ఇన్వెస్టర్లు డబ్బు రెడీ చేసుకోండి.. 8 కొత్త ఐపీఓలు వచ్చేస్తున్నాయ్.. టాప్ కంపెనీలు ఏవంటే..
IPO Market Update: దేశీయ ప్రాథమిక స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలైంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎనిమిది సంస్థల పబ్లిక్ ఇష్యూలకు తాజాగా పచ్చజెండా ఊపింది. నవంబర్ 27న విడుదల చేసిన తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ ఎనిమిది కంపెనీల ముసాయిదా పత్రాలపై సెబీ అబ్జర్వేషన్ లెటర్లను జారీ చేసింది.
తద్వారా ఈ సంస్థలు తమ ఐపీఓలను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. సెబీ ఆమోదం పొందిన కంపెనీలలో వేదాంత గ్రూప్‌కు చెందిన స్టెర్లైట్ ఎలక్ట్రిక్, అనన్య బిర్లా నేతృత్వంలోని స్వతంత్ర మైక్రోఫిన్ (Svatantra Microfin) లతో పాటు గౌరిక్ ఫ్యాషన్స్, ఎమరాల్డ్ జ్యువెల్ ఇండస్ట్రీ ఇండియా, బ్యూటీ గ్యారేజ్, నోబుల్ హైజీన్, ఎంపీ స్టీల్ (ఇండియా), కటారియా ధుల్‌చంద్ పన్నాలాల్ జ్యువెలర్స్ ఉన్నాయి.

ఈ ఎనిమిది కంపెనీలు తమ వ్యాపార విస్తరణ, రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం మార్కెట్ నుండి భారీగా నిధులను సమీకరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. వీటిలో అనన్య బిర్లాకు చెందిన స్వతంత్ర మైక్రోఫిన్ అతిపెద్ద ఇష్యూగా రూ. 3,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 1,500 కోట్ల విలువైన తాజా షేర్ల జారీ (Fresh Issue) ఉండగా.. మిగిలిన రూ. 1,500 కోట్లు ప్రస్తుత వాటాదారుల వాటా విక్రయం (Offer for Sale - OFS) రూపంలో ఉండనున్నాయి. ఇక వేదాంత గ్రూప్ సంస్థ స్టెర్లైట్ ఎలక్ట్రిక్ తమ ఐపీఓలో 1.6 కోట్ల (16 మిలియన్) వరకు కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా సుమారు రూ. 1,500 కోట్లు సమీకరించడానికి సిద్ధమవుతోంది.
మధ్యస్థాయి, చిన్న తరహా ఇష్యూల విషయానికి వస్తే.. నోబుల్ హైజీన్ తాజా షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్ల వరకు, బ్యూటీ గ్యారేజ్ తాజా ఇష్యూ ద్వారా రూ. 125 కోట్ల వరకు, ఎంపీ స్టీల్ (ఇండియా) రూ. 95 కోట్ల వరకు నిధులు సమీకరించాలని యోచిస్తున్నాయి. వీటితో పాటు ఆభరణాల రంగ సంస్థలైన ఎమరాల్డ్ జ్యువెల్ ఇండస్ట్రీ ఇండియా, కటారియా ధుల్‌చంద్ పన్నాలాల్ జ్యువెలర్స్, వస్త్ర రంగ సంస్థ గౌరిక్ ఫ్యాషన్స్ కూడా తమ ముసాయిదా పత్రాలకు సెబీ ఆమోదం పొందాయి.
మరోవైపు ఇదే సమయంలో రెండు కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలను విరమించుకున్నాయి. విశాల్ ఆయిల్ & ఎనర్జీ, పెంటాకిల్ కన్సల్టెంట్స్ తమ ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబీ నుండి ఉపసంహరించుకున్నట్లు నియంత్రణ సంస్థ వెల్లడించింది.
ఇదిలా ఉండగా సెబీ నుండి అబ్జర్వేషన్ లెటర్లు లభించినంత మాత్రాన ఈ కంపెనీల ఐపీఓలు వెంటనే సబ్‌స్క్రిప్షన్‌కు వస్తాయని భావించకూడదని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం సెబీ ఆమోదం లభించిన తేదీ నుండి ఏడాది లోపు ఎప్పుడైనా కంపెనీలు తమ ఇష్యూను ప్రారంభించుకునే వెసులుబాటు ఉంటుంది. సెకండరీ మార్కెట్లలో ఇటీవల కనిపిస్తున్న ఒడిదుడుకులు, మదుపర్ల సెంటిమెంట్, ముడిచమురు ధరల ప్రభావం, సంస్థాగత పెట్టుబడిదారుల స్పందనను బేరీజు వేసుకున్న తర్వాతే ఈ ఎనిమిది సంస్థలు తమ ఆర్‌హెచ్‌పీ (RHP) దాఖలు చేసి, ఇష్యూ తేదీలు, ప్రైస్ బ్యాండ్‌లను అధికారికంగా ప్రకటించనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
