతి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.
దీర్ఘకాలిక ప్రాథమిక అంశాలు చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పెట్టుబడిదారుల ప్రవర్తనను ప్రభావితం చేస్తున్నందున స్వల్పకాలిక అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతీయ మార్కెట్లపై ప్రభావం భారీగా ఉండటంతో అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు రేపు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయనే ఆందోళనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications