Reliance Bonds: రిలయన్స్ బాండ్లు రాబోతున్నాయి.. వడ్డీ 7.47 శాతం..!
బిలియనీర్ ముఖేష్ అంబానీ కొత్తగా ప్రయత్నం చేస్తున్నారు. నిధుల సమీకరణకు కొత్త దారిలోకి వెళ్తున్నారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని.. ఇప్పుడు మరో దారిలో నిధులు సమీకరించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్ణయించింది. బాండ్ల ద్వారా భారీ స్థాయిలో నిధులను సేకరించడానికి సిద్ధమైంది. వచ్చే వారమే స్థానిక కరెన్సీ బాండ్ల ద్వారా రూ. 12,500 కోట్ల ($1.3 బిలియన్లు) వరకు నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్కెట్‌లో అతిపెద్ద లిస్టెడ్ బాండ్ జారీ అయ్యే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ 7.47 శాతం కూపన్ రేటుతో ఐదేళ్ల కాలపరిమితి కలిగిన బాండ్ల ద్వారా ఈ నిధులను సమీకరించాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది.
యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్ ఈ జారీ ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ జారీ విలువ రూ. 10,000 కోట్లుగా ఉండగా, అదనంగా మరో రూ. 2,500 కోట్లను సమీకరించేందుకు గ్రీన్‌షూ ఆప్షన్ కూడా ఇందులో ఉందని తెలిసిన వారు చెబుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ గణాంకాల ప్రకారం దేశీయ రుణ మార్కెట్‌లో ఈ ఏడాది జరగనున్న అతిపెద్ద లిస్టెడ్ బాండ్ అమ్మకం ఇదే కానుందని తెలుస్తోంది. నవంబర్ 2023 తర్వాత ఈ సంస్థ చేపడుతున్న మొదటి బాండ్ జారీ కూడా ఇదే అవ్వనుంది. రిలయన్స్ ప్రతినిధి దీనిపై తక్షణమే స్పందించలేదు. అలాగే యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యెస్ బ్యాంక్ ప్రతినిధులు కూడా పని వేళల తర్వాత పంపిన ఈమెయిళ్లకు వెంటనే స్పందించలేదని బిజినెస్ పోర్టర్స్ పేర్కొంటున్నాయి.

తక్కువ వడ్డీ రేట్ల కారణంగా కంపెనీలు తమ ఆర్థిక అవసరాల కోసం బ్యాంక్ రుణాలను ఎంచుకోవడంతో ఈ ఏడాది ప్రారంభంలో మందకొడిగా సాగిన స్థానిక బాండ్ మార్కెట్‌కు రిలయన్స్ బాండ్ల జారీ ఊతమివ్వనుంది. ద్రవ్యోల్బణ ముప్పుల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాల మధ్య బాండ్ల జారీ ఆసక్తికరంగా మారనుంది. భారతీయ కంపెనీలు ఈ ఏడాది ఇప్పటివరకు దేశీయ బాండ్ల ద్వారా రూ. 8.9 లక్షల కోట్లను సమీకరించాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 11 శాతం తక్కువగా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
