స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే పండగ.. IPO మార్కెట్‌లోకి 210 కొత్త కంపెనీలు ఎంట్రీ..
భారత స్టాక్ మార్కెట్లో IPO బూమ్ రెడీ అయింది.. వచ్చే రెండేళ్లో టాప్ కంపెనీలు మార్కెట్లోకి ఐపీఓ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నాయి. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ అంచనా ప్రకారం.. వచ్చే 24 నెలల్లో సుమారు 210 కొత్త కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (IPOలు)కు రెడీ అవుతున్నాయి. అంతేకాకుండా కొత్త తరం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలైలో ఉన్న 150 బిలియన్ డాలర్ల నుండి 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని తెలిపింది.
వచ్చే దశాబ్దం చివరి నాటికి కొత్త లిస్టింగ్‌ల వల్ల భారతదేశ ఈక్విటీ మార్కెట్‌లో కొత్త తరం కంపెనీల వాటా 3 శాతం నుండి 11.5 శాతానికి పెరుగుతుందని ఆ సంస్థ ఒక నివేదికలో అంచనా వేసింది. దీనితో ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లపై సమీకరించిన నిధుల విషయంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో.. వృద్ధి రేటు విషయంలో మొదటి స్థానంలో నిలుస్తుంది. గతంలో ఐపీఓ మార్కెట్ అటువంటి కొత్త తరం కంపెనీల వృద్ధికి ప్రతిఫలమిచ్చిందని.. కానీ ఇప్పుడు అది లాభదాయకమైన వృద్ధిని కోరుకుంటోందని ఆ నివేదిక స్పష్టం చేసింది.

కొత్త తరం కంపెనీలకు దేశీయ సంస్థలే ప్రధాన కొనుగోలుదారులుగా మారాయని రెడ్‌సీర్ నివేదిక పేర్కొంది. దేశీయ సంస్థలు ఈ కంపెనీలపై పెట్టుబడి పెడుతున్నారు, ఫలితంగా లిస్టింగ్ అయిన 20 కంపెనీలలో 14 లాభదాయకంగా ఉన్నాయి. వారి ఐపీఓల ధరలను, గత ప్రైవేట్ రౌండ్ల ఆధారంగా కాకుండా.. అదే తరహా లిస్టెడ్ కంపెనీల ఆధారంగా నిర్ణయిస్తున్నారు. దీనివల్ల, లిస్టింగ్ సమయంలో ఒక కంపెనీ చేసుకునే సన్నాహాలు.. భవిష్యత్ రాబడులను మరింత మెరుగ్గా అంచనా వేయడానికి వీలవుతుందని నివేదిక తెలిపింది.
గత ఏడాది మొత్తం కంటే 2026 క్యాలెండర్ సంవత్సరం ద్వితీయార్థంలోనే ఎక్కువ నిధులు సమీకరించబడతాయని.. కేవలం ఆరు నెలల్లోనే 19 నుంచి 22 బిలియన్ డాలర్లు సేకరిస్తాయని నివేదిక అంచనా వేస్తోంది. 200కు పైగా కంపెనీలు పబ్లిక్ మార్కెట్లలో నిధులు సమీకరించడానికి సిద్ధమవుతుండగా.. వాటిలో 150కి పైగా కంపెనీలు మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ నుండి ఇప్పటికే ఆమోదం పొందాయి.
ఈ సంవత్సరపు ద్వితీయార్థం ఎస్‌బిఐ ఫండ్ మేనేజ్‌మెంట్ ఐపిఓతో మార్కెట్ ప్రారంభమవుతుంది.. దీని లక్ష్యం 1.22 బిలియన్ డాలర్లను సేకరించడం. దీని తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, జియో ప్లాట్‌ఫామ్స్ నుండి ప్రధాన ఐపిఓలు రానున్నాయి, వీటి విలువలు ఆ కంపెనీలను టాప్ 10 లిస్టెడ్ కంపెనీల జాబితాలోకి చేర్చనున్నాయి. పలు నివేదికల ప్రకారం.. 100కు పైగా ప్రధాన ప్లాట్‌ఫామ్స్ ఐపిఓల ద్వారా రికార్డు స్థాయిలో 18.5 బిలియన్ డాలర్లు సమీకరించడంతో.. 2025 క్యాలెండర్ సంవత్సరం ఇండియా ప్రైమరీ మార్కెట్‌కు అత్యుత్తమ సంవత్సరంగా నిలిచింది.
గత దశాబ్దంలో భారతదేశంలోని ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లపై ఐపీఓలు దాదాపు ఎనిమిది రెట్లు పెరిగాయని.. ఇందులో ఐదేళ్లలో 300కి పైగా కొత్త లిస్టింగ్‌లు కూడా ఉన్నాయని నివేదిక పేర్కొంది. బలమైన దేశీయ మూలధనం, అధిక కార్పొరేట్ ఆదాయాలు, మెరుగైన నిష్క్రమణ అవకాశాలు, అనుకూలమైన నియంత్రణ వ్యవస్థ వంటివి ఈ వృద్ధికి తోడ్పడ్డాయని కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ నివేదిక తెలిపింది.


Click it and Unblock the Notifications
