మంగళవారం, డిసెంబర్ 9న స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే భారతీయ బియ్యం కంపెనీల షేర్లు గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ 10 శాతం వరకు పడిపోయాయి. KRBL, LT ఫుడ్స్, కోహినూర్ ఫుడ్స్, చమన్ లాల్ సెటియా, GRM ఓవర్సీస్ వంటి ప్రముఖ బియ్యం కంపెనీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనల నేపథ్యంలో ఈ భారీ నష్టాలు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై కొత్త సుంకాలు విధించవచ్చని ట్రంప్ హెచ్చరించడం పెట్టుబడిదారులను కలవరపెట్టింది.
ఈ రద్దీ అమ్మకాల సమూహంలో LT ఫుడ్స్ అత్యధిక నష్టాన్ని చవిచూసింది. కంపెనీ షేరు ఇంట్రాడేలో 8 శాతం పడిపోయి రూ. 362 కనిష్ట స్థాయిని తాకింది. KRBL షేర్లు కూడా దాదాపు 3 శాతం నష్టపోయాయి, అయితే తరువాత కొంత మేరకు తిరిగి రికవరీ అయ్యాయి. కోహినూర్ ఫుడ్స్ షేర్లు మాత్రం 10 శాతం వరకూ క్షీణించాయి. చమన్ లాల్ సెటియా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కూడా 5 శాతం నష్టానికి గురైంది. కావేరీ సీడ్ కంపెనీ, GRM ఓవర్సీస్ లిమిటెడ్ షేర్లు వరుసగా తగ్గుముఖం పట్టాయి. బాస్మతి, నాన్-బాస్మతి రైస్ ఎగుమతులపై భారత సంస్థలు ఆధారపడటం వల్ల పెట్టుబడిదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించారు.

ఈ Rice షేర్ మార్కెట్ పతనం ప్రధానంగా ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యల ప్రభావమేనని చెప్పవచ్చు. సోమవారం వైట్ హౌస్‌లో ట్రంప్ ప్రసంగిస్తూ.. భారతదేశం నుండి దిగుమతి చేసుకునే బియ్యం, కెనడా నుండి దిగుమతి అయ్యే ఎరువులపై కొత్త టారిఫ్‌లు విధించే అవకాశాన్ని సూచించారు. ఈ దిగుమతుల కారణంగా అమెరికా రైతులకు నష్టం జరుగుతోందని, వారు పోటీలో నిలబడలేకపోతున్నారని ట్రంప్ అన్నారు. అమెరికన్ రైతులకు మద్దతుగా 12 బిలియన్ డాలర్ల సబ్సిడీ ప్యాకేజీ ప్రకటించారు.
భారతదేశం, థాయిలాండ్, వియత్నాం బియ్యాన్ని అమెరికాలో చాలా తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. అమెరికా రైతులు ఈ విషయంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడిన ట్రంప్ ఇది ఇక కొనసాగించలేనని వ్యాఖ్యానించారు. ట్రంప్ అనుసరిస్తున్న ఆంక్షాత్మక టారిఫ్ విధానం ఇప్పటికే గ్లోబల్ వాణిజ్య సంబంధాలపై ఒత్తిడిని పెంచుతోంది. ట్రంప్ ప్రకటనలు భారతదేశం-అమెరికా మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పంద చర్చలకు నీలి మబ్బులు కమ్మేసాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే భారత దిగుమతులపై 50 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ ఆర్థిక ఒత్తిడిని పెంచారు.
భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేసి పరోక్షంగా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. అయితే, ఇటీవల ఇరు దేశాలు వాణిజ్య చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా ప్రతినిధి బృందం డిసెంబర్ 7న భారతదేశానికి చేరుకుంది. అమెరికా డిప్యూటీ సెక్రటరీ అలిసన్ హుకర్ ఐదు రోజుల పర్యటనలో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే విషయాలను పరిశీలిస్తున్నారు. అయితే, తాజా టారిఫ్ హెచ్చరికల తర్వాత ముఖ్యమైన ఒప్పందాలు కుదరే అవకాశాలు తగ్గిపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications