రిలయన్స్ జియో IPO వచ్చేస్తోంది, ఇన్వెస్టర్లకు పండగే.. ఏజీఎంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు ఇవిగో..
Reliance Jio IPO : భారతదేశ టెలికాం, డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్ త్వరలో షేర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శుక్రవారం జరిగిన 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లోకీలక ప్రకటన చేశారు. జియో IPOని 2026 ప్రథమార్థంలో ప్రారంభించనున్నట్లు జియో అధినేత ప్రకటించారు. జియో IPO కోసం దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
2026 మొదటి ఆరు నెలల్లో లిస్టింగ్ లక్ష్యంగా పెట్టుకున్నాము. జియో కూడా ప్రపంచ టెక్ దిగ్గజాల మాదిరిగా పెట్టుబడిదారులకు విలువను సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ఈ IPO అన్ని పెట్టుబడిదారులకు ఎంతో ఆకర్షణీయమైన అవకాశంగా నిలుస్తుందని అంబానీ స్పష్టం చేశారు. జియో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా.. ఈ కంపెనీ సాధించిన విజయాలను అంబానీ ప్రస్తావించారు.ఇంకా వారం రోజుల్లో జియో తన 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ రోజు జియో కుటుంబం 500 మిలియన్ల కస్టమర్లను దాటిందని గర్వంగా చెబుతున్నానని అధినేత అన్నారు.

జియో వల్ల భారతదేశ డిజిటల్ ఎకోసిస్టమ్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అంబానీ గుర్తు చేశారు. జియో ఉచిత వాయిస్ కాల్స్ అందించడం ద్వారా లక్షలాది మందిని మొబైల్ వాడకానికి అలవాటు చేసింది. అలాగే ఆధార్, యుపిఐ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ రోజున భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఎదగడానికి జియో కూడా సహకరించిందని అన్నారు.
భవిష్యత్తు దిశలో జియో చేయబోయే ఐదు కీలక ప్రాధాన్యతలను అంబానీ వివరించారు. అవేంటంటే.. ప్రతి భారతీయుడిని మొబైల్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానించడం మొదలి లక్ష్యమన్నారు. ప్రతి గృహాన్ని డిజిటల్ సేవలతో సన్నద్ధం చేయడం, వ్యాపారాలను సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌లతో డిజిటలైజ్ చేస్తామన్నారు. Everyone for Everyone అనే ప్రచారంతో సమాన డిజిటల్ సేవలు అందిస్తామన్నారు. విదేశీ మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు.
ఈ సారి AGMలో జియో అనేక కొత్త ఉత్పత్తులను ప్రకటించింది. జియో స్మార్ట్ హోమ్, జియో టీవీ+, జియో టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా గృహాలను స్మార్ట్ డిజిటల్ హబ్‌లుగా మార్చే ప్రణాళికను రూపొందించింది. జియోపిసి (JioPC) ద్వారా టీవీ లేదా ఏదైనా స్క్రీన్‌ను AI-రెడీ కంప్యూటర్ గా మార్చే విప్లవాత్మక ఉత్పత్తికి శ్రీకారం చుడుతోంది. అలాగే జియోఫ్రేమ్స్ (JioFrames) ద్వారా భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన AI ఆధారిత ధరించగలిగే ప్లాట్‌ఫామ్ ను రెడీ చేస్తోంది. వి బహుభాషా AI వాయిస్ అసిస్టెంట్ సదుపాయంతో వస్తాయి, హ్యాండ్స్-ఫ్రీ డిజిటల్ అనుభవాన్ని కలిగిస్తాయి. AI ప్రతిచోటా అందరికీ అనే నినాదంతో జియో, భారతదేశంలో కృత్రిమ మేధస్సు విప్లవానికి నాంది పలకబోతోందని ముఖేష్ అంబానీ తెలిపారు.
జియో ప్రారంభించినప్పటి నుంచి టెలికాం ధరలను తగ్గించింది, ఉచిత డేటా, వాయిస్ సేవలతో కోట్లాది మందిని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు IPO ప్రకటనతో పాటు కొత్త ఉత్పత్తులు, AI విస్తరణ, అంతర్జాతీయ కార్యకలాపాలు కలిపి, జియో మరొక దశ వృద్ధి దిశగా వెళ్తోందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications


