Lalithaa Jewellery Mart Ltd: సింగపూర్, మలేషియాల్లో లలితా జువెలరీ దుకాణాలు..
స్టాక్ మార్కెట్ లో బంపర్ లిస్టింగ్ అయిన ఆభరణాల విక్రయ సంస్థ లలితా జువెలరీ మార్ట్ లిమిటెడ్ ఇప్పుడు తన వ్యాపార విస్తారణపై దృష్టి పెట్టింది. తమ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించబోతున్నట్లు ఆ కంపెనీ సీఎండీ ఎం.కిరణ్ కుమార్ ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల్లో రిటెయిల్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించడంతోపాటు, అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రస్తుతం తమకు 64 షోరూములు ఉన్నాయని చెప్పారు. వీటికి అదనంగా మరో 110 కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
2027 మార్చి నాటికి కనీసం 10 స్టోర్లకు పైగా ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. దక్షిణాదిలో 175 షోరూములకు చేరుకోగానే ఉత్తర భారత్‌కు విస్తరిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మొదటగా మహారాష్ట్ర, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో షో రూమ్ లు ఏర్పాట్ చేస్తామని వెల్లడించారు. అంతే కాకుండా విదేశాల్లో కూడా షో రూమ్ లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చే 2-3 నెలల్లో మలేషియాలో షోరూమును ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత సింగపూర్ మార్కెట్లోకి అడుగుపెడతామని వివరించారు. అంతర్జాతీయంగా ఉన్న భారతీయ, ఆసియా వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను, అత్యుత్తమ ధరకే అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

అధిక లాభాలు ఆశించకుండా, తక్కువ లాభంతో ఎక్కువ విక్రయాలు సాధించడమే సంస్థ ప్రధాన వ్యూహమని కిరణ్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 58 షోరూముల ద్వారా రూ.25,000 కోట్ల మొత్తం ఆదాయం, రూ.1,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో స్టోర్ల సంఖ్య పెరిగిన కొద్దీ విక్రయాల విలువ మరింత వృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం తమకు 9 లేదా 14 క్యారెట్ల బంగారం విక్రయించే ఆలోచన లేదన్నారు. 22 క్యారెట్ల బంగారు ఆభరణాలనే అమ్ముతామని చెప్పారు. తమ వద్దకు వస్తున్నవారిలో 60% పాత బంగారం మార్పిడి చేసుకుంటున్నారని కిరణ్ కుమార్ తెలిపారు.
కాగా కంపెనీ ఈ మధ్యే స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఐపీఓ ప్రైస్ రూ.201 కాగా.. స్టాక్ మార్కెట్ లో రూ.265 వద్ద లిస్ట్ అయింది. ప్రస్తుతం రూ.246 వద్ద కొనసాగుతోంది. అంటే ఇప్పటికీ ఐపీఓ ప్రైస్ కంటే ప్రీమియంలోనే ట్రేడ్ అవుతుంది. మార్కెట్లపై ఒత్తిడి ఉన్నప్పటికీ స్టాక్ పై అంత ప్రభావం చూపడం లేదు. అయితే ఈ కంపెనీ ఐపీఓకు వచ్చేటప్పుడు తక్కువ వాల్యూవేషన్ లో రావడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే ఇప్పటికీ ప్రీమియంలో ట్రేడవుతుందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications