సుప్రీంకోర్టు వ్యాఖ్యల ఎఫెక్ట్.. నిమిషాల వ్యవధిలో కుప్పకూలిన హాస్పిటల్ షేర్లు.. ఎంతలా అంటే..
Hospital Stocks Crash: దేశీయ స్టాక్ మార్కెట్లో బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఆసుపత్రి రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. ట్రేడింగ్ మొదలైన మొదటి అరగంటలోనే ఈ విభాగంలోని ప్రధాన స్టాక్స్ దాదాపు ఏడు శాతం వరకు క్షీణించి పెట్టుబడిదారులను తీవ్ర ఆందోళనలోకి నెట్టివేశాయి.
ఇటీవల భీమా రంగానికి సంబంధించి ప్రభుత్వం తెచ్చిన కఠినమైన నిబంధనల తరహాలోనే, ఆసుపత్రి రంగానికి కూడా కఠిన మార్గదర్శకాలు అమలు చేయవచ్చనే వార్తలు ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికి తోడు ప్రాణరక్షక నిత్యావసర మందులు, వైద్య సామాగ్రి ధరల దోపిడీపై సుప్రీంకోర్టు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు, మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ వెల్లడించిన నిజాలు.. ఆసుపత్రుల రాబడిపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే భయాలను వ్యాపింపజేశాయి.
ఈ భయాల ప్రభావం ప్రధాన ఆసుపత్రి నెట్‌వర్క్‌ల షేర్ల ట్రేడింగ్‌లో స్పష్టంగా కనిపించింది. ప్లాటినం రకం సేవలను అందించే ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేరు ప్రారంభ ట్రేడింగ్‌లోనే ఐదు శాతానికి పైగా పడిపోయి, తన మునుపటి ముగింపు ధర రూ. 819 నుండి రూ. 773 స్థాయికి చేరుకుంది. అలాగే మ్యాక్స్ హెల్త్‌కేర్ షేరు కూడా ఏడు శాతానికి పైగా క్షీణించి, రూ. 984 వద్ద ఉన్న మునుపటి క్లోజింగ్ నుండి ఏకంగా రూ. 915కి దిగజారింది.

ఆసుపత్రి రంగంలో దూసుకుపోతున్న యథార్థ్ హాస్పిటల్ షేరు సైతం రూ. 1106 నుండి రూ. 1048కి పడిపోయి.. ఐదు శాతానికి పైగా నష్టాన్ని నమోదు చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ అయిన అపోలో హాస్పిటల్స్ షేరు సైతం ప్రారంభంలోనే ఆరు శాతానికి పైగా కుప్పకూలి.. రూ. 8702 మునుపటి ముగింపు ధర నుండి ఏకంగా రూ. 8175 వద్ద ట్రేడై పెట్టుబడిదారుల సొమ్మును ఆవిరి చేసింది.
ఈ అనూహ్య పతనానికి గల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రముఖ మార్కెట్ నిపుణుడు ధర్మేష్ కాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం భీమా రంగంలో పారదర్శకత పెంచేందుకు కఠిన చర్యలు చేపడుతున్న తరహాలోనే కార్పొరేట్ ఆసుపత్రుల విధానాలపై కూడా గట్టి నిఘా ఉంచబోతోందనే వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే ఆసుపత్రి గది అద్దెలపై ధరల పరిమితి విధిస్తారనే నివేదికలు ఉన్న నేపథ్యంలో.. ఇతర వైద్య సేవలు, వినియోగ వస్తువుల ధరలను కూడా నియంత్రిస్తే కార్పొరేట్ ఆసుపత్రుల లాభదాయకత బాగా తగ్గిపోతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సుప్రీంకోర్టు గురువారం నాటి విచారణలో చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు మరింత బలాన్నిచ్చాయి. నేటి కాలంలో కార్పొరేట్ ఆసుపత్రులు కేవలం లాభాపేక్ష కలిగిన వ్యాపార పరిశ్రమల్లాగా మాత్రమే పనిచేస్తున్నాయని అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా మండిపడింది. అత్యవసరమైన ప్రాణరక్షక మందుల ధరలను ప్రశ్నిస్తూ, ఈ క్రమంలో సామాన్యుల నుంచి పిండుకుంటున్న సొమ్ము ఎక్కడికి వెళ్తోందో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టు వద్ద సమయం కోరింది.
మరోవైపు, రోగుల నుంచి ఆసుపత్రులు వివిధ వైద్య సామాగ్రి మరియు శస్త్రచికిత్స వస్తువులపై ఎంత దారుణంగా వసూలు చేస్తున్నాయో వివరిస్తూ మహారాష్ట్ర ఆహార మరియు ఔషధ పరిపాలన కమిషనర్ తుకారాం ముండే సంచలన నివేదికను సమర్పించారు. ఆసుపత్రులు కొనుగోలు చేసే ధరలకు, రోగులకు వేసే గరిష్ట చిల్లర ధరలకు మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉందని ఆ సర్వే వెల్లడించింది. కొన్ని ఆసుపత్రులైతే తాము కొనుగోలు చేసిన ధరల కంటే ఏకంగా 29 రెట్లు ఎక్కువ ధరకు ఆయా సామాగ్రిని రోగులకు విక్రయిస్తున్నట్లు స్పష్టమైంది.
ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం వైద్య పరికరాల ధరల సమీక్షను వేగవంతం చేసింది. గది అద్దెలు, ఔషధాలు, వైద్య పరికరాల కొనుగోలు ధరలపై పరిమితులు విధిస్తే కార్పొరేట్ ఆసుపత్రుల ఆదాయం భారీగా తగ్గిపోతుందనే అంచనాతోనే ఇన్వెస్టర్లు ఒకేసారి ఆసుపత్రి రంగానికి చెందిన షేర్లను విక్రయించడానికి పోటీ పడ్డారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

