ఇన్వెస్టర్లు మనీతో రెడీగా ఉండండి.. జియో ఐపీఓకు బోర్డు ఆమోదం.. సెబీకి నేడే డ్రాఫ్ట్ పేపర్స్ దాఖలు..
లక్షలాది మంది ఇన్వెస్టర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఒక చారిత్రాత్మక మార్కెట్ సంచలన ప్రకటన చేశారు. రిలయన్స్ డిజిటల్, టెలికాం విభాగమైన 'రిలయన్స్ జియో' ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)కు కంపెనీ బోర్డు అధికారికంగా ఆమోదం తెలిపిందని ఆయన ప్రకటించారు.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ, ప్రతిష్టాత్మక ఐపీఓలలో ఒకటిగా నిలవబోతున్న ఈ ఇష్యూ కోసం Jio తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను ఈరోజునే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వద్ద దాఖలు చేసినట్లు అంబానీ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా జియో లిస్టింగ్ కాలపరిమితిపై మార్కెట్లో ఉన్న అనిశ్చితికి ఈ అధికారిక నిర్ణయంతో ముగింపు పడినట్లయింది.

జియో కేవలం ఒక టెలికాం నెట్‌వర్క్ మాత్రమే కాకుండా దేశంలోనే అతిపెద్ద డిజిటల్ సేవల సంస్థగా అవతరించిందని ముఖేష్ అంబానీ గుర్తుచేశారు. ఈ క్రమంలోనే జియో తదుపరి వృద్ధి దశ బాధ్యతలను ఇప్పుడు ఒక కొత్త తరం స్వీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. రిలయన్స్ వారసులు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ ఈ చారిత్రాత్మక ఐపీఓ ప్రక్రియకు ముందుండి నాయకత్వం వహిస్తున్నట్లు అంబానీ వెల్లడించారు. యువ నాయకత్వంలో జియో మరింత ఎత్తుకు ఎదుగుతుందనే నమ్మకాన్ని ఆయన వాటాదారులలో వ్యక్తపరిచారు.
మార్కెట్ వర్గాల ప్రాథమిక సమాచారం, నివేదికల ప్రకారం, ఈ భారీ జియో ఐపీఓలో సుమారు 270 మిలియన్ల షేర్లు (27 కోట్లు) విక్రయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ మెగా ఇష్యూ యొక్క ఖచ్చితమైన పరిమాణం, ధరల శ్రేణి (Price Band), కంపెనీ మొత్తం వాల్యుయేషన్ వంటి మరిన్ని వివరణాత్మక ఆర్థిక సమాచారాలు, సెబీ వద్ద దాఖలు చేసిన డీఆర్‌హెచ్‌పీ (DRHP) పత్రాలను బహిరంగపరిచిన తర్వాత అధికారికంగా వెల్లడి కానున్నాయి.
గత ఏడాది కాలంగా రిలయన్స్ షేర్లు దాదాపు 7 శాతం మేర నష్టపోయి, ఇన్వెస్టర్లకు ఒకింత నిరాశను మిగిల్చాయి. విదేశీ ఇన్వెస్టర్ల (FIIs) అమ్మకాలు, జియో లిస్టింగ్‌లో జాప్యం వంటి కారణాలతో రిలయన్స్ మార్కెట్ క్యాప్ నుండి సుమారు ₹1.5 లక్షల కోట్లు హరించుకుపోయాయి. ఈ నేపథ్యంలో నేడు వెలువడిన జియో ఐపీఓ ప్రకటన రిలయన్స్ వాటాదారులకు అపారమైన విలువను (Value Unlocking) చేకూర్చడమే కాకుండా, మార్కెట్ సెంటిమెంట్‌ను పూర్తిగా మార్చివేసే ఒక బలమైన ప్రేరకంగా (Trigger) పనిచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications
