Markets Victory: ట్రంప్ గెలుపుతో ఇన్వెస్టర్లకు రూ.8 లక్షల కోట్లు లాభం.. మరి నెక్ట్స్ ఏంటి..?
Markets US Election Rally: నేటితో అమెరికా అధ్యక్ష ఎన్నిక వేడి ముగిసింది. ఫలితాల్లో మెుదటి నుంచి సునామీ వేగంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్‌పై పైచేయి సాధించారు. దీనిని ప్రపంచ మార్కెట్లతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లు సైతం స్వాగతించాయి. దీంతో గడచిన వారం రోజులుగా ఒడిదొడుకుల్లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు స్థిరంగా బుల్ ర్యాలీని కొనసాగించాయి.
నేడు భారతీయ స్టాక్ మార్కెట్లు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనట్లు తేలిపోవటంతో ఏర్పడిన ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.7.8 లక్షల కోట్లు పెరుగుదలను చూసింది. ఈ క్రమంలో ప్రధానంగా ఐటీ, ఎనర్జీ, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు ప్రయోజనాన్ని చూశాయి. ఈ క్రమంలో మార్కెట్లోని హెవీ వెయిట్ షేర్లైన ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, ఎల్ అండ్ టి, ఐసీఐసీఐ, ఎయిర్ టెల్ ర్యాలీ లాభాల్లో పాల్గొన్నాయి. దీంతో మార్కెట్లు ముగింపు నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 901 పాయింట్ల లాభంతో ముగియగా మరో కీలక సూచీ నిఫ్టీ 270 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 110 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1240 పాయింట్ల మెగా ర్యాలీని చూశాయి.

అయితే ప్రస్తుతం ట్రంప్ గెలుపు అధికారికంగా ప్రకటించటంతో ఇప్పుడు దేశీయ ఇన్వెస్టర్ల ఆలోచనలు భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం, ఎఫ్ఐఐలు, ఇండియన్ ఎకానమీపై పడ్డాయి. ట్రంప్ రాకతో అమెరికా ఖర్చులు పెరగటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్లలోని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ గెలుపు అమెరికన్ డాలర్ బలాన్ని పెంచుతుందని అయితే వాణిజ్య పరంగా ప్రపంచ దేశాలకు అనేక అడ్డంకులను కలిగించనుందని వారు ఆశిస్తున్నారు. అమెరికాతో భారత వాణిజ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నందున ట్రంప్ గెలుపు ఇండియాకి సానుకూల అంశమేనని ఈక్విరస్‌లోని ఆర్థికవేత్త అనిత రంగన్ అన్నారు. ఎన్నికల ఫలితాలు బహిర్గతం అయినందున ఇకపై మార్కెట్లలో అస్థిరత కుదుటపడుతుందని, పెట్టుబడిదారులు ఫండమెంటల్స్‌పై తిరిగి దృష్టి సారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే భారతీయ స్టాక్ మార్కెట్లను గత నెల నుంచి ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన అంశం ఎఫ్ఐఐలు భారతీయ మార్కెట్లను నిష్క్రమించటమే. అక్టోబర్ 1, 2024 నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ. లక్ష కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. వీరు తమ డబ్బును ప్రస్తుతం చైనా మార్కెట్లలోకి తరలిస్తున్నట్లు వెల్లడైంది. అయితే ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడానికి సిద్ధమౌతున్న వేళ మధ్యకాలం నుంచి దీర్ఘకాలికంగా అమెరికా- డొనాల్డ్ ట్రంప్ రెండింటితో భారత్ నిర్మాణాత్మక సంబంధాల నుంచి సానుకూల ఫలితాలు వెలువడాలని కోరుకుంటున్నట్లు అనిత రంగన్ అన్నారు. ఇదే క్రమంలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నుండి వచ్చిన డేటా ప్రకారం అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు గత దశాబ్దంలో దాదాపు రెండింతలు పెరిగి 77.53 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే తొలిసారి ట్రంప్ పాలనలో భారత ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది.


Click it and Unblock the Notifications