Multibagger Stock: అప్పర్ సర్క్యూట్లు కొడుతూ వస్తున్న హైదరాబాద్ కంపెనీ.. ఒక్క నెలలో 96 శాతం రాబడి..!
స్టాక్ మార్కెట్ లో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించే స్టాక్స్ ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్ కంపెనీ ఒకటి. ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్లు కొడుతూ వస్తుంది. క్యూబెక్స్ ట్యూబింగ్స్ కంపెనీ షేరు ధర శుక్రవారం 10 శాతం పెరిగింది. ఈ స్మాల్-క్యాప్ స్టాక్ షేర్లు గత నాలుగు ట్రేడింగ్ రోజులుగా భారీగా పెరిగాయి. ఈ కాలంలో ఈ స్టాక్ పదేపదే అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. గత వారంలో ఈ స్టాక్ ధర 78 శాతం పెరిగింది. శుక్రవారం బీఎస్ఈలో ఈ స్టాక్ రూ.149.70 వద్ద అధికంగా ప్రారంభమైంది. ఈ కంపెనీ షేర్లు ఇంట్రాడే గరిష్టంగా రూ.152.16 కు చేరుకుని, దాని 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి.
ఈ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.73.15. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.217.88 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కాపర్ (రాగి), ఇతర కాపర్ మిశ్రమ లోహాల రంగానికి చెందిన భారతీయ తయారీ సంస్థ. రాగి, రాగి మిశ్రమ లోహాలతో ఇది సీమ్‌లెస్ ట్యూబ్స్, రాడ్స్, బస్ బార్‌లు, వైర్లను తయారు చేస్తుంది. వీటిని పవర్ ప్లాంట్లు, రిఫైనరీలు, ఓడల నిర్మాణం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ స్టాక్ ఒకటీ, రెండు కాదు వరుసగా 4 సెషన్లు ఇది అప్పర్ సర్క్యూట్లను తాకింది. చివరిగా సెప్టెంబర్ 21న ఈ స్టాక్ ధర రూ. 87.38 వద్ద ఉంది.

సెప్టెంబర్ 22, 23 న 20 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 125.82 కు పెరిగింది. అక్కడి నుంచి మళ్లీ వరుసగా రెండు రోజులు సెప్టెంబర్ 24, 25 సెషన్లలో 10 శాతం మేర అప్పర్ సర్క్యూట్లను తాకి రూ. 152.24 చేరింది. 4 రోజుల్లోనే షేరు ధర 74 శాతం, 5 రోజుల్లో 79 శాతం పెరిగింది. ఒక నెలలో 96 శాతం రాబడి ఇచ్చింది. కంపెనీ నిధుల సమీకరణ ప్రక్రియకు ఆమోదం తెలిపిన తర్వాత, దాని షేర్లు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ ఈ డబ్బును డెట్ సెక్యూరిటీల ద్వారా సమీకరించేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ బోర్డు సెప్టెంబర్ 17న దీనికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అక్టోబర్ 28న కంపెనీ EGM జరగనుంది, అక్కడ ఈ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరనుంది. క్యూబెక్స్ ట్యూబింగ్స్ షేరు ధర రెండేళ్లలో 43 శాతం పెరిగింది. మూడేళ్లలో ఈ స్టాక్ 219 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇదే కాలంలో సెన్సెక్స్ సూచీ కేవలం 12 శాతం రాబడిని మాత్రమే ఇచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
