IPO News: ఒడిదొడుకుల్లోనూ ఐపీవో 90% లాభాల లిస్టింగ్.. బెట్ వేసినోళ్లకు ముందే వచ్చిన పండుగ..
NACDAC Infrastructure IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూలమైన సెంటిమెంట్ల ధోరణితో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఐపీవోలపైనే ఎక్కువ మంది ట్రేడర్లు బెట్ వేస్తున్నారు. తక్కువ రిస్కుతో గ్యారెంటీడ్ లిస్టింగ్ గెయిన్స్ పొందవచ్చని వారు భావించటమే దానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏడాది చివరికి వచ్చినప్పటికీ ఐపీవోల ఒత్తిడి మార్కెట్లలో ఏమాత్రం తగ్గకుండా ఉండటంపై బెట్టింగ్ బంగార్రాజులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎన్ఏసీడీఏసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన కంపెనీ షేర్లు నేడు బీఎస్ఈలో జాబితా అయ్యాయి. తొలిరోజు కంపెనీ షేర్లు ఒక్కోటి 90 శాతం ప్రీమియం ధర రూ.66.50 వద్ద మార్కెట్లో జాబితా అయ్యాయి. గ్రాండ్ ఎంట్రీ తర్వాత కూడా కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్ల నుంచి భారీగా స్పందన మార్కెట్లలో కనిపించింది. షేర్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారుల నుంచి హడావిడి కనిపించింది. ఐపీవో ప్రారంభం నాటి నుంచే ఇన్వెస్టర్లు కంపెనీపై బెట్టింగ్ వేసేందుకు అత్యధికంగా మెుగ్గుచూపడటంతో ఎస్ఎమ్ఈ సెగ్మెంట్ చరిత్రలో ఐపీవో అత్యధికంగా సబ్‌స్క్రైబ్ పొందింది. ఈ క్రమంలో మూడు రోజుల ఇష్యూ సమయంలో 2200 కంటే ఎక్కువ సార్లు సభ్యత్వాన్ని అందుకుంది.

తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.10.01 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ 28.60 లక్షల షేర్లను విక్రయించింది. కంపెనీ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇష్యూ సబ్ స్క్రిప్షన్ కోసం డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 19 వరకు అందుబాటులో ఉంచబడింది. ఐపీవో కోసం ఎన్ఎసీడీఎసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.33-35గా నిర్ణయించింది. ఇదే క్రమంలో లాట్ పరిమాణాన్ని 4000 షేర్లుగా నిర్ణయించింది. దీంతో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ ఐపీవోలో పెట్టుబడి పెట్టడం కోసం కనీసం రూ.1.40 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది.
మార్కెట్లో ఐపీవోకు బలమైన స్పందన లభించటంతో ఇష్యూ చరిత్రలో అత్యధిక సభ్యత్వాన్ని పొందింది. ఈ క్రమంలో వాస్తవానికి కంపెనీ రూ.10 కోట్లను సమీకరించటానికి షేర్లను ఇష్యూ చేయగా పెట్టుబడిదారుల నుంచి రూ.14,000 కోట్ల విలువైన షేర్ల కోసం దరఖాస్తులు అందాయి. అలాగే ఐపీవో ముగింపు రోజున రిటైల్ విభాగంలో 2503 సార్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.2.73 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే.
కంపెనీ వ్యాపారం..
2012లో స్థాపించబడిన కంపెనీ ప్రధానంగా నిర్మాణ వ్యాపారంలో ఉంది. సంస్థ బహుళ అంతస్తుల భవనాలు, నివాస, వాణిజ్య, సంస్థాగత నిర్మాణంలో ప్రత్యేకతను కలిగి ఉంది. కంపెనీ క్లాస్ ఏ కాంట్రాక్టరుగా గుర్తింపు తెచ్చుకుంది. బహుళ-అంతస్తుల భవనాలు, ఉక్కు నిర్మాణ పనులు, గృహనిర్వాహక, మానవ వనరుల సరఫరా, వంతెనలు, విద్యుత్ పనుల నిర్మాణంలో ప్రసిద్ధి పొందింది. ఇప్పటి వరకు కంపెనీ దాదాపు 45 ప్రాజెక్టులను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కోసం పనిచేస్తోంది. ఇప్పటికే భారత ప్రభుత్వంతో పాటు, ఉత్తరాఖండ్ కోసం అనేక ప్రాజెక్టులను పూర్తి చేసింది. కంపెనీ థర్డ్-పార్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నిర్మాణ ప్రాజెక్టుల కోసం సబ్-కాంట్రాక్ట్‌లను కూడా చేపడుతుంది.


Click it and Unblock the Notifications