Defence stocks: భారత్-జర్మనీ భారీ రక్షణ ఒప్పందం! ఈ స్టాక్స్‌లో మంచి లాభం పొందే అవకాశం!
భారత రక్షణ రంగం (Defence Sector) ఇప్పుడు మరో భారీ అడుగు వేయబోతోంది. జర్మనీతో కలిసి దాదాపు 8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 66,000 కోట్లు) విలువైన అతిపెద్ద సబ్ మెరైన్ ఒప్పందాన్ని భారత్ ఖరారు చేయబోతోంది. వచ్చే మూడు నెలల్లోనే ఈ డీల్‌పై సంతకాలు జరిగే అవకాశం ఉందని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ వెల్లడించారు. ఈ వార్త బయటకు రావడంతో షేర్ మార్కెట్‌లోని రక్షణ రంగ షేర్లలో ముఖ్యంగా మజ్ గావ్ డాక్ (Mazagon Dock) పై అందరి కళ్లు పడ్డాయి.

భారత్ లోనే తయారవ్వనున్న 6 ఆధునిక సబ్ మెరైన్లు
ఈ ప్రాజెక్టు కింద భారత నావికాదళం కోసం 6 అత్యాధునిక జలాంతర్గాములను (Submarines) నిర్మించనున్నారు. దీని కోసం జర్మనీకి చెందిన 'థైసెన్‌క్రుప్ మెరైన్ సిస్టమ్స్' (TKMS) , భారత్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ 'మజ్ గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్' కలిసి పనిచేయబోతున్నాయి.
ఇందులో ఒక విశేషం ఉంది! జర్మనీ తన సబ్ మెరైన్ తయారీ టెక్నాలజీని ఒక యూరోపియన్ దేశం కాని దేశానికి బదిలీ చేయడం (Technology Transfer) ఇదే మొదటిసారి. అంటే 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా ఈ హైటెక్ జలాంతర్గాములు మన దేశంలోనే తయారవుతాయి.
ఇన్వెస్టర్లకు మైండ్ గేమ్: ఏ షేరులో వేగం పెరుగుతుంది?
ఈ ఒప్పందం వల్ల షేర్ మార్కెట్‌లో డిఫెన్స్ స్టాక్స్ (Defence stocks) కు భారీ డిమాండ్ ఏర్పడనుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న మజ్ గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ షేర్లలో రాబోయే రోజుల్లో మంచి పెరుగుదల కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 66 వేల కోట్ల రూపాయల ఆర్డర్ అంటే అది కంపెనీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది.
రాజనాథ్ సింగ్ జర్మనీ పర్యటన - కీలక అడుగు
మన రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఇటీవల జర్మనీలో పర్యటించినప్పుడు స్వయంగా TKMS షిప్‌యార్డ్‌ను సందర్శించారు. అక్కడ 'టైప్-212' క్లాస్ సబ్ మెరైన్ల పనితీరును, వాటి టెక్నాలజీని పరిశీలించారు. కేవలం సబ్ మెరైన్లే కాకుండా, రెండు దేశాల మధ్య రక్షణ పారిశ్రామిక సహకార రోడ్‌మ్యాప్ , ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ శిక్షణలో సహకారంపై కూడా ఒప్పందాలు జరిగాయి.
మొత్తంగా చూస్తే.. భారత రక్షణ చరిత్రలో ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్‌లలో ఒకటిగా నిలవనుంది. ఇది మన నావికాదళ శక్తిని పెంచడమే కాకుండా, దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీకి పెద్ద ఊతాన్నిస్తుంది. ఇన్వెస్టర్లకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది. అయితే మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది.


Click it and Unblock the Notifications