Market News: ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఫిబ్రవరిలో మార్కెట్ల క్రాష్ పక్కా, పూర్తి వివరాలు
Market Crash in February: ఇప్పటికే దాదాపు రెండు నెలలుగా భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొడుకుల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైనాకు చెందిన ఏఐ ఆధారిత యాప్ డీప్‌సీక్ అమెరికాతో పాటు భారతీయ మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. యూబీఎస్ కూడా ఇన్వెస్టర్లను డిప్స్ వద్ద కొనుగోలు చేయమని సూచించిన సంగతి తెలిసిందే.
ఈక్రమంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిన రాబర్ట్ కియోసాకీ బాంబు లాంటి వార్త ఒకటి పేల్చారు. స్టాక్ మార్కెట్ల చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో క్రాష్ ఫిబ్రవరి 2025లో ఉండనుందని సంచలన ట్వీట్ చేశారు. తాను ఎంచనా వేసిన రాబోయే క్రాష్ సాంప్రదాయ మార్కెట్లకు భూకంప సంఘటనగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించే పెట్టుబడిదారులకు ఇదొక అరుదైన పెట్టుబడి అవకాశంగా కూడా ఉంటుందని వెల్లడించారు.

చాలా కాలం ముందుగానే కియోసాకీ ఈ మార్కెట్ల పతనాన్ని అంచనా వేశారు. 2013లో తన పుస్తకంలో ఆర్థిక మాంద్యం గురించి అంచనా వేశారు. ఇది మునుపటి పతనాలను అతిక్రమిస్తుందని పేర్కొన్నారు. తన అంచనాలు త్వరలోనే నిజం కాబోతున్నట్లు తన ట్వీట్ లో వెల్లడించారు. తెలివైన ఇన్వెస్టర్లు దీనిని విపత్తుగా కాకుండా పెట్టుబడి అవకాశంగా వాడుకోవాలని సూచించారు. ఒక్క పతనంతో ప్రతిదీ అమ్మకానికి వస్తుందని కియోసాకి అన్నారు. సంక్షోభ సమయంలో కార్ల నుంచి ఇళ్ల వరకు అన్నీ సరసమైన ధరలకే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా నొక్కి చెప్పారు.
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత కియోసాకి ప్రకారం డబ్బు స్టాక్స్, బాండ్స్ నుంచి బిట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లోకి మార్చబడుతుందని, ఇదొక పెద్ద షిఫ్ట్ అని అన్నారు. ఈ క్రమంలో క్రిప్టో కరెన్సీలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. పెట్టుబడిదారులు ఈ క్రమంలో తమ డబ్బును గతంలో ఆయన చెప్పిన బంగారం, వెండితో పాటు కొత్తగా క్రిప్టో కరెన్సీలై బిట్‌కాయిన్ లోకి మార్చటం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులకు రక్షణ కల్పించబడుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం బిట్‌కాయిన్ రిటైల్ పెట్టుబడిదారులతో పాటు సంస్థాగత పెట్టుబడిదారులకు కూడా ఆకర్షిస్తోందని అన్నారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బిట్ కాయిన్లలో చిన్న మెుత్తంలో పెట్టుబడి కలిగి ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో మంచి రాబడులను అందుకోవటానికి మంచి అవకాశం ఉందని కియోసాకీ పేర్కొన్నారు. ఇదే క్రమంలో స్టాక్ మార్కెట్లను నమ్ముకున్న ఇన్వెస్టర్లు భారీ నష్టాలను మూటకట్టుకుంటారని కూడా హెచ్చరించారు. అందుకే ప్రజలు భిన్నంగా ఆలోచించాలని, సాంప్రదాయ పెట్టుబడి ప్రణాళికలపై ప్రశ్నలు లేవనెత్తారు.


Click it and Unblock the Notifications