Monday Market: మార్కెట్లు ఈవారం రికవర్ అవుతాయా? మరింత బేజారతాయా? పూర్తి వివరాలు..
Stock Market Next Week: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారంలో ఇన్వెస్టర్లకు నిద్రలేకుండా చేసిన సంగతి తెలిసిందే. భారీగా కొనసాగిన ఒడిదొడుకులు ఇన్వెస్టర్లను కంగారుకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా మూడవ త్రైమాసిక ఫలితాలను కార్పొరేట్ కంపెనీలు ప్రకటించనున్న వేళ మార్కెట్ల పనితీరుపై ట్రేడర్లు ఆసక్తిగా ఉన్నారు.
గడచిన వారంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనాన్ని చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూచీలు దాదాపు 2 శాతం వరకు క్షీణతను నమోదు చేశాయి. వీటికి ప్రధాన కారణాలను గమనిస్తే అంతర్జాతీయ అనిశ్చితులు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్కి తీసుకోవటం, భారీగా పెరిగిన యూఎస్ బాండ్ ట్రెజరీ ఈల్డ్స్ మార్కెట్లలో అమ్మకాలను ప్రేరేపించాయి. మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ ఐటీ రంగంలోని కంపెనీలు మాత్రం టీసీఎస్ క్యూ3 ఫలితాల ప్రకటనతో సానుకూలంగా ముందుకు సాగుతూ సూచీలకు అండగా నిలుస్తున్నాయి.

ఐటీ రంగానికి చెందిన షేర్లు మంచి పనితీరును కనబరిచినప్పటికీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం మార్కెట్లో భారీ ఓలటాలిటీ కారణంగా చివరికి నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. గడచిన వారం నిఫ్టీ సూచీ 573 పాయింట్లను నష్టపోగా.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు జనవరిలో ఇప్పటి వరకు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు 2.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకుని వెనక్కి తీసుకెళ్లిపోయారు. అలాగే మూడో త్రైమాసిక ఫలితాలపై అలుముకున్న ఆందోళనలు పెట్టుబడిదారులను బేజారేలా చేశాయి.
అయితే ఈ క్రమంలో రానున్న వారంలో స్టాక్ మార్కెట్లు ఎలా ఉండనున్నాయనే ఆందోళనలు ప్రతి ఇన్వెస్టర్ పైనా ఉన్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ సూచీకి 23200-23300 సపోర్ట్ జోన్ గా వ్యవహరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 23,850 దగ్గర ఏదైనా బౌన్స్ షార్టింగ్ అవకాశాన్ని అందించవచ్చు. 48,300 వద్ద బ్యాంక్ నిఫ్టీ మద్దతు కూడా కీలకమని తెలుస్తోంది. దీనికి తోడు మార్కెట్లో కొనసాగుతున్న ఐపీవోల క్రేజ్ రానున్న వారంలో మార్కెట్లలో కొంత ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్టాక్ సూచనలు..
ఈ క్రమంలో ఎస్బీఐ సెక్యూరిటీస్ కి చెందిన సుదీప్ షా మార్కెట్లో రానున్న వారం కొనుగోలుకు అనుకూలమైన షేర్ల వివరాలను పంచుకున్నారు. ముందుగా యూనో మిండా కంపెనీ షేర్లను కొనుగోలుకు ఉత్తమంగా సూచించారు. అలాగే విజయ డయాగ్నస్టిక్స్ కంపెనీ షేర్లు ప్రస్తుతం బులిష్ మెుమెంటం కలిగి ఉండి జీవితకాల గరిష్ఠాల వద్ద ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన మ్యారీకో కంపెనీ షేర్లపై బులిష్ వ్యూ కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక చివరిగా బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీ షేర్లను కొనుగోలు చేయటానికి అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications