ఆదివారం స్టాక్ మార్కెట్ ఓపెన్.. నవంబర్ 10న సెలవు.. ముహూర్తపు ట్రేడింగ్ సెషన్ పూర్తి వివరాలు ఇవే..
Diwali Stock Market Timings: నూతన విక్రమ సంవత్సరం సం. 2083 వేళ భారత ఈక్విటీ మార్కెట్ నిఫ్టీ 50 తన చరిత్రలోనే అత్యుత్తమ వారపు పనితీరుతో (దాదాపు 8% లాభంతో) దీపావళి వేడుకలకు స్వాగతం పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా వాల్ స్ట్రీట్, ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిరంతర కొనుగోళ్లు, పడిపోతున్న ముడి చమురు ధరల మద్దతుతో దేశీయ సూచీలు బలమైన ర్యాలీని కొనసాగించాయి.
శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ కీలకమైన 25,000 మార్కును అధిగమించగా.. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,718 పాయింట్లు ఎగబాకి రికార్డు లాభాలతో ముగిసింది. 30 సెన్సెక్స్ కంపెనీలలో మహీంద్రా & మహీంద్రా Q2FY27 లో అద్భుతమైన ఫలితాలను ప్రకటించడంతో షేరు ధర 6.11% పెరిగింది. వీటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ముందంజలో నిలవగా.. పవర్ గ్రిడ్ మాత్రమే స్వల్ప నష్టాన్ని నమోదు చేసింది.

దీపావళి 2026: ముహూర్తపు ట్రేడింగ్ సెషన్ తేదీ, వేళలు:
హిందూ సంప్రదాయం ప్రకారం సమృద్ధి, ఆర్థిక పురోగతికి చిహ్నంగా భావించే ప్రత్యేక ముహూర్తపు ట్రేడింగ్ సెషన్ (Muhurat Trading) ఆదివారం, నవంబర్ 8, 2026 న నిర్వహించబడుతుంది. క్రమబద్ధమైన సాధారణ ట్రేడింగ్ సెలవుదినం అయినప్పటికీ.. ఈ శుభ ముహూర్తంలో పెట్టుబడిదారులు టోకెన్ ప్రాతిపదికన కొనుగోళ్లు చేయడానికి ఎన్‌ఎస్‌ఈ (NSE), బీఎస్‌ఈ (BSE) లు 1 గంట నిడివి గల ప్రత్యేక ట్రేడింగ్‌ను అందుబాటులో ఉంచుతాయి.
ముహూర్త ట్రేడింగ్ సెషన్ పూర్తి వివరాలు:
ట్రేడింగ్ తేదీ: ఆదివారం, నవంబర్ 8, 2026
బ్లాక్ డీల్ విండో: మధ్యాహ్నం 1:50 నుండి 2:05 వరకు
ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్: మధ్యాహ్నం 2:05 గంటలకు ప్రారంభం
లిమిట్ & మార్కెట్ ఆర్డర్లు: మధ్యాహ్నం 2:05 నుండి 2:10 గంటల వరకు
కేవలం లిమిట్ ఆర్డర్లు: మధ్యాహ్నం 2:10 నుండి 2:15 గంటల వరకు
ఆర్డర్ మ్యాచింగ్ & నిర్ధారణ: మధ్యాహ్నం 2:15 నుండి 2:17 గంటల వరకు
సాధారణ ఈక్విటీ ట్రేడింగ్ సమయం: మధ్యాహ్నం 2:20 గంటల నుండి 3:30 గంటల వరకు
పోస్ట్-క్లోజింగ్ సెషన్: మధ్యాహ్నం 3:50 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు
మార్కెట్ సెలవుదినం వివరాలు:
దీపావళి పండుగ, బలిప్రతిపద సందర్భంగా నవంబర్ 10, 2026 (మంగళవారం) నాడు భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ మూసివేయబడతాయి. ఆ రోజున క్యాపిటల్ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR), డెట్ మార్కెట్ విభాగాలు రద్దవుతాయి. గత 10 సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే.. 8 సందర్భాలలో ముహూర్తపు ట్రేడింగ్ సెషన్లు లాభాల్లోనే ముగియడం విశ్లేషకులు సుభసూచకంగా భావిస్తున్నారు. నూతన విక్రమ సంవత్సరం సం. 2083 వేళ ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో సుదీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం పసిడి, బ్లూ-చిప్ షేర్లలో టోకెన్ పెట్టుబడులు పెట్టడానికి ఈ సెషన్ అనువుగా నిలవనుంది.
నూతన విక్రమ సంవత్సరం 2083 (విక్రమ శకం) అంటే ఏమిటి..
కార్తీక శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమవుతుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ (ఆంగ్ల సంవత్సరం) ప్రకారం ఇది సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ 2026 లో వస్తుంది. ఉత్తర భారతదేశంలో దీపావళి మరుసటి రోజును నూతన సంవత్సరంగా (గుజరాత్ మరియు కొన్ని ఇతర ప్రాంతాలలో) జరుపుకుంటారు. 2083 అనేది విక్రమ శకం (Vikram Samvat) క్యాలెండర్ యొక్క సంవత్సరం. ఇది మనం రోజూ ఉపయోగించే ఇంగ్లీష్ క్యాలెండర్ (గ్రెగోరియన్ క్యాలెండర్) కంటే 57 సంవత్సరాలు ముందు ఉంటుంది.
ప్రస్తుతం మనకు నడుస్తున్న ఇంగ్లీష్ సంవత్సరం 2026. దీనికి 57 సంవత్సరాలు కలిపితే విక్రమ సంవత్సరం 2083 వస్తుంది (2026 + 57 = 2083). ఉజ్జయిని రాజు అయిన విక్రమాదిత్యుడు శకులపై సాధించిన విజయానికి గుర్తుగా క్రీస్తుపూర్వం 57 (57 BCE) లో ఈ శకాన్ని ప్రారంభించారు. ఉత్తర భారతదేశంలో, గుజరాత్ వంటి ప్రాంతాలలో సాంప్రదాయ పండుగలు, ముహూర్తాలు, జ్యోతిష్యం కోసం ఈ విక్రమ క్యాలెండర్‌నే ప్రాధాన్యంగా చూస్తారు. తెలుగు ప్రజలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) విక్రమ శకాన్ని కాకుండా శాలివాహన శకాన్ని (Saka Samvat) అనుసరిస్తారు. దీని ప్రకారం ప్రస్తుతం మనకు నడుస్తున్నది శాలివాహన శకం 1948.


Click it and Unblock the Notifications