పరాగ్ పారిఖ్: ఐటీ స్టాక్స్ కొనుగోలు వెనుక అసలు వ్యూహం ఏంటి?
గత కొన్ని నెలలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో భారీగా నష్టపోయిన టాప్ కంపెనీల లిస్టులో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ముందు వరుసలో ఉన్నాయి.
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ వృద్ధి కారణంగా ఇన్వెస్టర్లు భారత ఐటీ రంగంపై నమ్మకం కోల్పోయి, తమ వద్ద ఉన్న షేర్లను అమ్మేశారు. దీంతో ఈ మూడు ఐటీ దిగ్గజాల షేర్లు తమ గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 50-55 శాతం వరకు పడిపోయాయి. ఇది రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల వరకు అందరిలోనూ ఆందోళన నింపింది.
ఈ కంపెనీల షేర్ల పతనం కారణంగా మొత్తం ఐటీ రంగమే చరిత్రాత్మక నష్టాలను చవిచూసింది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇండియాలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అయిన పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఈ మూడు టాప్ ఐటీ కంపెనీల షేర్లను కొనుగోలు చేసి, జూన్ నెలలో తన హోల్డింగ్స్‌ను పెంచుకుంది. ఈ విషయాన్ని తన నెలవారీ పోర్ట్‌ఫోలియో రిపోర్ట్‌లో వెల్లడించింది.

సుమారు రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడులను నిర్వహిస్తున్న పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్, ఈ జూన్ నెలలో 54 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో మే నెలలో 3.73 కోట్లుగా ఉన్న ఇన్ఫోసిస్ షేర్ల హోల్డింగ్, ఇప్పుడు 4.27 కోట్లకు పెరిగింది.
అదేవిధంగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో సుమారు 31.15 లక్షల షేర్లను కొనుగోలు చేయడంతో, మొత్తం హోల్డింగ్ 4.61 కోట్ల షేర్లకు చేరింది. ఇక టీసీఎస్ కంపెనీలో 18.26 లక్షల షేర్లను కొని, తన మొత్తం వాటాను 1.77 కోట్లకు పెంచుకుంది.
ఈ ఏడాది ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చిన షేర్లలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ ముందున్నాయి. మరి అలాంటప్పుడు పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ వంటి పెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థలు వీటిని ఎందుకు కొనుగోలు చేస్తున్నాయి..?
ఈ ప్రశ్నకు పరాగ్ పారిఖ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, డైరెక్టర్ అయిన రాజీవ్ ఠక్కర్ ఇటీవల ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. 'మేము ఏఐ టెక్నాలజీ వల్ల ఈ రంగానికి ఎదురయ్యే సవాళ్లను మాత్రమే కాకుండా, కంపెనీల క్యాష్ ఫ్లో ఆధారంగా ఈ పెట్టుబడి నిర్ణయాలు తీసుకున్నాం' అని ఆయన స్పష్టం చేశారు.
ఏఐ టెక్నాలజీ వల్ల ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇంకా స్పష్టత రాలేదని, అందుకే తమ పెట్టుబడి నిర్ణయాలకు భవిష్యత్ క్యాష్ ఫ్లో కంటే ప్రస్తుత క్యాష్ ఫ్లోనే ముఖ్యమని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఐటీ కంపెనీలు సాధారణంగా డాలర్లలో ఆదాయం సంపాదించి, రూపాయలలో ఖర్చు చేస్తాయి. దీనివల్ల ఐటీ కంపెనీలకు పెద్ద భారంగా ఉండే జీతాల ఖర్చులు తగ్గుతాయని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఏఐ వచ్చినా, రాకపోయినా ఐటీ కంపెనీల పనితీరు, వ్యాపారం మారబోదని ఆయన అన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఏఐ ద్వారా ఆటోమేషన్, సామర్థ్యం మెరుగుపడటం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు లభించే ఛాన్స్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఇదే సమయంలో, భారతదేశంలోని మరో ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ మాత్రం ఐటీ రంగ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్లు తెలిపింది. ఏఐ టెక్నాలజీ వల్ల ఐటీ కంపెనీల ఆదాయం దెబ్బతింటుందని హెచ్చరించింది.


Click it and Unblock the Notifications
