బంగారం ఈ రేటుకు దిగి వచ్చినప్పుడు మాత్రమే కొనండి.. కీలక సూచన చేస్తున్న బ్యాంకింగ్ రంగ నిపుణులు
భారత బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 3న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడైన గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,06,289 వరకు ఎగసింది. ఇంతకు ముందు ఎన్నడూ తాకని స్థాయిని నమోదు చేసింది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు 3,500 డాలర్ల మార్క్ దగ్గర స్థిరపడి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ పెరుగుదల వెనుక పలు ప్రధాన కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించబోతుందనే అంచనాలు బంగారానికి ప్రధాన బలం ఇస్తున్నాయి. CME గ్రూప్ ఫెడ్‌వాచ్ టూల్ ప్రకారం, సెప్టెంబర్ 17 సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల రేటు కోతకు 90 శాతానికి పైగా అవకాశముందని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అమెరికా డాలర్ ఈ ఏడాది ఇప్పటివరకు 9 శాతం బలహీనపడటం వల్ల విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు పెరిగాయి.

దేశీయంగా, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్నందున ఆభరణాల డిమాండ్ బలపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నవరాత్రి నుండి దీపావళి వరకు కొనుగోళ్లు పెరుగుతాయని, ఇప్పటికే జువెల్లర్స్ షాపు యజమానులు ప్రీమియంలను కోట్ చేయడం ప్రారంభించారని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం సరఫరాపై పడటంతో ధరలు మరింతగా పైకి ఎగబాకుతున్నాయి.
అంతర్జాతీయంగా చూస్తే... చైనా, రష్యా వంటి దేశాలు Gold నిల్వలను పెంచుతూ డాలర్‌పై ఆధారపడటం తగ్గిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చా దేశాల కేంద్ర బ్యాంకులు తమ రిజర్వ్‌లను బంగారంలో విభజించడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వాణిజ్య యుద్ధ అనిశ్చితి.. ఇవన్నీ కలిపి బంగారానికి డిమాండ్ ఏర్పరస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విశ్లేషకులు పెట్టుబడిదారులకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే భారీ పెరుగుదల తరువాత కొనుగోలు చేయడం వల్ల స్వల్పకాలిక పెట్టుబడిదారులు నష్టపోయే అవకాశం ఉంది. MCXలో గోల్డ్ ధరలు రూ. 1,03,500 - రూ. 1,08,000 మధ్య ట్రేడ్ అవుతాయని.. రూ. 1,07,500 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉన్నదని Gold అనలిస్ట్‌లు చెబుతున్నారు. అంటే తక్షణ కాలంలో లాభాల కంటే రిస్క్ ఎక్కువగా ఉండవచ్చని సూచిస్తున్నారు. కాబట్టి బంగారం ధరలు రూ. 99 వేల మధ్యకు వచ్చినప్పుడు కొనడం చాలా ఉత్తమమని చెబుతున్నారు. లేకుంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువని సూచిస్తున్నారు.
అయినప్పటికీ దీర్ఘకాలికంగా బంగారం సానుకూల దిశలోనే కొనసాగుతుందని ఎక్కువ మంది విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని చేర్చుకోవడం ద్వారా పెట్టుబడిదారులు దానిని వ్యూహాత్మక పెట్టుబడిగా మార్చుకోవచ్చు. ఆభరణాల కొనుగోళ్లు ఛార్జీల కారణంగా తక్కువ విలువను అందించగా.. బంగారు నాణేలు లేదా ETFలు పెట్టుబడి దృష్ట్యా మెరుగైన ఎంపికగా పలువురు భావిస్తున్నారు.
పండుగ డిమాండ్, ప్రపంచ కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా ఆర్థిక విధాన మార్పులు కలిసి బంగారాన్ని దాని తదుపరి పెరుగుదల దశలోకి నడిపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెలల్లో MCXలో బంగారం ధరలు రూ. 1,15,000 - రూ. 1,20,000 మధ్యకు చేరుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications