భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త యుగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇక్కడి ఈక్విటీ మార్కెట్ వృద్ధి, దేశ ఆర్థిక పురోగతికి అద్దం పడుతోంది. పబ్లిక్ ఇష్యూల (Public Issues) విషయంలో గతంలో ఊహించని వేగం ఇప్పుడు భారత్‌లో సాధారణం కానుంది. ప్రపంచంలోనే దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన జేపీ మోర్గాన్ (JP Morgan) తాజాగా విడుదల చేసిన నివేదిక భారత IPO మార్కెట్ భవిష్యత్తుపై పాజిటివ్ దృక్పథాన్ని వ్యక్తం చేసింది.

20 బిలియన్ డాలర్ల లక్ష్యం
జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం.. రాబోయే కొన్నేళ్లపాటు భారత మార్కెట్లో ఏటా దాదాపు 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.8 లక్షల కోట్లు) విలువైన ఐపీఓలు (IPO) వస్తాయి. ఇది గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో స్థిరంగా కొనసాగే వృద్ధి రేటుగా మారుతుందని జేపీ మోర్గాన్ పేర్కొంది. వాస్తవానికి 2025లో ఇప్పటికే 21 బిలియన్ల డాలర్లు (రూ. 1.89 లక్షల కోట్లు)కు పైగా విలువైన ఐపీఓలు వచ్చాయని, ఈ నెలాఖరుకు ఇది 23 బిలియన్ డాలర్లకు చేరవచ్చని సంస్థ తెలిపింది. ఈ వృద్ధి.. భారత మార్కెట్ మరింత పరిణతి చెందుతోందనడానికి, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందనడానికి స్పష్టమైన సంకేతం.
ఇతర సమీకరణలు తగ్గుముఖం
ఒకపక్క ఐపీఓల జోరు కొనసాగుతున్నప్పటికీ.. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్‌లో (ECM) మొత్తం నిధుల సమీకరణ కాస్త నెమ్మదించింది. ముఖ్యంగా క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్లు (QIPs), ఇతర ఫాలో-ఆన్ ఆఫరింగ్‌ల (Follow-on Offerings) ద్వారా నిధుల సమీకరణ తగ్గింది. ఉదాహరణకు గత ఏడాది 22 బిలియన్ డాలర్ల QIPలు రాగా.. ఈ ఏడాది అది కేవలం 10 బిలియన్ డాలర్లకే పరిమితమైంది.
దీని ప్రభావాలు ఎలా ఉండొచ్చంటే..
1. మార్కెట్ విచక్షణ: మార్కెట్ చాలా విచక్షణతో వ్యవహరిస్తోందని ఇది సూచిస్తుంది. కొత్తగా లిస్ట్ అయ్యే కంపెనీలపై మదుపరులు ఆసక్తి చూపిస్తున్నా.. ఇప్పటికే లిస్టింగ్ అయిన కంపెనీలకు అదనపు మూలధనం (Additional Capital) సమీకరించడం కష్టతరంగా మారింది. కేవలం స్థిరమైన వృద్ధి ప్రణాళికలు ఉన్న సంస్థలకే మార్కెట్ అండగా నిలుస్తోంది.
2. ఎగ్జిట్ రూట్: స్థిరమైన IPO సరళి ప్రైవేట్ ఈక్విటీ (PE), వెంచర్ క్యాపిటల్ (VC) సంస్థలకు మరింత ఊహించదగిన 'ఎగ్జిట్ రూట్'ను అందిస్తుంది. ఇది ప్రారంభ దశ స్టార్టప్‌లలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.
టెక్, ఫిన్‌టెక్ రంగాలదే అధిక వాటా
వచ్చే అయిదేళ్లలో ఐపీఓ గిరాకీలో ఐదో వంతు వాటా వినియోగదారుల టెక్నాలజీ, కొత్త తరం వ్యాపారాల నుంచే ఉంటుందని, ఇది త్వరలో 30 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. దాదాపు 20 స్టార్టప్‌లు ఐపీఓకు సిద్ధమవుతుండగా.. వాటిలో 4-5 కంపెనీలు 1 బిలియన్ డాలర్ల (రూ. 9000 కోట్లు) కంటే ఎక్కువ విలువైన ఇష్యూలతో మార్కెట్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే.. భారతదేశ మార్కెట్ మరింత లోతైన లిక్విడిటీ అలాగే వైవిధ్యభరితమైన అవకాశాలను అందించడానికి సిద్ధమవుతోంది. రాబోయే ఐదేళ్లలో భారత మార్కెట్ విలువ 10 ట్రిలియన్ డాలర్ల (రూ. 900 లక్షల కోట్లు)కు చేరుకుని.. అమెరికా, చైనా తర్వాత ఈ స్థాయిని చేరుకున్న మూడవ దేశంగా అవతరిస్తుందని జేపీ మోర్గాన్ పేర్కొంది. IPO మార్కెట్‌లో స్థిరత్వం అనేది దీర్ఘకాలిక వృద్ధికి బలమైన సంకేతం.


Click it and Unblock the Notifications