భారతీయ స్టాక్ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన షేర్‌గా నిలిచిన MRF స్టాక్ ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని తిరిగి ఆకర్షిస్తోంది. ఇటీవల ఈ స్టాక్‌లో జరిగిన బలమైన ర్యాలీ వలన, ధరలు అంచనాలకు మించి పెరిగాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ హెచ్చరిక జారీ చేసింది. వారి తాజా విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం ఉన్న స్థాయిల నుంచి 23 శాతం వరకూ పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయని స్టాక్‌పై 'సెల్' రేటింగ్‌ను ప్రకటించారు. దీనితో పాటు, షేర్‌కు రూ. 1,21,162 లక్ష్యధరను నిర్ణయించారు.
MRF ప్రకటించిన 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు మొదట చూస్తే మంచిగా కనిపించినప్పటికీ, మొత్తం దృశ్యం మాత్రం కంపెనీ వాల్యుయేషన్‌లపై పెద్ద ప్రశ్నార్ధకం అవుతోంది. సంస్థ రూ.510 కోట్ల నికర లాభం ప్రకటించినా, ఆదాయం మాత్రం అంచనాలకు తగ్గగా నమోదైంది. GST సంబంధిత మార్పుల వల్ల డిస్ట్రిబ్యూటర్ల వద్ద డిస్టాకింగ్ జరగడం దీనికి ఒక ప్రధాన కారణంగా బ్రోకరేజ్ పేర్కొంది. అంటే, లాభాలు బాగున్నట్టే ఉన్నా, అమ్మకాల వృద్ధి అంత గట్టిగా లేకపోవడం మార్కెట్‌కు అనుకోని సంకేతమని చెబుతోంది.

MRF EBITDA మార్జిన్ 15 శాతంకు పెరగడం పాజిటివ్ సంకేతమే అయినప్పటికీ మొత్తం ఆదాయం మాత్రం తగ్గడం ఆందోళనకర అంశంగా కనిపిస్తోంది. వాహన తయారీదారులకు (OE) అమ్మకాలు మంచి వృద్ధిని చూపినా, భర్తీ మార్కెట్‌లో డిమాండ్ తాత్కాలికంగా బలహీనపడింది. ముఖ్యంగా, త్రైమాసికం చివరిలో GST కోత కారణంగా టైర్ల రీప్లేస్‌మెంట్ మార్కెట్ నిరుత్సాహకరంగా మారింది.
మోతీలాల్ ఓస్వాల్‌ను ఆందోళనకు గురి చేసిన అసలు అంశం త్రైమాసిక ఫలితాలు మాత్రమే కాదు. గత కొన్నేళ్లుగా MRF టైర్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నట్లు బ్రోకరేజ్ గమనించింది. ప్రత్యేకంగా, ప్యాసింజర్ కార్ రేడియల్ (PCR) మరియు ట్రక్-బస్ రేడియల్ (TBR) విభాగాల్లో తీవ్ర పోటీతో కంపెనీ ధర నిర్ణయ శక్తి తగ్గింది. ఈ రెండు విభాగాలు MRF వ్యాపారానికి కీలకం కావడంతో ఈ మార్పు దీర్ఘకాలిక లాభదాయకతపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భవిష్యత్తుకు సంబంధించి, 2025 నుంచి 2028 వరకు MRF సుమారు 13శాతం వార్షిక వృద్ధిని (CAGR) నమోదు చేయగలదని అంచనా వేసినా.. ప్రస్తుత ధరలు ఈ వృద్ధిని సమర్థించలేవని బ్రోకరేజ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం స్టాక్ FY26/FY27 ఆదాయాలపై 32.5x నుండి 27.6x P/E వద్ద ట్రేడవుతోంది. ఇది గత 10 సంవత్సరాల సగటు అయిన 25x కంటే గణనీయంగా ఎక్కువ. అంటే, పెట్టుబడిదారులు కంపెనీ వాస్తవ ఆదాయాల కంటే అధిక ప్రీమియాన్ని చెల్లిస్తున్నారని, రిస్క్ పెరిగిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో..మోతీలాల్ ఓస్వాల్ తమ ముందస్తు అంచనాలను పునరుద్ఘాటిస్తూ.. స్టాక్‌పై 'సెల్' రేటింగ్‌ను కొనసాగించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications