చరిత్ర సృష్టించిన భారత మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ.. తొలిసారిగా ఎఫ్‌ఐఐలను అధిగమించి సరికొత్త రికార్డు..
భారతీయ పెట్టుబడి పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశీయ మ్యూచువల్ ఫండ్ల కస్టడీ ఆస్తులు (AUC) చరిత్రలో తొలిసారిగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FIIల) ఆస్తులను అధికారికంగా అధిగమించాయి. గత రెండేళ్లుగా విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ నుండి నిష్క్రమిస్తుండగా.. దేశీయ పెట్టుబడులు ఈక్విటీలలోకి వెల్లువెత్తడం వల్ల ఈ మైలురాయి సాధ్యమైంది. జూన్ 2026 నాటి తాజా ఎన్‌ఎస్‌డీఎల్ (NSDL) డేటా ప్రకారం.. ఈక్విటీ, డెట్, ఎక్స్‌ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) కలిపి మ్యూచువల్ ఫండ్ల మొత్తం ఆస్తుల విలువ రూ. 76.41 లక్షల కోట్లకు చేరింది. ఇది ఎఫ్‌ఐఐల మొత్తం ఆస్తుల విలువైన రూ. 76.22 లక్షల కోట్లను స్వల్పంగా అధిగమించి.. దేశీయ రంగాన్ని ముందంజలో నిలిపింది.
అయితే, కేవలం స్వచ్ఛమైన ఈక్విటీ హోల్డింగ్స్ విషయానికి వస్తే ఎఫ్‌ఐఐలు ఇంకా పైచేయిలోనే ఉన్నప్పటికీ, ఆ అంతరం వేగంగా తగ్గుతోంది. సెప్టెంబర్ 2024లో గరిష్టంగా రూ. 78 లక్షల కోట్లుగా ఉన్న ఎఫ్‌ఐఐ ఈక్విటీ ఆస్తులు.. జూన్ 2026 నాటికి 12% క్షీణించి రూ. 68.65 లక్షల కోట్లకు పడిపోయాయి. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్ల ఈక్విటీ ఆస్తులు 23.3% వృద్ధి చెంది రూ. 44.20 లక్షల కోట్ల నుండి రూ. 54.50 లక్షల కోట్లకు చేరాయి.

మార్కెట్ యాజమాన్య వాటాలో (Market Ownership Share) కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. డిసెంబర్ 2025 నాటికి 11.10%గా ఉన్న దేశీయ మ్యూచువల్ ఫండ్ల వాటా, మార్చి 31, 2026 నాటికి 11.46% ఆల్-టైమ్ గరిష్టానికి పెరిగి.. వరుసగా 11వ త్రైమాసికంలోనూ వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు ఎఫ్‌ఐఐల వాటా 16.60 శాతం నుండి 16.13 శాతానికి పడిపోయి 14 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. దీంతో వీరిద్దరి మధ్య అంతరం కేవలం 4.67 శాతం పాయింట్లకు పరిమితమైంది. ఇది డిసెంబర్ 2023 నాటి అంతరంతో (9.34%) పోలిస్తే సగం కాగా.. మార్చి 2015 లో నమోదైన అత్యధిక అంతరం (17.14%) తో పోలిస్తే చాలా తక్కువ.
రుణ (Debt) హోల్డింగ్స్ విభాగంలో దేశీయ మార్కెట్ ఆధిపత్యం మరింత స్పష్టంగా ఉంది. జనరల్ లిమిట్, VRR, FAR మార్గాల ద్వారా మ్యూచువల్ ఫండ్ల కస్టడీలో ఉన్న రుణ ఆస్తులు రూ. 16.98 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇది ఎఫ్‌ఐఐల రుణ పుస్తక విలువైన రూ. 6.82 లక్షల కోట్ల కంటే రెట్టింపు కన్నా ఎక్కువ. భారతదేశ స్థిర-ఆదాయ మార్కెట్ ఇప్పుడు విదేశీ మూలధనం కంటే దేశీయ సంస్థలపైనే ఎంతగా ఆధారపడి ఉందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. సిప్ (SIP) విజయంతో దూసుకుపోతున్న మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ.. 2030 నాటికి రూ. 150 లక్షల కోట్ల ఏయూఎం (AUM) సాధించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
భారతీయ మ్యూచువల్ ఫండ్ల వృద్ధికి ఇంకా అపారమైన ఆస్కారం ఉందని యాంఫీ (AMFI) సీఈఓ వెంకట్ ఎన్ చలసాని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశ ఏయూఎం-టు-జీడీపీ (AUM-to-GDP) నిష్పత్తి కేవలం 20 నుంచి 21 శాతం గానే ఉందని, ప్రపంచ సగటు 65 శాతం కాగా కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 100 శాతం దాటి ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ దశాబ్దం చివరి నాటికి పెట్టుబడిదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 6.2-6.3 కోట్ల నుండి 10 కోట్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కేవలం టైర్ 2, టైర్ 3 నగరాలే కాకుండా, పెట్టుబడులు ఇంకా ప్రారంభం కాని టైర్ 1 నగరాల్లోని ప్రధాన కేంద్రాలపై కూడా దృష్టి సారిస్తున్నామని, మహిళా పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి సెబీ ప్రత్యేక రాయితీలను ప్రవేశపెట్టిందని ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications
