స్టాక్ మార్కెట్ కొంపలు ముంచబోతున్న జపాన్ యెన్ క్యారీ ట్రేడ్.. ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. అసలేంటిది..
Japan Yield Shock : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జపాన్ దశాబ్దాలుగా చౌకైన మూలధనానికి (Cheap Money) ప్రధాన కేంద్రంగా నిలిచింది. అయితే అతి తక్కువ వడ్డీ రేట్లతో ఉన్న యెన్ (Yen) కరెన్సీని రుణంగా తీసుకుని.. ప్రపంచ వ్యాప్తంగా అధిక రాబడులను ఇచ్చే అమెరికా, యూరప్, భారత్ వంటి దేశాల ఈక్విటీలు, బాండ్లలో పెట్టుబడులు పెట్టే 'యెన్ క్యారీ ట్రేడ్' (Yen Carry Trade) ఇప్పుడు తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది.
జపాన్‌లో ద్రవ్యోల్బణం పెరగడం, సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాల నేపథ్యంలో జపాన్ 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ (Yield).. 1996 తర్వాత తొలిసారిగా 3శాతం రికార్డు స్థాయిని తాకింది. ప్రపంచ మార్కెట్లలో ఇది భారీ విక్రయాల ఒత్తిడికి దారితీసే ప్రమాదకర హెచ్చరికగా మారింది.

బాండ్ ఈల్డ్స్ పెరగడం అంటే ప్రభుత్వం అప్పులు తీసుకోవడానికి అయ్యే వ్యయం పెరుగుతుందని అర్థం. దశాబ్దాలుగా జపాన్‌లో వడ్డీ రేట్లు సున్నాకి దగ్గరగా ఉండటం వల్ల అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అక్కడ తక్కువ వడ్డీకి యెన్ రుణాలను తీసుకుని.. 7 శాతం నుండి 8శాతం రాబడినిచ్చే ఇతర దేశాల స్టాక్స్, బాండ్లలో పెట్టుబడి పెట్టేవారు. దీనినే యెన్ క్యారీ ట్రేడ్ అంటారు.
అయితే జపాన్ బాండ్ ఈల్డ్స్ పెరిగి, బ్యాంక్ ఆఫ్ జపాన్ (BoJ) ప్రామాణిక వడ్డీ రేట్లను టెర్మినల్ రేటు 1.5 శాతం నుండి 1.75 శాతం స్థాయికి పెంచే అవకాశం కనిపించడంతో పరిస్థితులు తలకిందులవుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగి యెన్ కరెన్సీ బలపడితే, ఇన్వెస్టర్లకు రుణాల చెల్లింపులు భారమవుతాయి. దీంతో వారు అమెరికన్ టెక్ షేర్ల నుండి భారతీయ స్టాక్ మార్కెట్ల వరకు తమ పెట్టుబడులను విక్రయించి (Unwinding), అప్పులు తీర్చడానికి యెన్‌ను కొనుగోలు చేయక తప్పదు.
డాలర్‌తో పోలిస్తే 160 మార్కు వద్ద ట్రేడ్ అవుతున్న యెన్ విలువను స్థిరీకరించేందుకు బ్యాంక్ ఆఫ్ జపాన్, జపాన్ ప్రభుత్వం తమ వద్ద ఉన్న యూఎస్ ట్రెజరీ బాండ్లను (US Treasuries) భారీగా విక్రయించే అవకాశం ఉంది. జపాన్ ప్రపంచంలోనే అమెరికా బాండ్లను అత్యధికంగా కలిగి ఉన్న దేశం కావడం వల్ల.. ఈ అమ్మకాలతో అమెరికా బాండ్ ఈల్డ్స్ మరింత పెరిగి గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్‌లో రుణాలు మరింత ఖరీదవుతాయి.
ఇన్వెస్టర్లు తమ క్యారీ ట్రేడ్ పొజిషన్లను క్లోజ్ చేసుకుని నిధులను జపాన్‌కు తరలిస్తే.. అమెరికా స్టాక్ మార్కెట్‌తో పాటు వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లలో భారీ పతనం సంభవించవచ్చు. యెన్ క్యారీ ట్రేడ్ అన్-వైండింగ్ వేగవంతమైతే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ల (NSE Nifty, BSE Sensex) నుండి నిధులను ఉపసంహరించుకుంటారు. ఇది రూపాయి విలువపై, అధిక వ్యాల్యుయేషన్ కలిగిన భారతీయ షేర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
సెప్టెంబర్ నెలలో జరగనున్న బ్యాంక్ ఆఫ్ జపాన్ (BoJ) నిర్ణయం.. యెన్ 160 స్థాయి వద్ద జపాన్ ప్రభుత్వం చేపట్టే కరెన్సీ జోక్యం ప్రపంచ ఆర్థిక మార్కెట్ల భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత కీలకం కానున్నాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం నుండి బయటపడటం ఆ దేశానికి మంచిదే అయినప్పటికీ.. ఈ మార్పులు వేగంగా జరిగితే గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత తప్పదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
