రూ. 90 వేల కోట్ల విలువైన ఐటీ కంపెనీ.. ఒక్క వార్తతో షేర్ మార్కెట్లో కుప్పకూలింది.. ఎంతలా అంటే..
దిగ్గజ ఐటీ సేవల సంస్థ పర్సిస్టెంట్ సిస్టమ్స్ (Persistent Systems) షేర్లలో ఒక్కసారిగా తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. నిధుల సమీకరణకు సంబంధించి కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయం స్టాక్ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితికి దారితీయడంతో స్టాక్ ధర భారీగా క్షీణించింది. బోర్డు సమావేశం ఎజెండాలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP) అంశాన్ని చేర్చడమే ఈ పతనానికి ప్రధాన కారణమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. 90 వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్నఈ టెక్ దిగ్గజం నుంచి వెలువడిన వార్తతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయి షేర్లను భారీగా అమ్ముకున్నారు.
కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశం సెప్టెంబర్ 2, 2026న జరగనుంది. ఈ సమావేశంలో ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ECB), నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు (NCDs), క్యూఐపీ (QIP), ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్లు (FCCB), ప్రిఫరెన్షియల్ ఇష్యూ వంటి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదనలను పరిశీలించనున్నట్లు పర్సిస్టెంట్ సిస్టమ్స్ ప్రకటించింది. అయితే ఎంత మొత్తంలో నిధులు సేకరిస్తారు.. ఏ మార్గాన్ని ఎంచుకుంటారనే వివరాలను స్పష్టం చేయకపోవడం పెట్టుబడిదారులలో ఆందోళన పెంచింది. ఉదయం రూ. 5,855.50 వద్ద ప్రారంభమైన షేరు ధర ఒక దశలో రూ. 5,606.00 కు పడిపోయింది. ఈ ఏడాది (2026 లో) ఈ స్టాక్ ఇప్పటివరకు 11 శాతం మేర నష్టపోగా.. గడిచిన వారంలోనే 2 శాతం మేర క్షీణించింది.

మొదటిది.. క్యూఐపీ ద్వారా వాటా పలుచన (Dilution) అవుతుందనే భయం అని చెప్పవచ్చు. QIP విధానంలో కొత్త షేర్లను జారీ చేయడం వల్ల కంపెనీలోని మొత్తం షేర్ల సంఖ్య పెరిగి, ఉన్నత వాటాదారుల ఓటింగ్ శాతం తగ్గడమే కాకుండా.. ఒక్కో షేరుపై వచ్చే ఆదాయం (EPS) ఒత్తిడికి గురవుతుంది. అందుకే ఈక్విటీ విలీనం భయంతో ఇన్వెస్టర్లు ముందే షేర్లను విక్రయించడం ప్రారంభించారు.
రెండవద.. కంపెనీ యాజమాన్యం గతంలో చేసిన ప్రకటనలకు భిన్నంగా వ్యవహరించడం. జర్మన్ ఐటీ సంస్థ 'నగరో' (Nagaro) కొనుగోలు సమయం జూన్ 29, 2026న కంపెనీ సీఈఓ సందీప్ కల్రా మాట్లాడుతూ తమకు క్యూఐపీ అవసరం లేదని.. భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన లేదని మీడియాకు తెలిపారు. కానీ ఇప్పుడు బోర్డు ఎజెండాలో క్యూఐపీని చేర్చడం వల్ల మేనేజ్‌మెంట్ గైడెన్స్‌పై పెట్టుబడిదారులకు నమ్మకం సడలింది.
మూడవది.. నగరో కొనుగోలు కోసం తీసుకున్న €1.4 బిలియన్ల (సుమారు రూ. 14,000 కోట్లు) బ్రిడ్జ్ లోన్‌ను రీఫైనాన్స్ చేయాల్సిన సవాలు. 18 నెలల కాలపరిమితి కలిగిన ఈ స్వల్పకాలిక రుణాన్ని దీర్ఘకాలిక రుణంగా లేదా ఈక్విటీగా మార్చుకోవాల్సి ఉంది. కంపెనీ ఇసిబి (ECB) లేదా ఎన్‌సిడి (NCD) ని ఎంచుకుంటే వడ్డీ భారం పెరుగుతుంది, విదేశీ కరెన్సీ రుణాలపై రూపాయి క్షీణత ప్రభావం పడుతుంది.
నాలుగోది.. నగరో ఒప్పందం పరిమాణం చాలా పెద్దది కావడం. నగరో ఎంటర్‌ప్రైజ్ విలువ దాదాపు 1.27 బిలియన్ యూరోలు (రూ. 13,600 కోట్లు) కాగా, ఇది పర్సిస్టెంట్ మార్కెట్ క్యాప్‌లో (రూ. 88,500 కోట్లు) దాదాపు 15 శాతానికి సమానం. ఇదివరకు నగదు-మిగులు కలిగిన కంపెనీగా ఉన్న పర్సిస్టెంట్, ఇప్పుడు అధిక రుణభారంతో కూడిన బ్యాలెన్స్ షీట్ వైపు వెళ్లవచ్చని మార్కెట్ భావిస్తోంది.
నగరో కొనుగోలు ద్వారా యూరప్ మార్కెట్‌లో వ్యాపార విస్తరణ జరిగి సుదీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరినప్పటికీ.. ప్రస్తుతానికి సెప్టెంబర్ 2 బోర్డు సమావేశంపైనే అందరి దృష్టి నెలకొంది. కంపెనీ ఈక్విటీ సడలింపు లేకుండా తక్కువ వడ్డీతో కూడిన దీర్ఘకాలిక రుణాలను ఎంచుకుంటే స్టాక్ కోలుకునే అవకాశం ఉంది. లేనిపక్షంలో హెచ్చుతగ్గులు కొనసాగుతాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
