పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. ఈ కంపెనీ స్టాక్ మీద ఓ కన్నేసి ఉంచండి.. రూ. 15 వేల కోట్ల ఆర్డర్ వచ్చింది..
భారత బహుళజాతి ఇంజనీరింగ్, నిర్మాణ దిగ్గజం లార్సెన్ & టూబ్రో (L&T) పశ్చిమాసియా ప్రాంతంలో ఒక భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఎల్&టీ ఎనర్జీ హైడ్రోకార్బన్ ఆఫ్‌షోర్ (LTEH ఆఫ్‌షోర్) ప్రతిష్టాత్మక ADNOC ఆఫ్‌షోర్ సంస్థ నుండి ఈ అల్ట్రా-మెగా కాంట్రాక్టును సాధించింది. కంపెనీ ఆర్డర్ వర్గీకరణ మార్గదర్శకాల ప్రకారం రూ. 15,000 కోట్లకు పైబడిన విలువ కలిగిన ప్రాజెక్ట్‌లను అల్ట్రా-మెగా ఆర్డర్‌గా పరిగణిస్తారు. స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో.. ఈ ప్రాజెక్ట్‌లో మధ్యప్రాచ్యంలో అనేక ఆఫ్‌షోర్ ఇంధన సదుపాయాల అభివృద్ధి ఇమిడి ఉందని ఎల్&టీ అధికారికంగా ధృవీకరించింది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఒక కన్సార్టియం పద్ధతిలో చేపట్టనుండగా.. ఎల్&టీ ఎనర్జీ హైడ్రోకార్బన్ ఆఫ్‌షోర్ సంస్థ ప్రధాన భాగస్వామిగా వ్యవహరించనుంది. మొత్తం ప్రాజెక్ట్ రూపకల్పన, సమన్వయం, నిర్మాణ బాధ్యతలను ఎల్&టీ పర్యవేక్షిస్తుంది. ప్రధానంగా ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం, సంస్థాపన, ప్రారంభించడం (EPCIC) వంటి సమగ్ర సేవలను కంపెనీ అందించనుంది. ఇందులో భాగంగా కొత్త ఆఫ్‌షోర్ సౌకర్యాల నిర్మాణంతో పాటు.. ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను మరింత సురక్షితంగా, ఆధునికంగా మార్చే అప్‌గ్రేడేషన్ పనులను కూడా ఎల్&టీ చేపట్టనుంది.

ఆఫ్‌షోర్ ప్రాజెక్టులు అంటే సముద్రపు నీటి అడుగున లేదా ఒడ్డున చేపించే అత్యంత క్లిష్టమైన చమురు, గ్యాస్ ప్లాట్‌ఫారమ్‌లు, పైప్‌లైన్ నిర్మాణాలు. వాతావరణ పరిస్థితులు, సముద్రపు అలల తీవ్రత, పరికరాల రవాణా వంటి సవాళ్లు ఉండే ఈ ప్రాజెక్టులకు బలమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం. గత నాలుగు దశాబ్దాలుగా ఆఫ్‌షోర్ రంగంలో విస్తృత అనుభవం ఉన్న ఎల్&టీ, తమ అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ యార్డులలో భారీ భాగాలను తయారు చేసి.. ప్రత్యేక నౌకల ద్వారా సముద్రంలోకి తీసుకెళ్లి అమర్చనుంది. శాశ్వత ప్లాట్‌ఫారమ్‌ల ఏర్పాటుతో పాటు పాత నిర్మాణాలను తొలగించే (డీకమిషనింగ్) సామర్థ్యం కూడా కంపెనీకి ఉంది.
ఈ ప్రాజెక్ట్ సాధనపై ఎల్&టీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్. సుబ్రమణ్యన్ హర్షం వ్యక్తం చేశారు. ADNOC ఆఫ్‌షోర్ నుండి వచ్చిన ఈ ఆర్డర్ ఎల్&టీ ఇంజనీరింగ్ నైపుణ్యం, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసే సామర్థ్యంపై కస్టమర్‌కు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. యూఏఈ ఇంధన అవసరాలకు అనుగుణంగా సుస్థిరమైన, ఆధునిక ఆఫ్‌షోర్ పరిష్కారాలను అందించడానికి తమ కంపెనీ కట్టుబడి ఉందన్నారు.
సుమారు 32 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఎల్&టీకి ఈ రూ. 15 వేల కోట్ల ఆర్డర్ రాబోయే సంవత్సరాల్లో ఆదాయ భద్రతను, ఆర్డర్ బుక్‌కు మరింత బలాన్ని చేకూర్చనుంది. ఆఫ్‌షోర్ ప్రాజెక్టుల నిర్వహణలో వాతావరణం, ముడిసరుకుల ధరల హెచ్చుతగ్గుల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ ఆర్డర్ సాధించడం కంపెనీ అంతర్జాతీయ ప్రాబల్యాన్ని మరోసారి నిరూపించింది.


Click it and Unblock the Notifications
