IPO News: చాలా కాలంగా ఎదురుచూసిన ఐపీవో.. స్పందన అంతంతే, మీరూ బెట్ వేస్తున్నారా?
Swiggy IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ నెల పెద్ద ఐపీవోల కోలాహలం జరగనుంది. ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పటికే దండిగా డబ్బు సిద్ధం చేసుకున్నారు. ఇంకేముంది పెట్టుబడుల సమరంలోకి దూకేద్దాం అనుకున్నప్పటికీ ఈ ఐపీవోతో మాత్రం ఎందుకో అందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దేశీయ స్టాక్ మార్కెట్లలో నిన్న ఇష్యూ ప్రారంభించబడిన ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విగ్గీ ఐపీవో గురించే. వాస్తవానికి కరోనా కాలంలో జొమాటో ఐపీవో లిస్టింగ్ తర్వాతి నుంచి పలుమార్లు కంపెనీ తన ఐపీవో ప్లాన్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీవో లాంచ్ కోసం మార్కెట్లు అనుకూలంగా ఉండటంతో పాటు వాల్యుయేషన్ పాయింట్ పై కూడా కంపెనీ అప్రమత్తం అవుతూ తన ఐపీవో అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి వచ్చేసింది. అయితే ఈ ఐపీవో బుధవారం అంటే నవంబర్ 6న మార్కెట్లో సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవగానే ఊహించిన స్థాయిలో స్పందనను పొందలేకపోయింది.

మెుత్తానికి మెుదటి రోజున కేవలం 12 శాతం మాత్రమే సబ్‍స్క్రిప్షన్ పొందగలిగింది. ఈ క్రమంలో కంపెనీ దాదాపు 16 కోట్ల ఈక్విటీ షేర్లను ఐపీవోలో విక్రయానికి ఉంచగా కేవలం 1.89 కోట్ల షేర్ల కోసం మాత్రమే నిన్న అప్లికేషన్స్ వచ్చాయి. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా భారీగా 54 శాతం కొనుగోళ్లను చూడగా.. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నుంచి కేవలం 6 శాతం సబ్‍స్క్రిప్షన్ కనిపించింది. అయితే ఇప్పుడు అందరి చూపు రెండవ రోజు ఎలా ఉండనుందనే. ఈ క్రమంలో స్విగ్గీ ఐపీవో షేర్లు ఒక్కోటి గ్రేమార్కెట్లో దాదాపు రూ.11 ప్రీమియం పలుకుతున్నాయి. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే ఒక్కో షేరు మార్కెట్లో రూ.401 వద్ద జాబితా అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
స్విగ్గీ ఐపీవో నవంబర్ 6 నుంచి నవంబర్ 8 వరకు సబ్‌స్క్రైబర్ల కోసం ఇష్యూ అందుబాటులో ఉంటుంది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఒక్కరోజు ముందుగా అంటే నవంబర్ 5న ఐపీవో అందుబాటులోకి వస్తోంది. స్టార్టప్ కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.11,300 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.371-390గా నిర్ణయించింది. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవోలో రూ.4499 కోట్ల తాజా ఇష్యూ ఉండగా మిగిలిన రూ.6828.43 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించబడుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐపీవో నవంబర్ 13న మార్కెట్లలో లిస్టింగ్ కోసం అడుగుపెట్టనుందని తెలుస్తోంది.
కంపెనీ తాజా ఐపీవోలో ఉద్యోగుల కోసం 10 శాతం షేర్లను రిజర్వు చేసింది. పైగా ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.25 డిస్కౌంట్ రేటుకు విక్రయించనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ 2014లో స్థాపించబడిన కంపెనీ. అయితే ప్రస్తుతం కంపెనీ క్విక్ కామర్స్ వ్యాపారంలోకి సైతం అడుగుపెట్టిన వేళ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, కిరాణాతో పాటుగా ఇతర గృహోపకరణాలను అందిస్తుంది. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ లిమిటెడ్ ఆదాయం 34% పెరిగింది. ఇదే కాలంలో కంపెనీ నష్టం రూ.4,179.31 కోట్ల నుంచి రూ.2,350.24 కోట్లకు తగ్గింది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.


Click it and Unblock the Notifications