ప్రపంచపు ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా (Nvidia) స్టాక్ మార్కెట్లో కొత్త చరిత్రను లిఖించింది. బుధవారం (జూలై 10, 2025) నాడు ఈ సంస్థ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లను (భారత కరెన్సీలో లక్షల కోట్ల రూపాయలు) అధిగమించింది. ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది.
AI (Artificial Intelligence) రంగంలో పెరుగుతున్న డిమాండ్‌తో ఎన్విడియా షేర్లు బుధవారం 2.8 శాతం పెరిగి ఒక్కో షేరు ధర 164.42 డాలర్లకి చేరుకుంది. AI హార్డ్‌వేర్ తయారీలో ఎన్విడియాకు ఉన్న అగ్రస్థానమే కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టింది.ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు, డేటా సెంటర్లు, పరిశోధనా సంస్థలు-all AI సాంకేతికతలపై భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో, ఎన్విడియా హార్డ్‌వేర్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనితో, కంపెనీ Wall Street లో మోస్ట్ వాల్యూబుల్ కంపెనీగా మారింది.

ఎన్విడియా 2023 జూన్‌లో 1 ట్రిలియన్ డాడర్ల మార్కెట్ విలువను చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే అది మూడు రెట్లు పెరిగి 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఎన్విడియా షేర్లు ఏప్రిల్ నెలలో గరిష్ఠ తగ్గుదల అనుభవించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించడంతో మార్కెట్లు కుదేలయ్యాయి. చైనాలో అభివృద్ధి చెందుతున్న DeepSeek అనే AI కంపెనీతో పోటీ కూడా పెట్టుబడిదారులలో భయాన్ని కలిగించింది. అయినప్పటికీ, తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయి.
ఈ విజయానికి ముఖ్య కారణం ఎన్విడియా CEO జెన్సెన్ హువాంగ్ నే చెప్పుకోవచ్చు. సాధారణ జీవితం నుండి ప్రపంచ అగ్ర టెక్ దిగ్గజ CEOగా ఎదిగిన ఆయన కథ కూడా ఎంతో ప్రేరణాత్మకమైనది. AI, చిప్ తయారీ రంగాలలో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలతో కంపెనీని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్లారు.
తైవాన్‌లో జన్మించిన ఆయన చిన్న వయస్సులో అమెరికాకు వలస వచ్చాడు. ప్రారంభంలో ఓ రెస్టారెంట్‌లో డిష్‌వాషర్, వెయిటర్ గా పనిచేస్తూ జీవితం గడిపాడు హువాంగ్. అప్పుడే తన జీవితాన్ని మార్చుకోవాలనే లక్ష్యాన్ని సెట్ చేసుకున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, హువాంగ్ ప్రముఖ కంపెనీలైన LSI లాజిక్, AMD వంటి సంస్థల్లో పని చేశాడు. అక్కడ సాంకేతికత పట్ల అతనికి ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. అదే సమయంలో, తాను కొత్తగా ఏదో సృష్టించాలనే ఆలోచన అతనిని వెంటాడింది.
ఈ ఆలోచనతో 1993లో హువాంగ్ తన మిత్రులు క్రిస్ మలాచోవ్స్కీ, కర్టిస్ ప్రియమ్ లతో కలిసి Nvidia ను స్థాపించాడు. ఆ కంపెనీ ప్రారంభంలో చిన్నదే అయినప్పటికీ హువాంగ్ దశాబ్దాల పాటు కష్టపడి పనిచేసిన ఫలితంగా Nvidia ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా మారింది. తాజాగా ఎన్విడియా షేర్ విలువలు 3 శాతం పెరగడంతో హువాంగ్ వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆయన నికర సంపద 140 బిలియన్ల డాలర్లకు చేరి ప్రపంచ టాప్-10 బిలియనీర్లలో చోటు దక్కించుకునేలా చేసింది.
హువాంగ్ ఎప్పుడూ తన తల్లిదండ్రుల పాఠాలను గుర్తు చేసుకుంటారు. నేను బాత్రూమ్‌లు శుభ్రం చేశాను. కానీ ఇప్పుడు ప్రపంచపు అతిపెద్ద టెక్ కంపెనీకి CEOగా ఉన్నానంటూ ఆయన ఎప్పుడూ చెప్పే మాట. ఆయన విజయానికి మూలకారణం నిరంతర కృషి, ఓర్పు, దృష్టి. అవి ఉంటే ప్రతిఒక్కరూ జీవితంలో విజయం సాధిస్తారని చెబుతుంటారు.


Click it and Unblock the Notifications