క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం ఒరాకిల్ వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తోందనే వార్తలు ఒక్కసారిగా టెక్ ప్రపంచాన్నికలవరపెడుతున్నాయి. వాషింగ్టన్ రాష్ట్రం, సియాటెల్ కార్యాలయాలలో రిమోట్‌గా పనిచేస్తున్న 491 మంది ఉద్యోగులను జూన్ 1 నుండి తొలగిస్తామని ఒరాకిల్ మంగళవారం రాత్రి ప్రకటించింది.
ఈ నోటీసు వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) చట్టం కింద దాఖలైంది. ఒరాకిల్ తెలిపినట్లుగా.. ఈ ఉద్యోగ కోతలు సిబ్బంది తగ్గింపు, ఇతర తొలగింపులులో భాగంగా ఉన్నాయి. అయినప్పటికీ సియాటెల్ కార్యాలయాలు తెరిచి ఉంటాయని కంపెనీ తెలిపింది.మే 2025 నాటికి, ఒరాకిల్‌లో సుమారు 162,000 పూర్తి-కాల ఉద్యోగులు ఉన్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. మార్చి 31, 2026 నాటికి Oracle కంపెనీ తన గ్లోబల్ విభాగాల్లోని వివిధ హోదాల్లో ఉన్న సిబ్బందికి ఉద్వాసన పలుకుతూ అధికారిక సమాచారం అందించింది. ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా నెట్‌సూట్, క్లౌడ్ మౌలిక సదుపాయాల విభాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కంపెనీ తన నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 18 శాతం మంది సిబ్బందిని తొలగించడం ద్వారా ఏడాదికి బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేయాలని ఒరాకిల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఆశ్చర్యకరంగా.. కంపెనీలో ఉద్యోగ కోతలు మొదలైనప్పటికీ స్టాక్ మార్కెట్‌లో ఒరాకిల్ షేర్లు సుమారు 6 శాతం మేర పెరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగుల తొలగింపు వార్తలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు ఆందోళన చెందుతారు, కానీ ఒరాకిల్ విషయంలో అందుకు భిన్నమైన స్పందన కనిపించింది.
దీనికి ప్రధాన కారణం కంపెనీ తన భవిష్యత్తు దృష్టిని సంప్రదాయ సాఫ్ట్‌వేర్ సేవల నుండి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల వైపు మళ్లించడమే. నిరుపయోగంగా ఉన్న విభాగాల్లో ఖర్చులను తగ్గించి, ఆ నిధులను ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం కోసం మళ్లించాలని కంపెనీ భావిస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పు కంపెనీ ఆర్థిక స్థితిని దీర్ఘకాలంలో మెరుగుపరుస్తుందని వాల్ స్ట్రీట్ విశ్లేషకులు, పెట్టుబడిదారులు నమ్ముతున్నారు.
ముఖ్యంగా ఓపెన్ ఏఐ (OpenAI) వంటి సంస్థలతో ఒరాకిల్ కుదుర్చుకున్న భారీ ఒప్పందాలు మార్కెట్‌లో సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. సుమారు 300 బిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించ తలపెట్టిన భారీ డేటా సెంటర్ల ప్రాజెక్టు ఒరాకిల్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబెడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుతానికి భారీగా అప్పులు చేయాల్సి వస్తున్నప్పటికీ, ఉద్యోగుల కోత ద్వారా లభించే మిగులు నిధులు కంపెనీకి ఆర్థికంగా వెసులుబాటును కల్పిస్తాయి. సెప్టెంబర్ 2025 తర్వాత షేర్ల ధరల్లో ఎదురైన పతనం నుంచి బయటపడటానికి కంపెనీ చేస్తున్న ఈ ప్రయత్నాలను పెట్టుబడిదారులు స్వాగతిస్తున్నారు.
ఉద్యోగుల పరంగా చూస్తే ఇది ఒక ఆందోళనకరమైన పరిణామం అయినప్పటికీ.. సంస్థ యొక్క మనుగడ, భవిష్యత్తు వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఒరాకిల్ ఈ అడుగు వేసింది. కార్యాలయాల్లో పని చేసే విధానాన్ని, తమ ప్రాధాన్యతలను పూర్తిగా మార్చుకోవడం ద్వారా కొత్త సాంకేతిక విప్లవానికి తగ్గట్టుగా సిద్ధం కావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పరిణామం టెక్ రంగంలో మారుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది, ఇక్కడ కంపెనీలు మానవ వనరుల కంటే సాంకేతిక వనరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. మొత్తానికి, ఒరాకిల్ షేర్ల పెరుగుదల అనేది కంపెనీ తీసుకున్న కఠిన నిర్ణయాల పట్ల పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.


Click it and Unblock the Notifications