Stock Market Crash: దేశీయంగా స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల జోష్ కొనసాగించలేకపోయాయి. ఉదయం నుంచి నష్టాల్లో ట్రేడింగ్ మెుదలుపెట్టిన భారతీయ మార్కెట్లు ఇంట్రాడేలో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లో అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఐటీ, ఆటో, రియల్టీ, మెటల్, పవర్, ఫార్మా రంగాలకు చెందిన సూచీలు 2 శాతం వరకు నష్టపోయాయి. ఈ క్రమంలో ట్రెంట్, వారీ ఎనర్జీస్, బీఎస్ఈ, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు మోస్ట్ యాక్టివ్ ట్రేడింగ్ చూశాయి. ఈ క్రమంలో మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ సూచీ 836 పాయింట్లు కోల్పోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 285 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 401 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 247 పాయింట్ల నష్టాన్ని చూశాయి.

రెండు రోజుల ర్యాలీ తర్వాత నేడు బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఒక శాతం కంటే ఎక్కువ క్షీణించాయి. ఈ క్రమంలో మార్కెట్ల క్షీణతకు దారితీసిన అనేక కారణాలను పరిశీలిస్తే..
- ఈరోజు రాత్రికి యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటనకు ముందు పెట్టుబడిదారులు సైడ్‌లైన్‌లో ఉన్నారు. పోయిన సారి 50 బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటించిన పావెల్ ఈసారి దానిని 25 బేసిస్ పాయింట్లకు కుదిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ట్రంప్ గెలుపుతో 'అమెరికా ఫస్ట్' పాలసీ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో చైనా నుంచి దిగుమతులపై 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతులపై సుంకం 20 శాతం వరకు ఉండొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు. ఈ చర్యలు ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చని అందువల్ల ఫెడ్ రేట్ల తగ్గింపుపై పునరాలోచన అవసరమని ఆయన అన్నారు.
- డొనాల్డ్ ట్రంప్ విక్టరీతో రాబోయే నెలల్లో డాలర్ విలువ మరింతగా బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వివిధ కరెన్సీలపై కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు రూపాయి మారకపు విలువ జీవితకాల సరికొత్త కనిష్ఠాలకు జారిపోయింది.
- ట్రంప్ విజయానికి కొన్ని వారాల ముందు నుంచే విదేశీ మదుపరులు తమ డబ్బును ఇండియన్ మార్కెట్ల నుంచి తీసేస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెగని విదేశీ నిధుల ప్రవాహాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. గత నెలలో రికార్డు స్థాయిలో రూ.94 వేల కోట్లను ఎఫ్ఐఐలు విక్రయించిన సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే వీరు భారతీయ మార్కెట్లలో రూ.4,445.59 కోట్ల విలువైన ఈక్విటీలను ఆఫ్‌లోడ్ చేశారు.
- ఇదే క్రమంలో ప్రపంచ ఇన్వెస్టర్ల చూపు నవంబర్ 8 వరకు జరిగే 14వ ఎన్‌పిసి స్టాండింగ్ కమిటీ సమావేశంపై ఉంది. రానున్న కాలంలో చైనా 10 ట్రిలియన్ యువాన్ల అదనపు రుణాలను తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ చైనా ఉద్దీపన ఆశలతో అక్కడి మార్కెట్లు లాభాల ర్యాలీని కొనసాగిస్తున్నాయి. భారతదేశంలోని ప్రముఖ ఇన్వెస్టర్లు సైతం తమ డబ్బును చైనా ఆథారిత ఈటీఎఫ్‌లలోకి తరలిస్తున్నారు.
- ప్రస్తుతం దేశీయ కార్పొరేట్ కంపెనీలు తమ సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. అయితే పేలవమైన ఫలితాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. కొన్ని రంగాలలో ఆదాయ వృద్ధి మందగించడం వల్ల ఈక్విటీ మార్కెట్లు ప్రతికూలతను చూస్తున్నాయి.
- అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ఏదైనా చైనా వ్యతిరేక వైఖరి భారత్‌కు ప్రయోజనం చేకూర్చవచ్చని తెలుస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌కు భారతీయ ఎగుమతులపై సుంకాలను విధించేందుకు సుముఖంగా ఉండటం భారతీయ వ్యాపారవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే క్రమంలో స్థానికులకు ట్రంప్ ఉద్యోగ అవకాశాలను రిజర్వ్ చేస్తే అది దేశీయ ఐటీ పరిశ్రమకు భారీగా ఖర్చులను పెంచుతుందని టెక్ దిగ్గజ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. కరోనా తర్వాత ఆర్థిక మందగమనంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఐటీ పరిశ్రమకు ట్రంప్ ఎన్నిక కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో టెక్ రంగంలోని లిస్టెడ్ కంపెనీల షేర్లు నేడు నష్టాలను చూశాయి.


Click it and Unblock the Notifications