IPO News: ఐపీవో లిస్టింగ్ తర్వాత ఢమాల్.. పోటీపడి స్టాక్ అమ్మేస్తున్న ఇన్వెస్టర్స్..
Garuda Construction IPO: చాలా గ్యాప్ తర్వాత మళ్లీ దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం మెుదలైంది. ఈ క్రమంలో హ్యుందాయ్ మోటార్స్ ఐపీవో పెట్టుబడిదారుల కోసం తెరచుకోగా, మరోపక్క ఐపీవోల లిస్టింగ్ కొనసాగుతోంది. గతవారం ఐపీవోలు డిస్కౌంటెడ్ లిస్టింగ్ నమోదు చేసి నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు తగ్గాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గరుడ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఐపీవో గురించే. నేడు దేశీయ స్టాక్ మార్కెట్లోని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కంపెనీ షేర్లు లిస్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ఒక్కో షేరు బీఎస్ఈలో 5.26 శాతం ప్రీమియం రేటు రూ.100 వద్ద అరంగేట్రం చేసింది. ఇదే క్రమంలో ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు నేడు 10.5 శాతం ప్రీమియం ధర రూ.105 వద్ద జాబితా అయ్యాయి. విజయవంతమైన లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లను అమ్మేందుకు పెట్టుబడిదారులు ఎగబడటంతో స్టాక్ ధర క్షీణించి బీఎస్ఈలో ఇంట్రాడేలో కనిష్ట స్థాయి రూ.101.54కి చేరుకోగా, ఎన్ఎస్ఈలో 2 శాతం క్షీణతను నమోదు చేసింది.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.264.10 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఈ క్రమంలో కంపెనీ ఇన్వెస్టర్లకు 1.83 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించగా, మిగిలిన రూ.90.25 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించింది. ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్లకు అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 10 వరకు ఇష్యూ తెరచి ఉంది. ఈ క్రమంలో కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.90-95గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 157 షేర్లుగా ఉంచటంతో కనీసం 1 లాట్ కొనుగోలుకు ఇన్వెస్టర్లు రూ.14,915 వెచ్చించారు. యాంకర్ ఇన్వెస్టర్లకు 50 శాతానికి 30 రోజులు లాకిన్ పిరియడ్ ఉండగా, మిగిలిన వాటాలను 90 రోజులు ముగిసిన తర్వాత విక్రయించేందుకు అవకాశం ఉంది.
గరుడ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ 2010లో స్థాపించబడింది. కంపెనీ రెసిడెన్షియల్, కమర్షియల్, రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్‌ల కోసం కంపెనీ ఎండ్-టు-ఎండ్ సివిల్ నిర్మాణాన్ని అందిస్తుంది. కంపెనీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సేవలతో పాటు నిర్మాణ సేవల్లో భాగంగా పనులు పూర్తి చేయడం వంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తోంది. కంపెనీ తాజా ఐపీవో నుంచి సమీకరించిన సొమ్ములో రూ.100 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించాలని ప్లాన్ చేస్తోంది. మౌలిక సదుపాయాలు, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్‌ల కోసం అదనపు సేవలను కూడా అందిస్తోంది.
కంపెనీ మూడు రోజుల ఐపీవో ఆఫర్ సమయంలో 7.55 సార్లు సభ్యత్వం పొందింది. గరుడ కన్‌స్ట్రక్షన్ ఇష్యూ సాధారణ ఇన్వెస్టర్ల కోసం తెరచుకోవటానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.75 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ప్రస్తుతం కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు PKH వెంచర్స్ ద్వారా 95 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచింది.


Click it and Unblock the Notifications